Share News

అభివృద్ధి చూసి ఓర్వలేకనే దిగజారుడు రాజకీయాలు

ABN , Publish Date - Nov 03 , 2024 | 10:42 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఐబీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అభివృద్ధి చూసి ఓర్వలేకనే దిగజారుడు రాజకీయాలు

మంచిర్యాల అర్బన్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఐబీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ముఖ్యమంత్రికి పదవి వియోగం ఉందంటూ వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తూ, ఆయన జ్యోతీషం చెప్పడం మానుకోవాలన్నారు. రేవంత్‌ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల ఆదరణ పొందుతుందన్నారు. నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండు ఒకటయ్యానని, అంతా కలిసికట్టుగా వచ్చినా తనను ఢీకొట్టలేరని, అభివృద్ధితోనే వారికి సరైన సమాధానం చెప్తానన్నారు. ఒక్కటవ్వలేదని నిరూపించేందుకు కాణిపాకం వినాయకుడి ఆలయంలో ప్రమాణం చేద్దామా అంటూ సవాల్‌ విసిరారు. ఐబీలో రూ.300 కోట్లతో 650 పడకల సామర్థ్యం కల్గిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలోనే పూర్తి చేస్తామని, ఎంసీహెచ్‌ను ఆసుపత్రిలోకి షిఫ్టు చేస్తామన్నారు. అలాగే ముంపును నివారించేందుకు రూ.255.59 కోట్లతో కరకట్టను త్వరలోనే నిర్మిస్తామని, ఇందుకోసం సర్వే కూడా పూర్తయిందని, బఫర్‌జోన్‌ పరిధిలో ఉన్న నివాసాల వారు ఎవరైనా పేద, మధ్యతరగతి వాళ్లు ఉంటే వారికి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. రహదారుల నిర్మాణాలకు రూ.70 కోట్లను మంజూరు చేయించానన్నారు. రైతు భరోసాపై ఆందోళన చెందాల్సిన పనిలేదని, కొన్ని సవరణల కారణంగా జాప్యం అవుతుందని, అందరికి పంట పెట్టుబడి సహాయం అందుతుందన్నారు. నియోజకవర్గంలో ఫ్లాట్లుగా విక్రయించిన అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సల్ల మహేష్‌, నస్పూర్‌ చైర్మన్‌ సుర్మిళ్ల వేణు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తూమల నరేష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా మారుస్తా

జిల్లా కేంద్రాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా మారుస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని సాయికుంటలో 14 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇండోర్‌ స్టేడియం ఏర్పాటుకు స్పోర్ట్స్‌ అథారిటి చైర్మన్‌ శివసేనారెడ్డితో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 14 ఎకరాల్లో రెండు ఎకరాలు నర్సింగ్‌ కళాశాల కోసం, మిగితా 12 ఎకరాలు ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి కేటాయిస్తామన్నారు. ఇందులో ఇండోర్‌, అవుట్‌ డోర్‌ గేమ్స్‌, స్విమ్మింగ్‌ ఫూల్‌ నిర్మిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులను తీసుకువచ్చి క్రీడాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం శివసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, యువత చెడు మార్గం పట్టకుండా క్రీడల్లో రాణించాలన్నారు. మంచిర్యాలను స్పోర్ట్స్‌ హబ్‌గా మార్చేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సల్ల మహేష్‌, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 10:42 PM