TG News: నిర్మల్‌లో సంబురాలు.. టపాసులు కాల్చి మరీ..
ABN , Publish Date - Nov 27 , 2024 | 06:26 PM
ప్రస్తుతానికి ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మహాధర్నాను విరమిస్తున్నట్లు ఆందోళనకారులు ప్రకటించారు. తాత్కాలికంగా ఆందోళన విరమిస్తునట్టు ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీ నేతలు ప్రకటించారు. కలెక్టరేట్ లో జేఏసీ..
రెండు రోజులుగా స్థానికుల ఆందోళనలతో అట్టుడికిన నిర్మల్‌లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. మహాధర్నాతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన జనం ఒక్కసారిగా టపాసులు కాల్చిమరీ సంబురాలు చేసుకున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య చేపట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా మంగళవారం నుంచి రెండు గ్రామాల మహిళలు ఆందోళనకు దిగారు. 61వ జాతీయ రహదారిపై బైఠాయించారు. రాజకీయాలతో తమకు సంబంధం లేదని, ఇథనాల్ పరిశ్రమ రద్దు కావడమే తమ ఎజెండా అంటూ మహాధర్నా చేపట్టారు. ఎన్నికలకు ముందు ఇథనాల్ పరిశ్రమ రద్దుకు కృషి చేస్తామని చెప్పిన ముగ్గురు నాయకులు ఇప్పుడు కనిపించకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులతో అధికారులు చర్చలు జరిపినా సఫలం కాలేదు. దీంతో విషయాన్ని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ప్రస్తుతానికి ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మహాధర్నాను విరమిస్తున్నట్లు ఆందోళనకారులు ప్రకటించారు. తాత్కాలికంగా ఆందోళన విరమిస్తునట్టు ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీ నేతలు ప్రకటించారు. కలెక్టరేట్ లో జేఏసీ నేతలతో సమావేశమైన కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. కలెక్టర్ హామీకి నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఉద్యమాన్ని తాత్కా లికంగా నిలిపి వేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వానికి, అధికారులకు అన్ని విధాలా సహకరిస్తామని, పరిశ్రమను ఇక్కడి నుంచి శాశ్వతంగా తరలించాలని ఉద్యమ నేతలు కోరారు.
ప్రభుత్వ ప్రకటనతో సంబురాలు..
ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో చర్చలు సఫలం కావడంతో టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీతో మహాధర్నాను స్థానికులు విరమించారు. స్థానిక ప్రజల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుందని, భవిష్యత్తులో కూడా స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగించే, కాలుష్య పరిశ్రమలు ఈ ప్రాంతానికి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు తెలిపారు.
అసలు ఏం జరిగింది..
ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నిరసనకారులతో మాట్లాడేందుకు దిలావర్‌పూర్‌కు వచ్చిన ఆర్డీవో రత్న కళ్యాణిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ 10మంది గ్రామస్థులను చర్చలకు రమ్మంటున్నారని ఆర్డీవో చెప్పారు. తామున్న దగ్గరకే కలెక్టర్ రావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆర్డీవో తిరిగి వెళ్లే క్రమంలో కారులో ఎక్కేందుకు ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. కలెక్టర్ వచ్చే వరకు వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఆర్డీవో రాత్రి వరకు కారులోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆర్డీవో రత్నకళ్యాణి ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి 9 గంటలకు వైద్యులు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి 10 గంటల వరకు నిరసనకారుల నిర్బంధంలో ఉన్న ఆర్డీవో రత్న కళ్యాణిని విడిపించేందుకు నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాలతో పోలీసులు వలయంగా ఏర్పడి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులు ఆర్డీవో కారును ధ్వంసం చేశారు. పోలీసులు అతి కష్టం మీద ఆర్డీవోను పోలీసు వాహనంలో నిర్మల్‌కు తరలించారు. మహిళల ఆందోళన నేపథ్యంలో దిలావర్‌పూర్‌ను పోలీసులు అష్ట దిగ్బంధం చేశారు. చుట్టూ రోడ్లు మూసివేసి, తనిఖీలు చేపట్టారు. పరిశ్రమ నిర్మాణం వైపు ఎవరినీ వెళ్లనీయకుండా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బలగాలను రప్పించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఉదయం నుంచి దిలావర్‌పూర్‌లోనే ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు.. ఎస్పీతోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో వారికి ఎస్పీ సర్దిచెప్పారు. చివరకు ప్రభుత్వం ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని ఆదేశించడంతో ఆందోళనకారులు శాంతించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here