Share News

అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానం కాంగ్రెస్‌ కైవసం

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:10 PM

ఏడాది కాలంలో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. 2023 డిసెంబరు 3న వెలువడ్డ ఎన్నికల ఫలితాలు జిల్లా రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీశాయి. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకుంది. మూడు నియోజక వర్గాల్లో దశాబ్దంపాటు పాలన సాగించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానం కాంగ్రెస్‌ కైవసం

మంచిర్యాల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఏడాది కాలంలో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. 2023 డిసెంబరు 3న వెలువడ్డ ఎన్నికల ఫలితాలు జిల్లా రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీశాయి. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకుంది. మూడు నియోజక వర్గాల్లో దశాబ్దంపాటు పాలన సాగించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మూడు చోట్లా ఆ పార్టీ అభ్యర్థులు పరాజయాన్ని చవిచూశారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్య ర్థులు బాల్క సుమన్‌, దుర్గం చిన్నయ్యలు పోరాడి ఓడారు. ఆ రెండు చోట్లా ద్వితీయ స్థానంలో నిలిచారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఆపార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్‌ మంచిర్యాల అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు ఊహించని విధంగా మూడో స్థానానికి పడిపోయారు. ఇక్కడ మొదటి స్థానంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్‌ ఊహించని విధంగా రెండో స్థానానికి చేరుకున్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే హవా...

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించింది. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థిగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద కుమారుడు వంశీకృష్ణను రంగంలోకి దింపింది. నామినేషన్‌ వేసినప్పటి నుంచే వంశీకృష్ణ పెద్దపల్లి పీఠంపై జెండా ఎగుర వేస్తారనే ప్రచారం జరిగింది. మే 13న లోక్‌సభ ఎన్నికలు జరుగగా, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీని అందుకోగా రెండో స్థానంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌లు నిలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున జిల్లాలోని మూడు నియోజక వర్గాల ఎమ్మెల్యేలు తమ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కృషి చేశారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికల బరిలో తొలిసారిగా నిలిచిన గడ్డం వంశీకృష్ణ విజయదుందుభి మోగించారు.

దోబూచులాడుతున్న మంత్రి పదవి....

అసెంబ్లీ ఎన్నికలు జరిగి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడ్డ కొత్తలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో మంత్రి పదవి రేసులో ఉన్న జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేకానంద, గడ్డం వినోద్‌లు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచినా రెండో విడుత మంత్రివర్గ విస్తరణకు మోక్షం లభించడం లేదు. సంవత్సర కాలంగా ఆశావహులతో మంత్రి పదవి సంవత్సర కాలంగా దోబూచులాడుతోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోగా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం సజీవంగా ఉంది. ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పదేళ్ళుగా ఒంటి చేత్తో పార్టీని నడిపిస్తూ వచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్‌కు ఊపు రాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. ప్రేంసాగర్‌రావు 2007-13 వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీగా పని చేయగా, 2018లో మంచిర్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదేళ్లపాటు పార్టీని సజీవంగా ఉంచిన ఆయనకే ఈసారి మంత్రి పదవి దక్కుతుందని కాంగ్రెస్‌ వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి తనయులైన బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్‌, గడ్డం వివేక్‌లు సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. గడ్డం వినోద్‌ 2004లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికకాగా 2009 వరకు ఐదేళ్లపాటు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. 2018 ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక పర్యాయం మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఈ సారి ఆయనకే మంత్రి పదవి వస్తుందని కార్యకర్తలు విశ్వసిస్తున్నారు.

ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్‌ 2009-14 వరకు పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడిగా సేవలందించారు. తిరిగి 2014లో పెద్దపల్లి పార్లమెంటు నుంచి బీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో మొదటి సారిగా ఎమ్మెల్యే బరిలో నిలిచిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే ఖానాపూర్‌ నియోజక వర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన వెడ్మ బొజ్జు సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ గిరిజన జిల్లాగా పేరుండటంతో ఆదే సామాజిక వర్గానికి చెందిన బొజ్జుకు పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గిరిజన కోటాలో పదవి ఇవ్వాల్సి వస్తే వెడ్మ బొజ్జును మంత్రి పదవి వరించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగనుందనే ప్రచారంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వారంతా ఢిల్లీ చుట్టూ తరుచుగా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ప్రేంసాగర్‌రావుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి స్పష్టమైన హామీ ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నస్పూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే ప్రేం సాగర్‌రావుకు మంత్రి ఇవ్వనున్నట్లు ఖర్గే ప్రకటించారు. అలాగే గడ్డం సోదరులకు సైతం ఢిల్లీలోని పార్టీ అగ్రనేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. వీరు మంత్రి పదవి దక్కించుకునేందుకు తమ తండ్రికి ఢిల్లీలో ఉన్న పలుకుబడిని ఉపయోగిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం కోసం....

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి కాంగ్రెస్‌తోపాటు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజీపీ పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్థానిక సంస్థలను కైవసం చేసుకోవడం ద్వారా తమ ఉనికిని చాటుకునేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. మంచిర్యాల నియోజక వర్గ ఎమ్మెల్యేగా ప్రేంసాగర్‌రావు గెలవగానే మొదట మున్సిపాలిటీలపై దృష్టిసారించారు. మంచిర్యాల, నస్పూర్‌, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో అప్పటి వరకు పాలన సాగించిన బీఆర్‌ఎస్‌ చైర్మన్లపై అవిశ్వాసానికి తెరలేపారు. మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మంచిర్యాల మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌గా ఉన్న గాజుల ముకేష్‌ గౌడ్‌, నస్పూర్‌ చైర్మన్‌గా ఉన్న ఈసంపెల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌గా ఉన్న తోట శ్రీనివాస్‌లు పదవీచ్యుతులు అయ్యారు. వారి స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి చైర్మన్‌గా రావుల ఉప్పలయ్య, వైస్‌ చైర్మన్‌గా సల్ల మహేష్‌, నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా సురిమిల్ల వేణు, వైస్‌ చైర్‌పర్సన్‌గా గెల్లు రజితలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అక్కడి బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ నల్మాసు కాంతయ్య ముందస్తు ప్రణాళికలతో వీగిపోయింది. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయబావుటా ఎగుర వేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉండగా, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కూడా తవ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Updated Date - Dec 30 , 2024 | 11:10 PM