ముగిసిన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్
ABN , Publish Date - Oct 15 , 2024 | 10:37 PM
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు కొలువుదీరనున్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం కలెక్టరేట్‌లో పోస్టింగ్ అర్డర్లు అధికారులు కేటాయించారు. అనంతరం ర్యాంకింగ్ ఆధారంగా ఆయా పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
బెల్లంపల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు కొలువుదీరనున్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం కలెక్టరేట్‌లో పోస్టింగ్ అర్డర్లు అధికారులు కేటాయించారు. అనంతరం ర్యాంకింగ్ ఆధారంగా ఆయా పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కొత్త ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో విధులు నిర్వహించాలో తేలడంతో బుధవారం ఆయా పాఠశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో కొత్త ఉపాధ్యాయుల రాకతో విద్యార్థులకు మెరుగైన బోధన అందనుంది. నియామక పత్రాలు అందుకున్న తర్వాత వారం రోజుల నుంచి పోస్టింగ్ ఎక్కడ వస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూసిన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు రావడంతో ఉత్కంఠకు తెరపడింది.
జిల్లాలో పోస్టుల భర్తీ ఇలా...
జిల్లాలో 288 పోస్టులతో ప్రభుత్వం మెగా డీఎస్సీ 2024ను ప్రకటించింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ 70, ఎస్జీటీ 176, భాషా పండితులు 16, పీఈటీ 3, స్పెషల్ ఎడ్యుకేటర్స్ 23 ఉన్నాయి. మొత్తం 288 పోస్టులకు గాను 248 పోస్టులు భర్తీ చేశారు. ఈమేరకు విద్యాశాఖ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి ఆర్డరు కాపీలను ఉపాధ్యాయులకు అందజేశారు.
ఉపాధ్యాయ వృత్తి బాధ్యతాయుతమైనది
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): భావితరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఎస్సీ 2024లో అభ్యర్థులకు పోస్టింగ్ కౌన్సెలింగ్ కార్యక్రమానికి డీఈవో యాదయ్యతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్ధాయి నుంచి విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ వారి భవిష్యత్ తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి బాధ్యతాయుతమైనదని అన్నారు. ఉపాధ్యాయులు తమకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాల సాధన దిశగా కృషి చేయాలన్నారు. జిల్లాలో 288 పోస్టులు ఖాళీగా ఉండగా 248 మంది అర్హత సాధించారని, కౌన్సెలింగ్‌కు 230 మంది హాజరయ్యారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.