కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:23 PM
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతన్నకు తేమ నిబంధనలు శాపంగా మారాయి. జిల్లాలో సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉండడంతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు.
మంచిర్యాల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతన్నకు తేమ నిబంధనలు శాపంగా మారాయి. జిల్లాలో సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉండడంతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. పెరిగిన చలి, మంచు కురుస్తుండటంతో ధాన్యంలో తేమ 17 నుంచి 24 శాతం వరకు ఉంటోంది. దీంతో ధాన్యాన్ని మళ్లీ అరబెట్టుకుని తీసుకురావాలని కేంద్రాల నిర్వాహకులు తిప్పి పంపుతు న్నారు. ధాన్యంలో తేమ 14 నుంచి 17 శాతంలోపే ఉండా లని కొనుగోలు కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కల్లా ల్లోనే ధాన్యం ఆరబోస్తున్నారు. పొలాల్లో వరికోత యం త్రాల ద్వారా కోసిన ధాన్యాన్ని వెంటనే కేంద్రాలకు తరలిం చడంతో తేమ శాతం అధికంగా ఉంటుంది. దీనికి తోడు గడ్డి, తాలు ఉంటుందని, ఆరబెట్టి శుభ్రం చేసిన ధాన్యం తెస్తే ప్రభుత్వ ధర క్వింటాకు రూ.2320 తోపాటు బోనస్ రూ.500 ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
ప్రైవేటు వైపు రైతుల మొగ్గు...
తేమ పేరుతో ధాన్యాన్ని కేంద్రాల సిబ్బంది కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేటు మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు వ్యాపారులు తేమ శాతంలో కొంతమేర వెసలుబాటు కల్పిస్తుండటం, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలకు కొంచెం అటుఇటుగా ప్రైవేటులోనూ లభిస్తుండటంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. కొందరు రైస్‌మిల్లర్లు వ్యాపారుల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాతావరణ భయంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. తేమ 25 నుంచి 30 శాతంపైగా ఉండ టంతో తడి ధాన్యం అమ్మితే తూకాల్లో కలిసి వస్తుందని, తేమశాతం తగ్గేవరకు ఉంటే నష్టపోతామన్న ఆలోచనతో రైతులు పైవ్రేటు వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలు స్తోంది. ఎండ లేకపోవడంతో ఆరబోసిన ధాన్యంలో తేమ శాతంలో మార్పు రావడంలేదు. కల్లాల వద్ద కాపలా ఉండడం, అకాల వర్షాలకు పంట కాపాడుకోవడం కష్టమని భావించిన రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సన్నాలకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించినప్పటికీ కొన్ని రకాల ధాన్యానికి బయటి మార్కెట్‌లోనే అధిక రేటు గిట్టుబాటు అవుతున్నందున వ్యాపారులకు పంటను విక్రయించే ఆలోచనతో రైతులు ఉన్నారు.
నత్తనడక కొనుగోళ్లు....
వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు దాదాపు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం కొనుగోళ్లు నత్తనడక నడుస్తున్నాయి. ఈ సీజన్‌లో జిల్లాలో 1,60,605 ఎకరాల్లో 3,68,140 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో ప్రైవేటులో అమ్మకాలు, పంట నష్టాలు పోను కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాల్సి ఉంటుంది. జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 315 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా 3423 మెట్రిక్ టన్నులు దొడ్డురకం, 105 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని కొను గోలు చేశారు. అలాగే 195 మంది రైతులకు రూ. 2 కోట్ల 98 లక్షలను బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. కాగా జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగుతుండగా, మరో వారంరోజుల్లో జిల్లా అంతటా పూర్తిస్థాయిలో కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బోనస్‌పై అవగాహన లేమి....!
సన్నరకం ధాన్యంపై ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ప్రకటించింది. బోనస్ వానాకాలం పంటకు వర్తింపజేస్తుండగా, యాసంగిపై రైతుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ విషయమై అధికారులు అవగాహన కల్పించడం లేదు. ప్రభుత్వం చెబుతున్న సన్నాల్లోనూ అనేక రకాలు ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. వాటిపై అవగాహన కల్పించాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఏ రకం సాగు చేయాలో అయోమయంలో రైతులు ఉన్నారు. జిల్లాలోని భూముల తత్వం, రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా విత్తనాలు వేయడంపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా అవి కానరావడం లేదు. యాసంగి సీజన్‌లోనైనా సన్నరకాలపై అవగాహన కల్పించాలని జిల్లాలోని రైతులు కోరుతున్నారు.