ప్రజల సౌకర్యార్థం రహదారుల అభివృద్ధి
ABN , Publish Date - Nov 01 , 2024 | 11:03 PM
గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట మండల పరిధిలో రహదారుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి శంకుస్ధాపన చేశారు.
లక్షెట్టిపేటరూరల్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట మండల పరిధిలో రహదారుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి శంకుస్ధాపన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని ముత్త బుచ్చయ్యపల్లి నుంచి రాజంపేట రోడ్డు (పీఎంజీఎస్‌వైరోడ్డు) వరకు, కొత్తూరు గ్రామంలో ఎన్‌హెచ్ 24 నుంచి చందారం ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు కొత్తూరు మీదుగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కేంద్రానికి రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మాణపనులను చేపడుతున్నామన్నారు.
లక్షెట్టిపేట పట్టణంలో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి భవనం, సమీకృత మార్కెట్ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి భవనం, సమీకృత మార్కెట్ భవన నిర్మాణాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావుతో కలిసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.
బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన
హాజీపూర్, (ఆంధ్రజ్యోతి): ముల్కల్ల, పెద్దంపేట, దొనబండ గ్రామాల్లో రూ. 4.35 కోట్లతో నూతన బ్రిడ్జిల నిర్మాణానికి కలెక్టర్ కుమార్‌దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావులు శుక్రవారం శంకుస్ధాపన చేశారు. ఎమ్మెల్యేమాట్లాడుతూ బ్రిడ్జిల నిర్మాణం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. చుట్టు పక్కల గ్రామాలకు రహదారి సౌకర్యం మెరుగు పడుతుందన్నారు. వర్షాకాలంలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో ప్రసాద్, ఏపీవో మల్లయ్య, పార్టీ మండల అధ్యక్షుడు తోట రవి, నాయకులు పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యం
దండేపల్లి, (ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. గురువారం ముత్యంపేట నుంచి చింతపల్లి గుర్రాల బాట, చింతపల్లి నుంచి వెంకటాపూర్, వెంకటాపూర్ నుంచి నర్సాపూర్ వరకు బీటీ రోడ్డు, గూడెం చెక్ పోస్టు నుంచి గోదావరి పుష్కర్‌ఘాట్ వరకు సీసీ రోడ్డు, సదానందలయం నుంచి గూడెం బైపాస్ వరకు చేపట్టే రహదారుల నిర్మాణానికి కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య, గ్రామాల అభివృద్ధి, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆరు గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టి పలు సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత భోరోసా కల్పిస్తోందన్నారు. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వెల్గనూర్‌లో సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్టుకింద ఎంపిక చేశానన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి అనుసంధానం చేస్తూ రోడ్డు నిర్మాణంతో గ్రామాల్లో పరిశ్రమలు ఏర్పడుతాయన్నారు. మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, ఆర్‌జిపిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, పార్టీ అధ్యక్ష కార్యదర్శు వెంకటేశ్వర్లు, సతీష్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.