RCB vs RR: అజేయ సెంచరీతో విరాట్ కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులివే!
ABN , Publish Date - Apr 06 , 2024 | 10:14 PM
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 12 ఫోర్లు, 4 సిక్సులతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
జైపూర్: ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 12 ఫోర్లు, 4 సిక్సులతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీకి డుప్లిసెస్(44) కూడా సహకరించాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 2, బర్గర్ ఒక వికెట్ తీశారు. అయితే అజేయ సెంచరీతో చెలరేగిన కోహ్లీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
1. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 12 ఫోర్లు బాదాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ మొత్తంగా 672 పోర్లు బాదాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 662 ఫోర్లు బాదిన డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలుకొట్టాడు. 766 ఫోర్లు బాదిన శిఖర్ ధావన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.
2. ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ 7,500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 7,500 పరుగులు చేసిన మొట్ట మొదటి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 242 మ్యాచ్‌లాడిన కోహ్లీ 38 సగటుతో 7,579 పరుగులు చేశాడు. ఇందులో 52 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి.
3. అన్ని ఫార్మాట్ల టీ20 క్రికెట్‌లో కలిపి కోహ్లీకి ఇది 9వ సెంచరీ. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలో ఎనిమిదేసి సెంచరీల చొప్పున చేసిన ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, మైఖేల్ క్లింగర్‌ను కోహ్లీ అధిగమించాడు. 22 సెంచరీలు చేసిన క్రిస్ గేల్, 11 సెంచరీలు చేసిన బాబర్ అజామ్ ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
4. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కోహ్లీ మరింత మెరుగుపరచుకున్నాడు. కోహ్లీకి ఇది 8వ సెంచరీ. 6 సెంచరీలు చేసిన క్రిస్ గేల్ రెండో స్థానంలో ఉన్నాడు.
5. ఐపీఎల్ చరిత్రలో మొదటి వికెట్‌కు అత్యధిక పరుగులు నెలకొల్పిన జోడిల జాబితాలో కోహ్లీ-డుప్లిసెస్ జోడి నాలుగో స్థానానికి చేరుకుంది. వీరిద్దరు కలిసి ఆర్సీబీ మొదటి వికెట్‌కు ఇప్పటివరకు 1432 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి వికెట్‌కు 1401 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్-జానీ బెయిర్ స్టో రికార్డును వీరు అధిగమించారు. ఈ జాబితాలో 2,220 పరుగులతో డేవిడ్ వార్నర్-శిఖర్ ధావన్ జోడి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గౌతం గంభీర్-రాబిన్ ఊతప్ప(1478), శిఖర్ ధావన్-పృథ్వీ షా(1461) జోడిలు ఉన్నాయి.
6. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు-రాజస్థాన్ తలపడిన ఓ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రెండో జోడిగా కోహ్లీ-డుప్లిసెస్ నిలిచారు. 2021లో అజేయంగా 181 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ-దేవదత్ పడిక్కల్ జోడి ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది.
7. ఐపీఎల్ చరిత్రలో 100 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకోవడం కోహ్లీకి ఇది 28వ సారి. దీంతో అత్యధిక సార్లు 100 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్న రికార్డును కోహ్లీ మరింత మెరుగు పరచుకున్నాడు. 26 సార్లు సెంచరీ భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్న డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
8. తొలి వికెట్‌కు విరాట్ కోహ్లీ-ఫాప్ డుప్లిసెస్ కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఇది ఐదో సారి. దీంతో ఐపీఎల్ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక సార్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మూడో జోడిగా నిలిచారు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్- శిఖర్ ధావన్(6 సార్లు), డేవిడ్ వార్నర్-బెయిర్ స్టో(5 సార్లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
9. ఐపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కైనా కోహ్లీ-డుప్లిసెస్ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఇది ఆరోసారి. దీంతో ఈ జాబితాలో వీరి జోడి నాలుగో స్థానంలో నిలిచింది. కోహ్లీ-డివిల్లియర్స్(10 సార్లు), కోహ్లీ-గేల్(9), వార్నర్-ధావన్(6) జోడీలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
10- ఈ మ్యాచ్‌లో కోహ్లీ సాధించిన 113 పరుగులు ఈ సీజన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. అలాగే ఈ సీజన్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ కూడా కోహ్లీ. అంతేకాకుండా ఈ సీజన్‌లో ఇప్పటివరకు పవర్‌ప్లేలో అత్యధికంగా 121 పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.
11. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 67 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్‌లో ఎక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాటర్‌గా మనీష్ పాండేను సమం చేశాడు. 2009లో ఆర్సీబీ తరఫుననే మనీష్ పాండే కూడా డెక్కన్ చార్జర్స్‌పై 67 బంతుల్లో సెంచరీ చేశాడు.
12. టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లు కల్గిన జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. ఆర్సీబీ బ్యాటర్లు 18 సెంచరీలు చేశారు. ఈ క్రమంలో 17 సెంచరీలు చేసిన టీమిండియాను ఆర్సీబీ అధిగమించింది.
13. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధికంగా 731 పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. 29 ఇన్నింగ్స్‌ల్లో 156 స్ట్రైట్ రేటుతో కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో గతంలో ధావన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SRH vs CSK: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సీఎస్కే ఓడిపోయిందని ఏకంగా..
SRH vs CSK: ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడా..? అందుకే రివ్యూకు వెళ్లలేదా..?