పెరుగుతున్న నేరాలు
ABN , Publish Date - Dec 28 , 2024 | 10:45 PM
జిల్లాలో క్రైం రేట్ వేగంగా పెరుగుతోంది. పోలీస్‌శాఖ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేస్తున్నప్పటికీ చాపకింద నీరులా పెరిగిపోతూనే ఉండటం సర్వత్రా ఆందోళనను కలిగిస్తోంది. జిల్లాలో వ్యభిచారం, జూదం నిత్యకృత్యం కాగా గంజాయి వినియోగం, నకిలీ విత్తనాల సరఫరా విస్తరిస్తోంది.
మంచిర్యాల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్రైం రేట్ వేగంగా పెరుగుతోంది. పోలీస్‌శాఖ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేస్తున్నప్పటికీ చాపకింద నీరులా పెరిగిపోతూనే ఉండటం సర్వత్రా ఆందోళనను కలిగిస్తోంది. జిల్లాలో వ్యభిచారం, జూదం నిత్యకృత్యం కాగా గంజాయి వినియోగం, నకిలీ విత్తనాల సరఫరా విస్తరిస్తోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అసాంఘిక కార్యక్రమాలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిస అవుతున్న యువత, ఉద్యోగస్తులు కుటుంబాలతో సహా బలవంతపు మరణాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
విస్తరిస్తోన్న గంజాయి వినియోగం....
జిల్లాలో గంజాయి వినియోగం ప్రమాదకరంగా విస్తరిస్తోంది. కళాశాల విద్యార్థులు, యువతే లక్ష్యంగా సరఫరా జరుగుతోంది. మత్తుకు బానిసైన యువత దాని కోరల్లో చిక్కి భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారు. యువత బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్న ఏజెంటు వ్యవస్థ గంజాయి సేవనాన్ని ఒకరి నుంచి ఒకరికి అలవాటు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. స్మగ్లర్లు రైలు మార్గం ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారు. మహారాష్ట్ర, వరంగల్ ప్రాంతం నుంచి పలు రైళ్ల ద్వారా మంచిర్యాలకు గంజాయిని తరలిస్తున్న వ్యాపారులు దాన్ని ఇక్కడి ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. రైళ్లతోపాటు రోడ్డు మార్గంలోనూ గంజాయి సరఫరా అధికంగా జరుగుతోంది. మంచిర్యాల బస్టాండులోనూ ఓ మహిళ వద్ద పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబరులో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడగా, రెండు రోజుల అనంతరం దాని నుంచి పెద్ద మొత్తంలో గంజాయి సంచులు బయటపడటం పోలీసులను నివ్వెరపరిచింది. స్మగ్లర్లు పరారుకాగా, గంజాయి సంచులతో ఉన్న ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని హమాలివాడ పోచమ్మ చెరువు, పాత మంచిర్యాలలోని సబ్ స్టేషన్ ఏరియా, శాలివాహన విద్యుత్ ప్లాంటు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో యువత విచ్చలవిడిగా గంజాయి సేవిస్తున్నారు. కాలేజీ రోడ్డులోనూ గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. గతేడాది బెల్లంపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. గంజాయితోపాటు అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్థం హెరాయిన్ కూడా జిల్లాలో విరివిగా లభ్యం అవుతోంది.
పెరుగుతున్న ఆత్మహత్యలు
జిల్లాలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సెప్టెంబరు 1న మంచిర్యాల జిల్లా కేంధ్రంలో జరిగింది. రెడ్డి కాలనీకి చెందిన ఇప్ప వెంకటేష్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. అక్కడి గాజుల రామారం ఏరియాలో ఓ అపార్ట్‌మెంట్‌లో భార్య వర్షిణి, కుమారులు రిషికాంత్, విహాంత్ లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేష్ ఆన్‌లైన్ ట్రేడింగ్, బెట్టింగ్‌లలో రూ.20లక్షల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. దీనికితోడు ఆన్‌లైన్ లోన్ యాప్‌లలో అప్పు తీసుకున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో భార్య, ఇద్దరు కుమారులకు విషం ఇచ్చి వారు చనిపోయిన తరువాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
- కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులతోపాటు వారి కుమారుడు శివప్రసాద్, కూతురు శ్రీ చైతన్యలు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శివప్రసాద్ ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఈ నెల 9న కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసుల కూంబింగ్... తనిఖీలు
జిల్లాలో పోలీసుల కూంబింగ్, తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఇంటర్ స్టేట్ బార్డర్‌లో భాగంగా కోటపల్లి వద్ద అంతర్ జిల్లా చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్‌లో భాగంగా భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్‌లు ఉన్నాయి. వాటితోపాటు ప్రాణహిత సరిహద్దు పాయింట్లు ఉన్నాయి. పోలీసులు కూంబింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. సికాస కార్యకలాపాలు ఊపందుకునే అవకాశాలు ఉండటంతో దానిపైనా కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ప్రముఖుల భద్రతపై కూడా దృష్టిసారించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా ముమ్మరం చేశారు. ఈ విషయమై మార్చి 15న జైపూర్ మండలం ఎస్టీపీపీ సమావేశ మందిరంలో అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం నిర్వహించారు. ఇరురాష్ట్రాల, సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పని చేసేలా మార్గనిర్దేశం చేశారు.
విచ్చలవిడిగా జూదం....
జిల్లా పరిధిలోని కొన్ని గ్రామాల్లో విచ్చలవిడిగా జూదం కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలు, మామిడి తోటలు, లాడ్జీల్లో జూదం మితిమీరిపోతుండగా నిత్యం లక్షలకొద్ది డబ్బు చేతులు మారుతున్నట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనితోపాటు ఇతర ప్రాంతాలనుంచి జూదరులు పేకాట కోసం మంచిర్యాలకు వస్తుండటం గమనార్హం. గ్రామ శివారుల్లోని అటవీ ప్రాంతంలో నిత్యం మూడు ముక్కలాట జోరుగా సాగుతున్నట్లు సమాచారం. జిల్లాలో మట్కా నిర్వహణ కూడా తెరపైకి వచ్చింది. గతంలో మట్కా నిర్వాహకులపై పోలీసులు కొరడా ఝళిపించారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, మంచిర్యాల, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మట్కా జూదం నిర్వహిస్తున్నారనే పక్కా సమారంతో దాడులు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు నిర్వహించి 27 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 2. 46 లక్షల నగదు, 18 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో మట్కా ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేయగా, లాడ్జి నిర్వాహకులపై కేసు కూడా నమోదైంది. మరోవైపు మట్కా నిర్వాహకులతో సన్నిహిత సంబంధాలు కలిగి, విధుల్లో ఉదాసీనత ప్రదర్శించిన ఎనిమిది మంది పోలీసులను హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేశారు. వ్యభిచారం కూడా జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. మూడు నెలల క్రితం జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలోని ఓ లాడ్జితోపాటు జన్మభూమినగర్‌లోని ఓ గెస్ట్ హౌజ్‌లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో ఆ రెండు అడ్డాలను పోలీసులు సీజ్ చేశారు.
జోరుగా నిషేధిత విత్తనాల సరఫరా...
ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 పత్తి విత్తనాల సరఫరా తాజాగా జిల్లాలో వెలుగు చూసింది. ఏప్రిల్ 22న కర్ణాటకలోని కొప్పల్ జిల్లా నుంచి మంచిర్యాల జిల్లా మందమర్రికి నిషేదిత బీటీ-3 విత్తనాలను తరలిస్తుండగా మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. డీసీఎం వ్యాన్‌లో ఉల్లిగడ్డ బస్తాల మాటున నకిలీ విత్తనాలను తరలిస్తూ నిందితులు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి రూ. 35 లక్షల విలువైన 1.2 టన్నుల బీటీ-3 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ నిందితులు ఇదే తరహాలో పత్తి విత్తనాలు తీసుకొచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
జిల్లాలో నమోదైన కేసుల వివరాలు...
జిల్లాలో ఈ ఏడాది నవంబరు వరకు నమోదైన వివిధ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
హత్య కేసులు-23,
దొంగతనాలు- 355,
ఆత్మహత్యలు-8
కిడ్నాప్‌లు-55,
రేప్ కేసులు-41, కొట్లాటలో గాయాలు-507,
మోసాలు-381, హత్యాయత్నాలు -40,
రోడ్డు ప్రమాదాలు-123, ఇతర ప్రమాదాలు-258,
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు-469, మిస్సింగ్ కేసులు-273, అగ్ని ప్రమాదాలు-19 కేసులు నమోదయ్యాయి.