గిరిజన గూడేల్లో గుస్సాడీ సందడి
ABN , Publish Date - Oct 15 , 2024 | 10:31 PM
గిరిజన గూడేల్లో గుస్సాడీ సందడి మొదలైంది. యేటా దసరా నుంచి దీపావళి పండుగ వరకు పద్మల్‌పూరీకాకో దేవాలయంలో దండారీ గుస్సాడీ వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. మండలంలోని గుడిరేవు గోదావరి నది తీరం ఒడ్డున పద్మల్‌పూరీకాకో దేవాలయం ఉంది. ఇక్కడ యేటా దసరా తర్వాత ఆశ్వీయుజ పౌర్ణమి గురువారంతో దండారీ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీపావళి అమావాస్యతో ఉత్సవాలు ముగుస్తాయి.
దండేపల్లి, అక్టోబరు 15: గిరిజన గూడేల్లో గుస్సాడీ సందడి మొదలైంది. యేటా దసరా నుంచి దీపావళి పండుగ వరకు పద్మల్‌పూరీకాకో దేవాలయంలో దండారీ గుస్సాడీ వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. మండలంలోని గుడిరేవు గోదావరి నది తీరం ఒడ్డున పద్మల్‌పూరీకాకో దేవాలయం ఉంది. ఇక్కడ యేటా దసరా తర్వాత ఆశ్వీయుజ పౌర్ణమి గురువారంతో దండారీ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీపావళి అమావాస్యతో ఉత్సవాలు ముగుస్తాయి. రాష్ట్ర నలుమూల నుంచి గిరిజనులు కుటుంబసమేతంగా తరలివచ్చి కాకో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీపావళి వేడుకలతో గొండుగూడెలు కోలాహలంగా కనిపిస్తాయి. గిరిజనులు అంటేనే సంస్కృతి, సాంప్రదాయాలకు మారుపేరు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దే రెండు రోజులు ఉండి పూజలు చేస్తారు. కొత్తగా పెళ్లైన జంటలను ఆలయంలో అమ్మవారి ముందు భేటీ (కోత్త కోడళ్ల పరిచయం) నిర్వహిస్తారు.
గుడిరేవు సమీపంలో గోదావరి తీరంలో ఉన్న పద్మాల్‌పురి కాకో దేవాలయం రాష్ట్రంలోనేఆదివాసీల ఏకైక దేవాలయం. గ్రామానికి కిలోమీటర్ దూరంలో గోదావరి తీరంలో ఉంది. రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ తెగలు గోండు, ప్రదాన్, కోలాం, తోటీ తదితరులు ఇక్కడ పూజలు చేస్తారు. ఉమ్మడి జిల్లాలో ఊట్నూర్, నార్నూర్, జైనూర్, గుడిహత్నూర్, ఇచ్చోడ, భోధ్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, తిర్యాణి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి గిరిజనులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. పురుషులు నెత్తిమీద నెమలి పింఛం ధరించి చేసే గుస్సాడీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలు సైతం సాంప్రదాయ పద్ధతిలో చుట్టూ తిరుగుతూ దేవతలను కొలుస్తూ పాటలు పాడుతారు. పుష్య మాసంలో పెర్సాపేన్(జల్లిదేవర) పూజలు చేస్తారు.
గిరిజనుల ప్రత్యేక నైవేద్యాలు..
పద్మల్‌పూరీకాకో అమ్మవారికి ఇష్టమైన పిండి పదార్థాలు గిరిజనులు ప్రత్యేక నైవేద్యాలు తయారు చేస్తారు. పాయసంతో రుబ్బిన పెసరు, మిసుము, బబ్బెర గారెలు తయారు చేసి కాకోబాయికి నైవేధ్యంగా ప్రత్యేక పూజలతో సమర్పిస్తారు. వీటిని గానుగతో తయారు చేసి నువ్వులు, పల్లినూనె వేసి గిరిజనులు ఆలయం వద్ద వంటకాలు చేస్తారు. అనంతరం కోళ్లు, మేకలు కాకోబాయికి బలిచి విందు భోజనం చేస్తారు.
పద్మల్‌పూరీకాకో దేవాలయం వద్ద దసరా నుంచి దీపావళి అమావాస్య ముగిసే వరకు రోజు గిరిజన సంప్రదాయబద్దంగా ప్రత్యేక భజనలు నిర్వహిస్తారు. గిరిజన పెద్దలు ఆనందోత్సవాల మధ్య గిరిజన బాషాలో ఆటాపాటల, నృత్యాలతో రాత్రి పగలు తేడా లేకుండా భజనలు కొనసాగిస్తుంటారు.