ఈయేడు రైతన్నకు చేదు అనుభవాలు
ABN , Publish Date - Dec 26 , 2024 | 11:00 PM
జిల్లాలో ఈయేడు వ్యవసాయ రంగం పలు ఒడిదొడుకులకు లోనైంది. ప్రతికూల పరిస్థితులతో ప్రధాన పంటలైన వరి, పత్తి, మామిడి నష్టాలనే మిగిల్చాయి. వానాకాలం సీజన్‌లో ఎడతెరిపి లేని వర్షాలు పంటలను దెబ్బతీశాయి. చేతికొచ్చే సమయంలో కురిసిన వానలకు కోతదశలో ఉన్న వరి నేలవాలగా పత్తి తడిసి నల్లబడింది. కళ్లాల్లోని ధాన్యం తడిసి నష్టపోయారు. మామిడి రైతులకు నిరాశే మిగిలింది. పూత, కాత అంతంత మాత్రంగానే వచ్చింది.
నెన్నెల, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఈయేడు వ్యవసాయ రంగం పలు ఒడిదొడుకులకు లోనైంది. ప్రతికూల పరిస్థితులతో ప్రధాన పంటలైన వరి, పత్తి, మామిడి నష్టాలనే మిగిల్చాయి. వానాకాలం సీజన్‌లో ఎడతెరిపి లేని వర్షాలు పంటలను దెబ్బతీశాయి. చేతికొచ్చే సమయంలో కురిసిన వానలకు కోతదశలో ఉన్న వరి నేలవాలగా పత్తి తడిసి నల్లబడింది. కళ్లాల్లోని ధాన్యం తడిసి నష్టపోయారు. మామిడి రైతులకు నిరాశే మిగిలింది. పూత, కాత అంతంత మాత్రంగానే వచ్చింది. తేనెమంచు, పండు ఈగ దాడిలో పంట దెబ్బతిన్నది. కాసిన కొన్ని కాయలను ఈదురుగాలులు ఊడ్చుకెల్లాయి. పంట రుణమాఫీ అందరికి వర్తించక పోగా, చాలా మంది కార్యాలయాలు, బ్యాంకుల చుట్టు తిరిగినా లాభం లేకుండాపోయింది. రూ.2 లక్షలకు పైన అప్పు ఉన్న రైతులకు మాఫీపై స్పష్టత లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైతుభరోసా పథకంలో వానాకాలం పెట్టుబడికి సాయం అందకపోగా.. యాసంగి పనులు కొనసాగుతున్నప్పటికి ఇప్పటికి పథకం అమలుకు నోచుకోవడం లేదు.
- వ(అ)రి గోస
జిల్లాలో 1.64 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రభుత్వం సన్నాలకు రూ. 500లు బోనస్ ప్రకటించడంతో 80 శాతం రైతులు సన్నాలనే సాగు చేశారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంటను దక్కించుకున్న రైతులకు దిగుబడి చేతికొచ్చే సమయంలో అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. కోతకొచ్చిన పొలాలు నేలవాలాయి. పంటనష్టం సర్వే చేసినప్పటికీ పరిహారం ఇంతవరకు అందలేదు. అష్టకష్టాలు పడి సాధించిన దిగుబడులు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.500లు బోనస్ ప్రకటించడంతో గిట్టుబాటు అవుతుందని ఆశపడిన రైతులకు నిబంధనలు గుదిబడలా మారాయి. తేమ, తాలు, తప్ప, నూక పేరిట ధాన్యాన్ని తిరస్కరిస్తున్నారు. జిల్లాలో 3.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా 41,307 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. సీజన్ ముగింపు దశకు వచ్చినప్పటికి సేకరణ లక్ష్యంలో 20 శాతం కూడా దాట లేదు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఏమేర ప్రయోజనం చేకూరతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు ధర తగ్గించారు. సన్నాలను క్వింటాలుకు రూ. 2800లకు కొనుగోలు చేసిన మిల్లర్లు ప్రస్తుతం రూ. 2600లకే తీసుకుంటున్నారు. తరుగు పేరిట కేజీ ఎక్కువ కాంటా పెడుతున్నారు. మబ్బులు కమ్ముకొని ఉండటం, వర్షాలు కురుస్తుండటంతో మద్దతుధర కంటే తక్కువకే అమ్ముకోవాల్సి వస్తోంది. చాలా మంది రైతులు ఇప్పటికి కళ్లాల్లోనే ధాన్యం రాశులు పోసుకొని కొనేవారి కోసం ఎదురు చూస్తున్నారు.
-తెల్లబోయిన పత్తి రైతు
జిల్లాలో ఈ సీజన్‌లో 1,73,713 ఎకరాల్లో పత్తి సాగయింది. ప్రభుత్వ అనుమతి లేని గ్లైసిల్ (బీజీ-3) విత్తనాలనే ఎక్కువ మంది రైతులు సాగు చేశారు. కలుపు బెడద ఉండదని కూలీల ఖర్చులు తగ్గుతాయని భావించిన రైతులు అధిక ధరలు చెల్లించి ఈ విత్తనాలను ఎగబడి కొనుగోలు చేశారు. చెట్లు 6 నుంచి 8 ఫీట్ల ఎత్తుకు పెరిగాయి కాని పూత, కాత లేక చాలా మంది రైతులు నష్టపోయారు. చెట్టుకు 80 నుంచి 100 కాయలు ఉంటే ఎకరానికి 9 నుంచి 11 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తుంది. కాని 30 నుంచి 60 కాయలు మాత్రమే ఉండటంతో ఎకరానికి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. పత్తి చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో తడిసి నల్లబడింది. ప్రభుత్వం పత్తికి మద్దతు ధరగా క్వింటాలుకు రూ. 7,521 ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో ధర లేక పోవడంతో రైతులు సీసీఐకే అమ్ముకోవాల్సి వస్తోంది. తేమ, నాణ్యత పేరిట ధరలో కోతలు పెట్టడం... వారంలో మూడు రోజులు మాత్రమే కొనుగోలు చేయడం.. రోజుకు కొన్ని బండ్లను మాత్రమే అనుమతిస్తుండటంతో రైతులు పత్తి విక్రయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్రాలు లేని కౌలు రైతులు సీసీఐకి అమ్ముకోలేక వ్యాపారులకు రూ. 6800లకు విక్రయించి క్వింటాలుకు రూ. 700ల వరకు నష్టపోతున్నారు.
- మామిడి.. నష్టాలే దిగుబడి
మామిడి రైతులకు ఈ సంవత్సరం చేదు అనుభవాలను మిగిల్చింది. జిల్లాలో 18 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ప్రతికూల వాతావరణంతో తోటలు అంతంతమాత్రంగా కాత కాశాయి. పంటకాలంలో మూడు సార్లు వచ్చిన గాలిదుమారం కాయలను నేలపాలు చేశాయి. సీజన్ ప్రారంభంలో బంగినపల్లికి కిలోకు రూ.70 పలికినప్పటికి కొన్ని రోజులకే రూ. 35కి పడిపోయింది. చిన్న రసాలు, పెద్దరసాలు, తోతపరి, నీలం, పంచదార, సుందరి లాంటి ఇతర రకాలకు హోల్‌సెల్‌లో కిలోకు రూ.30 వరకు ఉండాల్సింది.. రూ.20 మాత్రమే చేతికొచ్చాయి. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేక ఇక్కడి రైతులు మహారాష్ట్రలోని నాగపూర్‌లో విక్రయించి నష్టపోతున్నారు.
- కూరగాయలు, పప్పుదినుసుల సాగులో మిశ్రమ ఫలితాలు
పప్పు దినుసుల సాగు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికి ప్రయోజనం చేకూరడం లేదు. ఆశించిన మేర పంట విస్తీర్ణం పెరగడం లేదు. మంచి ధర ఉన్నప్పటికి కంది పంట 8 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. పెసర, మినుములు తదితరాల సాగు అంతంత మాత్రంగానే ఉన్నది. కూరగాయల సాగు రైతులకు మిశ్రమ ఫలితాలనిచ్చింది. కూరగాయాల రైతులు ఏడాది ప్రారంభంలో కొంత లాభాలు ఆర్జించినప్పటికి ఆ తరువాత ధరలు పూర్తిగా పడిపోయాయి. టమాట, పచ్చిమిర్చి రూ.80 నుంచి ఏకంగా రూ.30కి పడిపోయింది. రైతులందరి పంటలు ఒకే సారి చేతికి రావడంతో ధరలు నేల చూపులు చూశాయి.
-రైతుభరోసా రాలే... రుణమాఫీ కాలే..
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పేరిట రూ.15 వేలు అందజేస్తామని ప్రకటించినప్పటికి వానాకాలం సీజన్ ముగిసి యాసంగి వచ్చినప్పటికి పథకం అమలుకు నోచుకోలేదు. దీంతో పంట పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీ చేసినప్పటికి అందరికి వర్తించలేదు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులతో పాటు భార్యభర్తల పేరిట ఉన్న రుణం, రేషన్‌కార్డు లేని వారు, ఆధార్‌కార్డు లింకేజీ, పాసుపుస్తకంలో తప్పొప్పులు తదితర కారణాలతో రుణమాఫీ కాలేదు. రూ.2 లక్షల లోపు రుణం ఉండి వివిధ కారణాలతో రుణమాఫీ కాకుండా అర్హులైన రైతుల వివరాలు సేకరించి జాబితా సిద్ధం చేసినప్పటికి మాఫీ డబ్బులు ఖాతాల్లో జమ కాలేదు.
-భారీగా పెరిగిన ఖర్చులు
సాగుకు పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, యంత్రాల కిరాయి రూపంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. బురద పొలాల్లో కోసే చైన్ మిషన్‌కు గంటకు రూ. 3000లు ఉన్న ధరను రూ. 4000లకు పెంచారు. కంబైన్డ్ హార్వెస్టర్ ధర గంటకు రూ. 1800ల నుంచి రూ. 2200లకు పెంచేశారు. ఫోర్‌వీల్ హార్వెస్టర్‌కు గంటకు రూ. 3 వేలు వసూలు చేశారు. వరి కోతలు, పత్తి సేకరణ ఏక కాలంలో రావడంతో కూలీల కొరత వేధించింది. అధిక ధరలు చెల్లించి మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యాణా రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వచ్చింది. వారికి క్వింటాలుకు రూ.వెయ్యి నుంచి రూ.1200లు చెల్లించాల్సి వస్తోంది. అన్నింటికి ధరలు పెరగడంతో పెట్టుబడులకు మద్దతు ధరలు సరితూగడం లేదని, నికరంగా తమకు నష్టాలే దిగుబడులవుతున్నాయని రైతులు వాపోతున్నారు.