Share News

రెండో విడుత నమోదుపైనే ఆశలు

ABN , Publish Date - Nov 16 , 2024 | 10:31 PM

పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటరు నమోదు ప్రక్రియ ఆశించిన మేర జరగలేదు. ఎలక్షన్‌ కమిషన్‌ రెండో విడత ఓటరు నమోదుకు అవకాశం ఇచ్చింది. దీంతో బరిలో నిలచే ఆశావహులు ఓటరు నమోదుపై ఆశలు పెంచుకున్నారు.

రెండో విడుత నమోదుపైనే ఆశలు

మంచిర్యాల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటరు నమోదు ప్రక్రియ ఆశించిన మేర జరగలేదు. ఎలక్షన్‌ కమిషన్‌ రెండో విడత ఓటరు నమోదుకు అవకాశం ఇచ్చింది. దీంతో బరిలో నిలచే ఆశావహులు ఓటరు నమోదుపై ఆశలు పెంచుకున్నారు.

ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలో సుమారు 8 లక్షల వరకు గ్రాడ్యుయేట్లు ఉంటారని అంచనా వేయగా, అందులో 50 శాతం మేర కూడా ఓటరు నమోదు కాలేదు. టీచర్ల ఓటరు నమోదులో కూడా అంతంత మాత్రంగానే ఉంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 300 మండలాలకు సంబంధించి ప్రస్తుతం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జీవన్‌రెడ్డి, టీచర్‌ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూకు చెందిన రఘోత్తంరెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీ కాలం ఫిబ్రవరిలో ముగియనుండగా సెప్టెంబరు 30 నుంచి నవంబరు 6వ తేదీ వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగింది.

నాలుగో స్థానంలో మంచిర్యాల జిల్లా....

ఓటరు నమోదు ప్రక్రియలో రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా నాలుగో స్థానంలో ఉంది. 30వేల పై చిలుకు ఓటరు నమోదులో మొదటి స్థానంలో కరీంనగర్‌ ఉం డగా, ద్వితీయ స్థానంలో జగిత్యాల, తృతీయ స్థానంలో సిద్దిపేట, నాలుగో స్థానంలో మంచిర్యాల జిల్లాలు ఉన్నా యి. మంచిర్యాల జిల్లాలో గత ఎమ్మెల్సీ ఎన్నికల సం దర్భంగా 15వేల మంది ఓటరుగా నమోదు చేసుకోగా, ఈసారి 30వేల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకొన్నారు. జిల్లాలో ముఖ్యంగా యువత నుంచి మంచి స్పందన లభించింది.

రెండో విడుతపైనే ఆశావహుల ఆశలు...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదుకు సెప్టెంబరు 30 నుంచి నవంబరు 6 వరకు ఎలక్షన్‌ కమిషన్‌ గడువు విధించింది. ఊహించినంతగా ఓటరు నమోదు కాక పోవడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న ఆశావహులు నిరుత్సాహానికి గురయ్యారు.

ఆశావహులే రంగంలోకి దిగి వారి పట్టభద్రులు సర్టిఫికెట్లు సేకరించి ఓటరు నమోదు చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ రెండో విడుత ఓటరు నమోదుకు అవకాశం కల్పించడంతో ఓటర్ల సంఖ్య మరో లక్షన్నర వరకు పెరిగే అవకాశాలున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండో విడుతలో భాగంగా ఈ నెల 23 నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు ఎలక్షన్‌ కమిషన్‌ తుది గడువు విధించింది.

ఊపందుకున్న ప్రచారం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ మండలి ఎన్నికల ప్రచార సందడి పెరుగుతోంది. టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి పోటీ నెలకొనడంతో టీచర్లకు ఓటరు నమోదు తప్పనిసరి అయింది. అయినప్పటికీ ఉపాధ్యాయుల నుంచి స్పందన అంతంతే ఉంది.

Updated Date - Nov 16 , 2024 | 10:31 PM