Share News

Siddipet: ఏబీవీపీ కార్యక్రమానికి గవర్నర్‌ హాజరు

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:03 AM

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) 43వ రాష్ట్ర మహాసభలను సోమవారం సిద్దిపేటలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు.

Siddipet: ఏబీవీపీ కార్యక్రమానికి గవర్నర్‌  హాజరు

  • సిద్దిపేట మహాసభల్లో పాల్గొన్న జిష్ణుదేవ్‌ వర్మ

  • విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి..

  • దేశ పునర్నిర్మాణంలో ముందుండాలని పిలుపు

సిద్దిపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) 43వ రాష్ట్ర మహాసభలను సోమవారం సిద్దిపేటలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. విద్యార్థులు, యువకులు సరికొత్తగా ఆలోచించాలని, భారతదేశ పునర్నిర్మాణంలో ముందుండాలని సూచించారు. కలలు కనడంతోనే ఆగకుండా ఆ కలలను సాకారం చేసుకునేలా యువత శ్రమించాలన్నారు. దేశాన్ని విశ్వగురుగా చేయాలన్న వివేకానందుడి లక్ష్యందిశగా పయనించాలని పిలుపునిచ్చారు. ధర్మం అనేది మతం కాదని, ప్రతీ ఒక్కరిలోనూ జాతీయభావం ఉండాలన్నారు. ఏబీవీపీ వ్యక్తి వికాసం కోసం కాకుండా జాతీయ వికాసం కోసం పనిచేస్తున్నదని చెప్పారు.


ఏబీవీపీ నుంచి ఎంతోమంది గొప్ప నాయకులుగా ఎదిగి దేశానికి సేవ చేస్తున్నారని గవర్నర్‌ వివరించారు. ప్రతీ విద్యార్థి భరతమాత సేవలో తరించాలని, విద్యార్థి శక్తి జాతీయ శక్తిగా బలపడుతుందని అన్నారు. విద్యార్థులు శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉండాలని ఏబీవీపీ జాతీ య సంఘటన కార్యదర్శి అశిష్‌ చౌహాన్‌ సూచించారు. నక్సలిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఏబీవీపీకి ఉందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి గవర్నర్‌ జాతీయ గీతం ఆలపించారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి, కార్యదర్శి మాచర్ల రాంబాబు, మహాసభల కన్వీనర్‌ చంద్రోజు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 05:03 AM