ఆసుపత్రి శంకుస్థాపనను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Nov 20 , 2024 | 10:35 PM
జిల్లా కేంద్రంలోని ఐబీ ప్రాంతంలో గురువారం సూపర్ స్పెషాలిటీ, మాతా శిశు ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణానికి చేపట్టే శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. బుధవారం ఆసుపత్రి శంకుస్థాపన చేసే ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
మంచిర్యాల అర్బన్, నవంబరు20 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఐబీ ప్రాంతంలో గురువారం సూపర్ స్పెషాలిటీ, మాతా శిశు ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణానికి చేపట్టే శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. బుధవారం ఆసుపత్రి శంకుస్థాపన చేసే ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. 650 పడకల ఆసుపత్రిగా నిర్మాణమవుతున్న ఆసుపత్రిని రానున్న రోజుల్లో 1200 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని, 21 ఏప్రిల్ 2027 వరకు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఉత్తర తెలంగాణకే ఈ ఆసుపత్రి తలమానికంగా నిలవనుందన్నారు.
ఆసుపత్రి నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్కలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. రఘనాథ్‌రావు హద్దు దాటి విమర్శలు చేస్తున్నారని, ఆయన అదుపులో ఆయన ఉంటే మంచిదన్నారు. తనపై విమర్శలు చేసే ముందు మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని, తాను ఓ విజన్‌తో పనిచేసే వ్యక్తినని, నియోజకవర్గాన్ని విద్య, వైద్య సేవలకు హబ్‌గా మారుస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, నాయకులు రామగిరి బానేష్, తదితరులు పాల్గొన్నారు.