Share News

నేల రకాన్ని బట్టి పత్తి విత్తన సాగు ఎంచుకోవాలి

ABN , Publish Date - Oct 17 , 2024 | 11:49 PM

పత్తి రైతులు నేల రకాన్ని బట్టి విత్తన యాజమాన్య సాగు పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధిస్తారని జిల్లా వ్యవసాయాధికారి కల్పన అన్నారు. గురువారం నాగ్‌పూర్‌ జాతీయ పత్తి పరిశోధన సంస్థ బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నిర్వహించిన అధిక సాంద్రత-పత్తిలో క్షేత్ర దినోత్సవం కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.

నేల రకాన్ని బట్టి పత్తి విత్తన సాగు ఎంచుకోవాలి

కాసిపేట, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులు నేల రకాన్ని బట్టి విత్తన యాజమాన్య సాగు పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధిస్తారని జిల్లా వ్యవసాయాధికారి కల్పన అన్నారు. గురువారం నాగ్‌పూర్‌ జాతీయ పత్తి పరిశోధన సంస్థ బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నిర్వహించిన అధిక సాంద్రత-పత్తిలో క్షేత్ర దినోత్సవం కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. చీడపీడల నివారణపై రైతులు అవగాహన కలిగి ఉండాలని, వ్యవసాయాధికారులు చెప్పిన సూచనలను పాటించాలని సూచించారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్‌ శివకృష్ణ మాట్లాడుతూ జాతీయ పత్తి పరిశోధన సంస్థ రైతులకు యాజమాన్య పద్ధతులపై పత్తి రైతులకు శిక్షణ ఇస్తుందన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్‌ కింద ఉత్తమ పద్ధతుల ద్వారా పత్తి ఉత్పాదకతను పెంచేలా జిల్లా వ్యాప్తంగా 187 ఎకరాల్లోని రైతు క్షేత్రాల్లో ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా రైతులు పత్తి సాగులో మెళకువలు నేర్చుకుంటారని తెలిపారు. అనంతరం పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సునీల్‌ మహాజన్‌ అధిక సాంద్రత పత్తి సాగు ప్రాముఖ్యత, నేల రకాలు, విత్తన ఎంపిక, చీడపీడల నివారణ గురించి వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తిరుపతి, నాగరాజు, రాజనరేందర్‌, మండల వ్యవసాయాదికారి ప్రభాకర్‌, జాతీయ పరిశోధన సంస్థ అధికారులు సొలానే , ప్రియాంక, అనిల్‌, శైలజ, రైతులు పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులకు శిక్షణ

కోటపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మల్లంపేట రైతువేదికలో గురువారం ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్‌ పామ్‌ సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ పత్తి, వరి పంటలే కాకుండా ఆయిల్‌పామ్‌ సాగు వల్ల అధిక లాభాలు ఆర్జించవచ్చని తెలిపారు. అంతర పంటలను సాగు చేయవచ్చన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక రాయితీ అందుతుందన్నారు. డీహెచ్‌ఎస్‌వో అనిత, హెచ్‌వో కళ్యాణి, మ్యాట్రిక్స్‌ సీఈవో ఉదయ్‌కుమార్‌, ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ మధుకర్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2024 | 11:49 PM