అంబరాన్నంటిన దసరా సంబరాలు
ABN , Publish Date - Oct 13 , 2024 | 10:07 PM
దసరా వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం పలు ఆలయాలను సందర్శించారు. అనంతరం జమ్మి పూజలో పాల్గొని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలుచోట్ల రాంలీల కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంలీల కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడిపారు. పలు ఆలయాలు, దుర్గ మండపాల వద్ద వాహన పూజలు నిర్వహించారు.
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 13 : పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో జరిగిన శమీ పూజా కార్యక్రమంలో కలెక్టర్ కుమార్‌దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీపీ ఎ.భాస్కర్ దంపతులు పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ శమీ పూజ నిర్వహించగా భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పండుగను ప్రజలంతా ప్రశాంత వాతావరణంగా జరుపుకోవాలని, అందరికి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.
బెల్లంపల్లి: పట్టణంలో దసరా వేడుకలు ఘనంగా జరి గాయి. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తిలక్ మైదా నంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైభవంగా దసరా ఉత్సవాలను నిర్వహించిన హిందూ ఉత్సవ సమితి సేవలు అభినందనీ యమని పేర్కొన్నారు. ప్రతీ పనిలో ప్రజలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే విల్లుతో బాణం వేసి రావణ బొమ్మను దహనం చేశారు. ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహించారు. రావణ దహన కార్యక్రమానికి వేల మంది ప్రజలు హాజరయ్యారు.