Share News

IPL 2024: మహిళా ఛాంపియన్స్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన కోహ్లీ అండ్ టీం

ABN , Publish Date - Mar 19 , 2024 | 08:59 PM

డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టును వారి పురుషుల జట్టు గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించింది.

IPL 2024: మహిళా ఛాంపియన్స్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన కోహ్లీ అండ్ టీం

డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టును వారి పురుషుల జట్టు గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించింది. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌‌లో విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లిసెస్ వంటి దిగ్గజాలతో కూడిన ఆర్సీబీ పురుషుల జట్టు మహిళా జట్టు ఆటగాళ్లను అభినందించింది. పురుషుల జట్టు ఆటగాళ్లు ఇరువైపుల నిలబడి మహిళా క్రికెటర్లను చప్పట్లతో మైదానంలోకి ఆహ్వానించారు. ముందుగా కెప్టెన్ స్మృతి మందాన ట్రోఫితో మైదానంలోకి అడుగుపెట్టగా ఇతర క్రీడాకారిణులు ఆమెను అనుసరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి చాలా మంది ఆర్సీబీ అభిమానులు స్టేడియంలోకి వచ్చారు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిప్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లు మహిళా క్రికెటర్లను ప్రత్యేకంగా అభినందించారు. వారితో సెల్ఫీలు కూడా దిగారు.


అనంతరం ట్రోఫీతో అభిమానులకు అభివాదం చేస్తూ మహిళా క్రికెటర్లు మైదానం మొత్తం తిరిగారు. కాగా డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ట్రోపీ గెలిచింది. అలాగే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కూడా ఆర్సీబీ ఆటగాళ్లే గెలుచుకున్నారు. ఆరెంజ్ క్యాప్‌ను ఎల్లీస్ పెర్రీ, పర్పుల్ క్యాప్‌ను శ్రేయాస్ పాటిల్ అందుకుంది. కాగా ఈ అన్‌బాక్స్ ఈవెంట్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం తమ యూట్యూబ్ చానెల్‌తోపాటు అన్నీ సోషల్ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్ చేసింది. కాగా ఐపీఎల్ 2024 ఈ నె 22 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నైసూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 08:59 PM