ఏజెన్సీ భూమి కబ్జా
ABN , Publish Date - Nov 11 , 2024 | 10:43 PM
జిల్లాలో ఏజెన్సీ భూముల కబ్జా కొనసాగుతోంది. గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తూ గిరిజనేతరులు భూములు కబ్జా చేస్తున్నారు. ఈ తంతు బహిరంగంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామం ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ గిరిజన చట్టాలైన 1/70, పెసా చట్టాలు అమలులో ఉన్నాయి.
మంచిర్యాల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏజెన్సీ భూముల కబ్జా కొనసాగుతోంది. గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తూ గిరిజనేతరులు భూములు కబ్జా చేస్తున్నారు. ఈ తంతు బహిరంగంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామం ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ గిరిజన చట్టాలైన 1/70, పెసా చట్టాలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ గిరిజనేతరుడైన కొర్విచెల్మ నివాసి ముద్దసాని వేణు ముత్యంపేట గ్రామంలో సర్వే నంబరు 17లో 34 గుంటలతోపాటు దాని సమీపంలోని మరో ఆరు గుంటల భూమిని ఆక్రమించాడు. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం గ్రామ పంచాయతీ ట్రేడ్ లైసెన్స్ కూడా పొందకుండా మినీ రైస్‌మిల్లును నిర్వహిస్తున్నాడు. పంచాయతీలో ఇంటి పన్ను వసూలు రిజిస్టర్‌లో అక్రమంగా పేరు నమోదు చేయించుకున్నాడు. కేవలం ఇంటి పన్ను చెల్లిస్తూ మినీ రైస్‌మిల్ వ్యాపారం చేస్తున్నా అడిగే వారు కరువయ్యారు. సదరు భూమి బహిరంగ మార్కెట్ విలువ రూ.కోటి పై చిలుకు ఉంటుందని అంచనా. ఈ విషయం స్థానికంగా చర్చకు దారితీసింది.
గిరిజనులకు కేటాయించిన స్థలం ఆక్రమణ
సర్వే నంబరు 17లోని భూమిని గ్రామానికి చెందిన ఇళ్లు లేని గిరిజనులకు ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఇంటి స్థలాలు మంజూరు చేయాలని దండేపల్లి తహసీల్దార్‌ను ఆదేశించారు. పీవో ఆదేశాలను తహసీల్దార్ పట్టించుకోకుండా ఇప్పటి వరకు ఇంటి స్థలాలు ఇవ్వలేదు. సదరు భూమిలో అక్రమంగా రైస్‌మిల్ ఏర్పాటు చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోలేదు. తన పలుకుబడిని ఉపయోగిస్తూ భూమిలో నివాస స్థలాలు ఏర్పాటు కాకుండా అడ్డుపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ 19-02-2022న ఐటీడీఏ పీవోకు లేఖ రాస్తూ సర్వే నంబరు 17లో అర్హులైన 15 మంది గిరిజనులు ఆధారాలు సమర్పించినందున ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్లు తెలిపారు. అనంతరం సదరు స్థలంలో లే అవుట్ అప్రూవల్‌తో ప్లాట్లు సైతం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కేటాయించకపోవడంతో అదును చూసి వ్యాపారి భూమి మొత్తాన్ని అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
కలెక్టర్‌కు స్థానికుల ఫిర్యాదు
గిరిజనుల భూములను గిరిజనేతరుడు కబ్జా చేసిన విషయమై కొందరు గ్రామస్థులు గత నెల 28న కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన పలుకుబడిని ఉపయోగిస్తూ అధికారులు ఆ స్థలం వైపు కన్నెత్తి చూడకుండా చేస్తున్నాడని, వ్యాపారి నిర్వాకం వల్ల నిరుపేదలైన గిరిజనులు ఇళ్ల స్థలాలకు నోచుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.