Share News

ఇందిరమ్మ ఇళ్లపై త్వరలో విధి విధానాలు

ABN , Publish Date - Sep 28 , 2024 | 10:35 PM

ఇందిరమ్మ ఇళ్ల మంజూ రుకు సంబంధించి పది రోజుల్లో విధివిధానాలను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న గూడు లేని నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సొంత స్థలం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇందిరమ్మ ఇళ్లపై త్వరలో విధి విధానాలు

మంచిర్యాల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు మినహా మిగతా వాటిని అమలు చేస్తోంది. ఎనిమిది నెలలు గడుస్తున్నా స్పష్టమైన నిర్ణయం తీసుకోని కారణంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇంకా పట్టాలెక్కలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల విషయంలో చేసిన తప్పులు ఇందిరమ్మ పునరావృతం కాకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నిర్మాణమైన, అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల విషయంలోనూ ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళు కొన్ని పంపిణీకి నోచుకోగా, అధిక భాగం వృథాగా ఉన్నాయి. మరోవైపు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీకి బదులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపైనే ప్రధానంగా దృష్టి సారించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. మార్గదర్శకాలు జారీ అయిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా గ్రామ, పట్టణ సభల్లో స్వీకరిం చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

11వేల ఇళ్లు మంజూరుకు అవకాశం

జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఖానాపూర్‌ నియోజకవర్గంలోని జన్నారం మండలం కూడా జిల్లా పరిధిలోకే వస్తుంది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని రెవె న్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ లెక్కన జిల్లాలోని మంచి ర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలతోపాటు జన్నారం మండలా నికి కలిపి మొత్తం సుమారు 11వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. వాటికి తోడు రిజర్వుడ్‌ కోటా కింద మరికొన్ని ఇళ్లు కూడా ప్రభుత్వం మంజూరు చేయనుంది. కలెక్టర్‌తోపాటు ఇన్‌చార్జి మంత్రి ఆధీనంలో ఉంటాయి. అవసరాన్ని బట్టి అర్హులైన వారికి వాటిని అప్పటికప్పుడు మంజూరు చేసే వెసలుబాటు కల్పించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, స్థలాల కోసం 2,10,206 దరఖాస్తులు వచ్చాయి.

ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తుది నిర్ణయాన్ని ప్రభుత్వం ఎమ్మెల్యేలకే వదిలిపెట్టింది. ఆయా గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు తమకు అనుకూలంగా ఉండే వారికి ఇళ్లు కేటాయించేలా ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో డబుల్‌ ఇళ్ల మంజూరు బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది. అయినా రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో పథకం నిర్వీర్యం అయింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల చేతిలో ఆ ప్రక్రియ ఉండటం, గ్రామాలు, వార్డుల్లో స్థానిక నాయకుల హవా నడవనుండ టంతో అర్హులకు ఇళ్లు అందుతాయా...? అనే సందేహాలు కలుగుతున్నాయి.

రిజర్వేషన్‌ దామాషాన...

ప్రజాపాలనలో మహిళల పేరుతో వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకునే అవకాశాలున్నాయి. తెల్ల రేషన్‌ కార్డుతోపాటు అందులో పేరు ఉన్న మహిళలకు ఇళ్లు మంజూరు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. వివిధ వర్గాలకు రిజర్వేషన్‌ దామాషానా ఇళ్ల మంజూరు జరుగనుంది. దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ మైనార్టీలకు 50, జనరల్‌ కోటాలో 15 శాతం ఇళ్లు కేటాయించనున్నారు. గతంలో ఇళ్లు మంజూరైనా, దళితబంధు పథకం పొందిన దరఖాస్తులను తిరస్కరిస్తారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు సంబంధించి ఇంటి పన్ను రశీదు, విద్యుత్‌ బిల్లు చూపాల్సి ఉంటుంది. సొంత స్థలం కనీసం ఒక గుంట పట్టా కలిగి ఉండాలి. బేస్‌మెంట్‌ నుంచి ఇల్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో నగదు చెల్లించనున్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలన తరువాత

ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా? కాదా? అనే విషయాన్ని అధికారులు పరిశీలించి ఖరారు చేయనున్నారు. ఇందు కోసం క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని నిర్ణయించింది. దరఖాస్తుదారుల ఆధార్‌, తెల్లరేషన్‌ కార్డులను పరిశీలిస్తారు. గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు? ప్రస్తుతం ఏ ఇంట్లో ఉంటున్నారనే వివరాలను సేకరిస్తారు. ఇంటి స్థలం ఉన్నవారైతే సదరు స్థలం సొంతమేనా? దాని స్వభావం, ఎలా సంక్రమించింది? అనే వివరాలను తీసుకుంటారు.

ప్రత్యేక యాప్‌ సహాయంతో

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటు లోకి తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అర్హుల గుర్తింపు, ఇళ్ల నిర్మాణం, అందజేసే ఆర్థిక సహాయం, మంజూరు వరకు మొత్తం ప్రక్రియను యాప్‌ ద్వారానే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కేంద్రం ఒక యాప్‌తోపాటు పోర్టల్‌ను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం రూపొం దించిన వాటి ద్వారానే పథకాన్ని అమలు చేయాలా? లేక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేవడమా? అనే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Sep 28 , 2024 | 10:35 PM