Social Media: సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతున్నాయా.. అయితే ఇవి ఫాలో అవ్వండి..
ABN , Publish Date - Oct 13 , 2024 | 09:04 PM
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగించే ప్రజల సంఖ్య కోట్లలో ఉంటుంది. కొంతమంది అప్పుడప్పుడు సోషల్ మీడియా ప్రపంచాన్ని వీక్షిస్తుంటే, మరికొంతమంది అప్పడప్పుడు రియల్ వరల్డ్‌లోకి వస్తుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగించే ప్రజల సంఖ్య కోట్లలో ఉంటుంది. కొంతమంది అప్పుడప్పుడు సోషల్ మీడియా ప్రపంచాన్ని వీక్షిస్తుంటే, మరికొంతమంది అప్పడప్పుడు రియల్ వరల్డ్‌లోకి వస్తుంటారు. అంతగా సెల్ ఫోన్, ల్యాట్‌ట్యాప్‌లకు అతుక్కుపోతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఇటీవల కాలంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అకౌంట్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఈ ఖాతాల నిండా వ్యక్తిగత సమాచారం ఉండడంతో డేటా చోరీకి పాల్పడుతున్నారు.
అయితే ఈ సైబర్ దాడుల నుంచి మన ఖాతాలను రక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టెక్ నిపుణులు చెప్తున్నారు. హ్యాకర్ల నుంచి తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు అత్యాధునిక భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచిస్తున్నారు. మెరుగైన భద్రతా చర్యలతో సోషల్ మీడియా అకౌంట్లు భద్రంగా ఉంటాయని సలహా ఇస్తున్నారు.
జాగ్రత్తలు ఇవే..
సెల్ ఫోన్ రోజు వారీ డేటా అయిపోయినప్పుడు కానీ లేదా ఉచితంగా వస్తుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ W-Fiలకు కనెక్ట్ కావొద్దు. అలాంటి వైఫైలు సేఫ్ కాదు. అందులోని లోపాలతో సైబర్ కేటుగాళ్లు మీ ఖాతాలకు ఎసరు పెట్టే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ మీరు ఉపయోగించాల్సి వస్తే నగదు లావాదేవీలు జరిగే యాప్‌లు మాత్రం ఓపెన్ చేయకండి.
సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగులు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. మీరు ఖాతాల్లో పోస్టు చేసే వివరాలను మీ స్నేహితులు కాని వారు చూడకుండా నిరోధించాలి. మీకు తెలియని వారు రిక్వెస్టులు పెడితే స్పందించకపోవడం ఉత్తమం. అలాగే మీ వ్యక్తిగత సమాచారం బహిర్గతం కాకుండా సెట్టింగ్స్ మార్చుకోవాలి.
సోషల్ మీడియా ఖాతాలకు మెుక్కుబడిగా పాస్‌వర్డ్‌లు పెట్టవద్దు. పాస్‌వర్డ్‌లు అనేవి చాలా పటిష్ఠంగా ఉండాలి. అంకెలు, అక్షరాలు సహా సింబల్స్‌తో యూనిక్‌గా పెట్టాలి. అలాగే ఒకే పాస్‌వర్డ్‌ను వివిధ అకౌంట్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు. ప్రతి దానికి ప్రత్యేకమైన పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఖాతాలు భద్రంగా ఉంటాయి.
సోషల్ మీడియా ఖాతాలకు "టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్"(2FA) అనే ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలని టెక్ నిపుణులు చెప్తున్నారు. అలా చేయడం ద్వారా ఖాతాల భద్రత మరింత పటిష్ఠంగా మారుతుందని చెప్తున్నారు. 2ఎఫ్ఏను ఎనేబుల్ చేస్తే పాస్‌వర్డ్‌తోపాటు ఓటీపీ ఎంటర్ చేస్తేనే యాప్ లేదా సోషల్ మీడియా ఖాతాను తెరవగలం. దీని వల్ల భద్రత పెరిగి అకౌంట్ హ్యాక్ చేసే అవకాశం తగ్గుతుంది.
సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయకుండా ఉండేందుకు యాప్ సంస్థలు తరచుగా ఇచ్చే అప్‌డేట్లను ఫాలో అవ్వాలి. అప్‌డేట్స్ అనేవి మెరుగైన భద్రత కలిగి ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఖాతాలు, యాప్‌లు అప్‌డేట్ చేసుకోవాలి.
సోషల్ మీడియా ఖాతాలకు వచ్చే అనుమానిత మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌కు స్పందించవద్దు. హ్యాకర్లు పంపే ఎలాంటి లింక్స్ పైనా క్లిక్ చేయవద్దు. వారు పంపే మెసెజ్‌లకు స్పందించారంటే మీ ఖాతాలు హ్యాకర్లు చేతికి చిక్కినట్లే. కాబట్టి మీ వ్యక్తిగత వివరాలు కాజేసే అలాంటి హానికర లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి.