CS Shanti Kumari: వరద బాధిత జిల్లాలు 29
ABN , Publish Date - Sep 07 , 2024 | 04:17 AM
భారీ వర్షాల కారణంగా 29 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఆ జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.
ఈ జిల్లాలకు రూ. 3కోట్ల చొప్పున సాయం
వర్షాల కారణంగా 29మంది మృతి: సీఎస్
హైదరాబాద్, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా 29 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఆ జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. ఇటీవల నాలుగు జిల్లాలకు నిధులు విడుదల చేశామని, మిగిలిన 25 జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాల కలెక్టర్లతో శాంతి కుమారి శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదలపై సోమవారంలోగా సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3వ తేదీ మధ్య కురిసిన వర్షపాతం ఆధారంగా వరద బాధిత జిల్లాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. వర్షాల కారణంగా ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మృతిచెందారని, ఎక్స్‌గ్రేషియా అందజేసేందుకు వివరాలు పంపాలని కలెక్టర్లకు సూచించారు.
నష్టం అంచనాలు పంపండి కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం
వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టం, మృతుల వివరాలపై 9వ తేదీగా నివేదిక పంపాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. పశువుల మరణాలపైనా నివేదిక కోరింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు.
33% మేర దెబ్బతిన్న పంటలకు పరిహారం
భారీ వర్షాలు, వరద వల్ల నష్టపోయిన పంటలకు పరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం విదివిధానాలను ఖరారు చేసింది. 33శాతం మేర నష్టపోయిన పంటలకు పరిహారాన్ని అందజేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వ్యవసాయ డైరక్టర్ గోపి జారీ చేశారు. అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, 12వ తేదీలోగా వివరాలు అందజేయాలని సూచించారు. ఆ వివరాలను జిల్లా వ్యవసాయ అధికారులు నిర్ధారించాలని తెలిపారు. కలెక్టర్ల ఆమోదంతో అర్హులైన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదనలను పంపాలని సూచించారు.