Yadagirigutta: నమో నారసింహా..
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:27 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రం (స్వాతి) పురస్కరించుకుని గురువారం గిరి ప్రదక్షిణ చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్టలో భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ
వైభవంగా స్వామివారి జన్మనక్షత్ర వేడుకలు
భువనగిరి అర్బన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రం (స్వాతి) పురస్కరించుకుని గురువారం గిరి ప్రదక్షిణ చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. వేదమంత్ర పఠనాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఆలయ ఈవో ఏ.భాస్కర్‌రావుతో కలిసి వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి, హారతి సమర్పించి గిరిప్రదక్షిణను ప్రారంభించారు.
కళాకారుల కోలాటాలు, నృత్యాలు, భజనలు, కీర్తనలతో ప్రదక్షిణ సాగే రోడ్డు హోరెత్తింది. కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్లు సుమారు 45 నిమిషాల పాటు స్వామివారిని తలచుకుంటూ భక్తులు ప్రదక్షిణ పూర్తి చేశారు. కాగా, వైకుంఠ ద్వారం నుంచి కొండకు పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో నూతనంగా నిర్మించిన మండపాల్లో ప్రతిష్ఠించిన భక్త ప్రహ్లాద, మునీశ్వరుడు యాదరుషి విగ్రహాలను చామల, బీర్ల ప్రారంభించారు.