Share News

Cheteshwar Pujara: డబుల్ సెంచరీతో పుజారా విశ్వరూపం.. రీఎంట్రీ ఖాయమా?

ABN , Publish Date - Jan 07 , 2024 | 02:04 PM

Ranji Trophy: ఫామ్ లేమితో టీమిండియాలో చోటు కోల్పోయిన వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా రంజీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా పరుగుల వరద పారిస్తున్నాడు. 35 ఏళ్ల వయసులోనూ డబుల్ సెంచరీ బాది తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.

Cheteshwar Pujara: డబుల్ సెంచరీతో పుజారా విశ్వరూపం.. రీఎంట్రీ ఖాయమా?

రాజ్‌కోట్: ఫామ్ లేమితో టీమిండియాలో చోటు కోల్పోయిన వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా రంజీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా పరుగుల వరద పారిస్తున్నాడు. 35 ఏళ్ల వయసులోనూ డబుల్ సెంచరీ బాది తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఈ నెల చివరలో ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్ రేసులో తాను కూడా ఉన్నానని చాటి చెప్పాడు. రంజీ ట్రోఫీ 2024లో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లోనే జార్ఖండ్‌తో జరిగిన పోరులో పెను విధ్వంసం స‌ృష్టించాడు. అజేయ డబుల్ సెంచరీతో జార్ఖండ్ బౌలర్లపై విరుచుకుపడిన పుజారా పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో జార్ఖండ్‌కు భారీ స్కోర్ అందించాడు. 157 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన పుజారా మొదటి సెషన్‌లోనే డబుల్ సెంచరీని అందుకున్నాడు. మొత్తంగా 356 బంతులు ఎదుర్కొన్న పుజారా 30 ఫోర్లతో 243 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.


పుజారా అజేయ డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర భారీ స్కోర్ చేసింది. 578/4 వద్ద తమ స్కోర్‌ను డిక్లేర్ చేసింది. పుజారాకు తోడు సెంచరీతో చెలరేగిన ప్రేరక్ మన్కడ్(104) కూడా నాటౌట్‌గా నిలిచాడు. పుజారా, మన్కడ్ కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 256 పరుగులు జోడించారు. హర్విక్ దేశాయి(85), జాక్సన్(54) కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో జార్ఖండ్ జట్టు 142 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్రకు 436 పరుగుల భారీ అధిక్యం లభించింది. ఈ నెల చివరి నుంచి భారత్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు సెలెక్టర్లు త్వరలోనే టీమిండియా స్క్వాడ్‌ను ఎంపిక చేయనున్నారు. తాజా డబుల్ సెంచరీతో పుజారా ఎంపిక విషయమై కూడా సెలెక్టర్లు చర్చించనున్నారు. అతడి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పుజారాకు జట్టులో చోటు కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే పుజారా గతంలో కూడా ఓ సారి ఫామ్ లేమితో జట్టులో చోటు కోల్పోయాడు. కౌంటీల్లో సెంచరీలు, డబుల్ సెంచరీలతో చెలరేగి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ భారత జట్టులో మళ్లీ విఫలమయ్యాడు. దీంతో పుజారాపై మరోసారి వేటు తప్పలేదు. కాగా పుజారా చివరగా భారత జట్టుకు గత జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో ప్రాతినిధ్యం వహించాడు.

Updated Date - Jan 07 , 2024 | 02:04 PM