విద్యార్థుల అస్వస్థతపై విచారణ
ABN , Publish Date - Nov 08 , 2024 | 10:21 PM
జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా పాఠశాలను సందర్శించారు. విచారణ జరిగిన సమయంలో మీడియాను, ఇతరులను లోనికి అనుమతించలేదు.
మంచిర్యాల అర్బన్, నవంబర్ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా పాఠశాలను సందర్శించారు. విచారణ జరిగిన సమయంలో మీడియాను, ఇతరులను లోనికి అనుమతించలేదు. విచారణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పాఠశాల నుంచి 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో ముగ్గురు వాంతులు చేసుకున్నారని, మిగితా వారు బాగానే ఉన్నారని, అందరూ పాఠశాలలోనే ఉన్నారన్నారు. ఒక విదార్థిని ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉందని తెలిపారు. వారికి పెట్టిన ఆహారం, తాగునీటికి సంబంధించిన రిపోర్టులు కూడా సరిగ్గానే ఉన్నాయని ఆమె తెలిపారు. విద్యార్థినుల అస్వస్థతకు కారణం ఫుడ్ పాయిజన్ అయిఉంటుందా అని ఆమెను ప్రశ్నించగా పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఐటీడీఏ పీవోను కలిసేందుకు విద్యార్థి సంఘాల నాయకులు శ్రీకాంత్, కనుకుంట్ల సన్నీగౌడ్, తిరుపతి పాఠశాల వద్దకు చేరుకున్నారు. వారిని లోనికి అనుమతించకపోవడంతో పాఠశాల గేటు ఎదుట నిరసన తెలిపారు. విద్యార్థినుల అస్వస్థతపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. విచారణ అనంతరం పీవో బయటకు వచ్చాక అమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడుతున్నారని, అందువల్లనే ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలువుతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని ఆమెను కోరారు.
ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి అస్వస్థత
మంచిర్యాల అర్బన్, నవంబర్ 8 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మళ్ళీ అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 6న పదో తరగతి విద్యార్థినులు 12 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశార్జ్ అయ్యారు. వారిలో శ్రీలత అనే విద్యార్థినికి విరేచనాలు కావడంతో గురువారం హాస్టల్ వార్డెన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచామని, పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశార్జ్ చేస్తామన్నారు.