Share News

జోరుగా కలప అక్రమ రవాణా

ABN , Publish Date - Oct 04 , 2024 | 10:34 PM

ప్రాణహిత నది మీదుగా టేకు కలప అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. స్మగ్లర్లు కలపను తెప్పలుగా మార్చి నది మీదుగా అక్రమంగా తరలిస్తున్నారు. అధికారుల కళ్లు కప్పి మహారాష్ట్ర నుంచి మంచిర్యాల మీదుగా ఇతర జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి కలప అక్రమ రవాణా తగ్గినట్లు అధికారులు భావిస్తున్నప్పటికీ స్మగర్లు గుట్టుచప్పుడు కాకుండా లక్షల రూపాయల విలువగల కలపను ఎల్లలు దాటిస్తూనే ఉన్నారు.

జోరుగా కలప అక్రమ రవాణా

మంచిర్యాల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత నది మీదుగా టేకు కలప అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. స్మగ్లర్లు కలపను తెప్పలుగా మార్చి నది మీదుగా అక్రమంగా తరలిస్తున్నారు. అధికారుల కళ్లు కప్పి మహారాష్ట్ర నుంచి మంచిర్యాల మీదుగా ఇతర జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి కలప అక్రమ రవాణా తగ్గినట్లు అధికారులు భావిస్తున్నప్పటికీ స్మగర్లు గుట్టుచప్పుడు కాకుండా లక్షల రూపాయల విలువగల కలపను ఎల్లలు దాటిస్తూనే ఉన్నారు.

మహారాష్ట్రలోని పలు గ్రామాలకు ప్రాణహిత ఇవతలి వైపున ఉన్న పలు ఊర్లతో రాకపోకలు, వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఇందులో అక్రమంగా చేసే దందాలే అధికంగా ఉన్నాయి. ప్రాణహిత నది సరిహద్దున ఉన్న మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో వివిధ గ్రామాల మీదుగా జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు కలప అక్రమ రవాణా అవుతోంది. ఆయా మండలాల్లోని పలు గ్రామాలు ప్రాణహిత నదీ తీరానికి సరిహద్దున ఉన్నాయి. నదీ అవతలి వైపు ఉన్న మహారాష్ట్రలోని తేకడ, రేగుంట, గర్కపల్లి, మొట్లగూడెం తదితర ప్రాంతాల నుంచి అక్కడి స్మగర్లు టేకు చెట్లను నరికి దుంగలుగా మలుస్తున్నారు. ఈ దుంగలతో తయారు చేసిన తెప్పలను వర్షాకాలంలో ప్రవాహం ఉన్న రోజుల్లో ప్రాణహిత మీదుగా ఇవతలివైపు తరలిస్తున్నారు. వేసవిలో నీరులేని సమయంలో నేరుగా వాటిని నది దాటిస్తున్నారు. అలా ప్రాణహిత దాటి తెలంగాణకు వచ్చిన కలపను స్మగ్లర్లు స్వాధీనం చేసుకొని రహస్య ప్రాంతాల్లో నిలువ చేసుకుని అదునుచూసి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

జాతీయ రహదారి మీదుగా..

మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల నుంచి కలపను ఇవతలి వైపు సులువుగా తరలించేందుకు అక్కడి స్మగ్లర్లకు ప్రాణహిత నది కలిసి వస్తోంది. అక్రమ కలపను పట్టణ ప్రాంతాలకు తరలించేందుకు ఇక్కడి స్మగ్లర్లు 63వ జాతీయ రహదారిని ఎంచుకుంటున్నారు. అక్కడి కలప డిపోల్లో కొంతమేర పర్మిట్‌ కలపను కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు దానికి అక్రమంగా రవాణా చేసిన కలపను జతచేసి వివిధ వాహనాల ద్వారా అనుమానం రాకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. జాతీయ రహదారిపై ఎక్కడ అటవీశాఖ తనిఖీ కేంద్రాలు లేకపోవడం స్మగర్లకు కలిసివస్తోంది. జూలైలో కోటపల్లి మండలం జనగామ శివారులోకి ప్రాణహిత నదిలో తెప్పలుగా టేకు కలప వస్తుందన్న సమాచారం మేరకు అటవీ అధికారులు నిఘా ఉంచారు. తీరం వెంట గాలింపు చేపట్టగా సుమారు రూ.4 లక్షల విలువైన 20 టేకు దుంగలు లభ్యమయ్యాయి. అలాగే ఆగస్టు 29న కోటపల్లి మండలం వెంచపల్లి సమీపంలోని ప్రాణహిత నది మీదుగా తెలంగాణకు తెప్పల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 29 టేకు దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఆ కలప విలువ రూ.2 లక్షలు ఉన్నట్లు తెలిపారు. గతేడాది అక్టోబరులో కోటపల్లి మండ లంలోని లింగన్నపేట వైపు నుంచి చెన్నూరుకు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అధికారులు పట్టుకున్నారు. ఇందులో 20 వరకు టేకు దుంగలు ఉండగా రూ.లక్ష విలువైన కలపను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు పట్టుకుంటున్న కలప కొంత మొత్తంలో ఉండగా, వాళ్ల కళ్లు గప్పి స్మగ్లర్లు తరలించేదే పెద్ద మొత్తంలో ఉంటుందనే ప్రచారం ఉంది.

కలప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా

- సదానందం, కోటపల్లి రేంజ్‌ అధికారి

కలప అక్రమ రవాణాను నిరోధించేందుకు ఉన్నతాధికారుల సూచనలతో ఎప్పటికప్పుడు నిఘా ముమ్మరం చేస్తున్నాం. కోటపల్లి మండలం జనగామ మీదుగా కలప అక్రమ రవాణా అవుతోంది. సమాచారం అందగానే ప్రాణహిత నదీ తీరప్రాంతాలతో పాటు పలు మార్గాలలో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. మహారాష్ట్ర అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కలప అక్రమ రవాణా చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Oct 04 , 2024 | 10:34 PM