Share News

ACB: కేటీఆర్‌కు నోటీసులు?

ABN , Publish Date - Dec 21 , 2024 | 03:46 AM

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సిద్ధమైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ACB: కేటీఆర్‌కు నోటీసులు?

  • నేడో రేపో ప్రశ్నించనున్న ఏసీబీ!

  • దర్యాప్తు కొనసాగించవచ్చన్న హైకోర్టు

హైదరాబాద్‌, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సిద్ధమైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు.. దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. దీంతో ఏ1 కేటీఆర్‌తో పాటు అర్వింద్‌కుమార్‌, సుబ్బారెడ్డిలకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. ‘ఫార్ములా-ఈ కారు రేసులో మీపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. విచారణకు రండి’ అని కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వనున్నారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఏసీబీ కోర్టుకు పంపారు.


వాస్తవానికి శుక్రవారం ఉదయమే కేటీఆర్‌ తదితరులకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవగా.. ఆయన క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో హైకోర్టు నిర్ణయం కోసం ఎదురుచూశారు. ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని, తదుపరి విచారణ కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్‌ విచారణకు ప్రశ్నావళిని రూపొందించే పనిలో ఏసీబీ బృందం నిమగ్నమైనట్లు సమాచారం. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో నాటి పురపాలకశాఖ కార్యదర్శి అర్విందకుమార్‌ విదేశీ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం, డబ్బు చెల్లించడం గురించి ఫైలు పంపితే ఆ వివరాలను క్యాబినెట్‌ ముందు ఉంచకుండా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా 46 కోట్ల విడుదలకు ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? ఒప్పందం జరగడానికి ముందే నిధుల విడుదల ఎలా జరిగింది? డాలర్లలో చెల్లింపులకు ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు? విదేశీ కంపెనీతో ఒప్పందం జరిగితే ఆ ఫైలును గవర్నర్‌కు ఎందుకు పంపలేదు? వంటి ప్రశ్నలతో ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారించనున్నారు. కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన తర్వాత ఆయనను ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించనున్నారు.

Updated Date - Dec 21 , 2024 | 03:46 AM