అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడేనా..?
ABN , Publish Date - Sep 29 , 2024 | 10:15 PM
మున్సిపాలిటీల పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ చట్టం 2019లోని టీఎస్-బీ పాస్‌కు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా లేఅవుట్ పర్మిషన్, భవన నిర్మాణా లకు అనుమతులు, తదితర ప్రక్రియను పటిష్టం చేసేందుకు కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలను సైతం నియమించింది.
మంచిర్యాల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ చట్టం 2019లోని టీఎస్-బీ పాస్‌కు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా లేఅవుట్ పర్మిషన్, భవన నిర్మాణా లకు అనుమతులు, తదితర ప్రక్రియను పటిష్టం చేసేందుకు కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలను సైతం నియమించింది. నిబంధనలను అతిక్రమించే వారిపట్ల కఠినంగా వ్యవహరించేలా టాస్క్‌ఫోర్స్ బృందాలకు విస్తృత అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది. అందులో భాగంగా అనుమతులు లేని నివాస గృహాలు, కమర్షియల్ భవనాలతోపాటు లేఅవుట్ లేని వెంచర్లపై ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే నేరుగా కూల్చే అధికారం టాస్క్‌ఫోర్స్ బృందాలకు ఉంది. ఆ చట్టం ప్రకారం 2021 సెప్టెంబరులో జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల బైపాస్ రోడ్డులో అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను టాస్క్‌ఫోర్స్ బృందం కూల్చివేసింది.
ఇవీ నిబంధనలు....
భవన నిర్మాణాలు చేపట్టే ప్రజలు అనుమతుల కోసం దరఖాస్తు చేసే సమయంలో సమర్పించిన ప్లాన్‌ను అమలుపర్చాలి. పర్మిషన్ కాపీలో పేర్కొన్న విధంగా నిర్మాణం చేపట్టాలి. సెట్ బ్యాక్, రోడ్డు నిబంధనలు పాటించడంతోపాటు అనుమతులు ఉన్న మేరకు పై అంతస్తుల నిర్మాణం చేపట్టాలి. గృహావసరాలకు అనుమతులు పొంది, కమర్షియల్‌గా ఉపయో గించే వారిని సైతం నిబంధనల ఉల్లంఘన జాబితాలో చేర్చుతారు. గృహ, కమర్షియల్ భవన నిర్మాణాలతోపాటు లేఅవుట్ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే ప్లాట్లు చట్ట విరుద్ధం కాగా, అలాంటి వాటిపై టాస్క్‌ఫోర్స్ బృందాలకు చర్యలు తీసుకొనే అధికారం ఉంది.
నాటి అధికారుల చర్యలకు అడ్డుకట్ట...
టీఎస్-బీ పాస్ చట్టాన్ని అమలు చేసే దిశలో మూడేళ్ల క్రితం అధికారుల చర్యలకు అధికార పార్టీ (బీఆర్‌ఎస్) కౌన్సిల్ సభ్యులే అడ్డుకట్ట వేయడం చర్చనీయాంశమైంది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని హమాలివాడలో 2021 జూలైలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఓ బహుళ అంతస్థుల భవనం స్లాబ్‌ను కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా అప్పటి అధికార పార్టీకి చెందిన నాయకులు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. అదే సంవత్సరం ఆగస్టులో నస్పూర్ మున్సిపాలిటీ పరిధి రెడ్డి కాలనీలో ప్లాన్‌కు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల గోడలతో పాటు షెడ్లను కూల్చివేశారు. అదే సమయంలో బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోనూ నిబంధనలకు విరుద్ధంగా వెలసిన కట్టడాలను టాస్క్‌ఫోర్స్ బృందాలు కూల్చివేస్తుండగా మెజార్టీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకులే అధికారులను అడ్డుకోగా, నేడు ప్రజాప్రతినిధులు ప్రోత్సహిస్తున్నా మున్సిపల్ అధికారులు ముందుకు కదలకపోవడం శోచనీయం. ఇటీవల నస్పూర్ మున్సిపాలిటీలో అసైన్డ్ భూమిలో నిర్మించిన బీఆర్‌ఎస్ నేత ఢీకొండ అన్నయ్యకు చెందిన ఐదంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసిన అధికారులు ఆయనతో పాటు 65 మందికి నోటీసులు జారీ చేశారు. అయితే భవనాన్ని కూల్చివేసి పది రోజులు కావస్తున్నా ఇతర అక్రమ కట్టడాల జోలికి వెళ్లడం లేదు.
కూల్చివేతలపై భిన్నస్వరాలు....
చట్టం ప్రకారం కూల్చివేతకు గురవుతున్న నిర్మాణాలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రెండు మూడు అంతస్థుల వరకు నిర్మాణాలు పూర్త యిన తరువాత వాటిని కూల్చడం వల్ల సంబంధిత యజమానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుంతుందని, అలా కాకుండా నిర్మాణ పనులు ప్రారంభం కాగానే చర్యలు తీసుకుంటే నష్టం తీవ్రత తగ్గుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడో మూడేళ్ల క్రితం నిర్మించిన భవనాలను కూలుస్తున్న అధికారులు ప్రారంభంలోనే చర్యలు తీసుకోవలసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే చట్టంపై అవ గాహన ఉండి, నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారుల నిర్లిప్తత కారణంగా టీఎస్ బీ పాస్ చట్టం వచ్చిన తరువాత ఈ మూడేళ్లలోనే విపరీతంగా అక్రమ కట్టడాలు వెలిశాయి. అయినా చర్యలు ముందుకు సాగకపోవడంతో మున్సిపాలిటీల్లో టీఎస్ బీ పాస్ చట్టం అమలుపై నీలి నీడలు అలుముకున్నాయి.