SRH vs PBKS: సన్‌రైజర్స్‌ను ఆదుకున్న విశాఖ కుర్రాడు.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..
ABN , Publish Date - Apr 09 , 2024 | 09:32 PM
మన విశాఖ కుర్రాడు చెలరేగాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కష్టాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆదుకున్నాడు. ఇతర బ్యాటర్ల వైఫల్యం కారాణంగా స్వల్ప స్కోర్‌కే పరిమితం కావాల్సిన హైదరాబాద్‌ను తన దూకుడైన ఆటతో ఏపీలోని విశాఖపట్నానికి చెందిన 20 ఏళ్ల కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి గట్టెక్కించాడు.
చండీఘడ్: మన విశాఖ కుర్రాడు చెలరేగాడు. పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) మ్యాచ్‌లో కష్టాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టును ఆదుకున్నాడు. ఇతర బ్యాటర్ల వైఫల్యం కారాణంగా స్వల్ప స్కోర్‌కే పరిమితం కావాల్సిన హైదరాబాద్‌ను తన దూకుడైన ఆటతో ఏపీలోని విశాఖపట్నానికి చెందిన 20 ఏళ్ల కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish kumar Reddy) గట్టెక్కించాడు. ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తన బ్యాటింగ్‌తో మందకొడిగా సాగుతున్న సన్‌రైజర్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడంతోపాటు దూకుడు మీదున్న పంజాబ్ బౌలర్లకు అడ్డుకట్ట వేశాడు. ఒక రకంగా చెప్పాలంటే పంజాబ్ బౌలర్లను విశాఖ కుర్రాడు ఉతికారేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (4/29) చెలరేగాడు. అతనికి హర్షల్ పటేల్(2/30), సామ్ కర్రాన్ (2/41) సహకరించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్‌ప్లేలో 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో ట్రావిస్ హెడ్(21), మాక్రమ్(0)ను అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతిదైనా ఐదో ఓవర్లో అభిషేక్ శర్మ(16)ను సామ్ కర్రాన్ ఔట్ చేశాడు. దీంతో 39 పరుగులకే హైదరాబాద్ టాప్ 3 వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి సన్‌రైజర్స్ జట్టు 40 పరుగులు మాత్రమే చేసింది. హర్షల్ పటేల్ వేసిన 10వ ఓవర్లో ఔటైన రాహుల్ త్రిపాఠి(11) మరోసారి నిరాశపరిచాడు. దీంతో 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో హైదరాబాద్‌ను విశాఖపట్నం కుర్రాడు నితీష్ రెడ్డి ఆదుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 36 పరుగులు, అబ్దుల్ సమద్‌తో కలిసి ఆరో వికెట్‌కు 20 బంతుల్లోనే 50 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 3 ఫోర్లు, 4 సిక్సులతో 32 బంతుల్లోనే నితీష్ రెడ్డి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో నితీష్ రెడ్డికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 15వ ఓవర్లో రెండు ఫోర్లు, 2 సిక్సులు బాదడంతోపాటు 2 పరుగులు తీసిన నితీష్ రెడ్డి ఏకంగా 22 పరుగులు రాబట్టాడు.
9 పరుగులు చేసిన క్లాసెన్‌ను హర్షల్ పటేల్, 12 బంతుల్లోనే 25 పరుగులు చేసిన అబ్దుల్ సమద్‌ను 16వ ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 150 పరుగులకు హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయింది. అదే ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఔటయ్యాడు. 37 బంతులు ఎదుర్కొన్న నితీష్ రెడ్డి 4 ఫోర్లు, 5 సిక్సులతో 37 బంతుల్లో 64 పరుగులు చేశాడు. 18వ ఓవర్లో కెప్టెన్ పాట్ కమిన్స్(3)ను రబాడ క్లీన్ బౌల్డ్ చేయడంతో 155 పరుగులకు సన్‌రైజర్స్ 8 వికెట్లు కోల్పోయింది. కర్రాన్ వేసిన చివరి ఓవర్ చివరి బంతిని జయదేవ్ ఉనద్కత్ సిక్సు బాదడంతో హైదరాబాద్ స్కోర్ 180 పరుగులు దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4, సామ్ కర్రాన్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు.. రబాడ ఒక వికెట్ తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..
IPL 2024: ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన ధోని.. జడేజా రికార్డును బద్దలు కొట్టి మరి..