Share News

కాసులు కురిపిస్తున్న నాలా కన్వర్షన్‌

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:01 PM

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కొందరు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. వ్యవసాయ భూములను నివాస ప్లాట్లుగా మార్చేందుకు నాలా (నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ అసస్‌మెంట్‌ యాక్టు) కన్వర్షన్‌ చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్ని డాక్యుమెంట్లు, ఇతర సదుపాయాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారుల చేతులు తడప నిదే కన్వర్షన్‌ కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాసులు కురిపిస్తున్న నాలా కన్వర్షన్‌

మంచిర్యాల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కొందరు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. వ్యవసాయ భూములను నివాస ప్లాట్లుగా మార్చేందుకు నాలా (నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ అసస్‌మెంట్‌ యాక్టు) కన్వర్షన్‌ చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్ని డాక్యుమెంట్లు, ఇతర సదుపాయాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారుల చేతులు తడప నిదే కన్వర్షన్‌ కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ వెంచర్లు ఏర్పాటు చేస్తే పన్నుల భారం పడుతుందని భావిస్తున్న రియల్టర్లు వ్యవ సాయ భూములను ఫామ్‌ ల్యాండ్‌గా పేర్కొంటూ గుంటల్లో విక్రయిస్తు న్నారు. గుంటల్లో కొనుగోలు చేసిన వ్యక్తులు నాలా కన్వర్షన్‌ చేయిం చేందుకు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ప్రాంతాన్ని బట్టి వసూళ్లు చేస్తున్నారనే ప్రచారం ఉంది. ప్రధానంగా జిల్లా, మండల కేంద్రాలకు సమీపంలో ఉన్న రెవెన్యూ అధికారులకు నాలా కన్వర్షన్‌ కాసుల పంట పండిస్తోందనే చర్చ జరుగు తోంది. మరోవైపు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఈ తరహా కొత్త డాక్యుమెం ట్లను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

గుంటల్లో విక్రయాలు...

జిల్లాలో ఫామ్‌ ల్యాండ్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వెంచర్లు చేస్తే అనుమతులతోపాటు 10 శాతం భూమిని మున్సిపల్‌, గ్రామ పంచాయతీలకు పార్కుల అభివృద్ధికి వదిలి పెట్టాల్సి వస్తోంది. ఓ వైపు పన్నులు చెల్లించడంతోపాటు మరోవైపు భూమిని కోల్పోతుండటంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతోందని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భావిస్తు న్నారు. దీంతో 10 ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఫామ్‌ ల్యాండ్‌గా మారుస్తున్నారు. ఐదు గుంటల నుంచి ఆపైన ప్లాట్లుగా మారుస్తున్నారు. గజాల్లోకి మార్చాలంటే నాలా కన్వర్షన్‌తోపాటు అనుమతులు కూడా తీసుకొని లే అవుట్‌ చేయాల్సి ఉండటం ఆర్థిక భారాన్ని పెంచుతుండటంతో ఫామ్‌ ల్యాండ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫామ్‌ ల్యాండ్‌కు ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణిలోనే ఐదు గుంటల చొప్పున భూమి కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. భూమి కొనుగోలు చేసిన వ్యక్తులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందుతున్నాయి. తాము కొనుగోలు చేసిన ఫామ్‌ ల్యాండ్‌ను గుంటల నుంచి గజాల్లోకి నాలా కన్వర్షన్‌ చేయిస్తున్నారు. దీంతో రియల్టర్లకు భారం తప్పుతుండగా, కొనుగోలు చేసిన వారికి తక్కువ ధరకే భూమి లభిస్తోంది. అయితే ప్రభుత్వానికి మాత్రం నష్టం వాటిల్లుతోంది. పన్నులు, లే అవుట్‌ రుసుం రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. జిల్లాలో వందల ఎకరాల్లో ఫామ్‌ ల్యాండ్‌ అమ్మకాలు జరుగుతున్నాయి.

కాసులు కురిపిస్తున్న నాలా కన్వర్షన్‌...

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా ఉన్న ప్రాంతాల్లో నాలా కన్వర్షన్‌ అధికారులకు కాసుల పంట పండిస్తోంది. మంచిర్యాల, లక్షెట్టిపేట, నస్పూర్‌, జైపూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, తాండూరు, హాజీపూర్‌లో రియల్‌ ఎస్టేట్‌ దందా సాగుతోంది. వ్యవసాయ భూముల్లో కొత్తగా వెంచర్లతో పాటు ఫామ్‌ ల్యాండ్‌లు ఏర్పాటవుతుండగా, వాటిని కొనుగోలు చేసిన వారు ప్లాట్లుగా మార్చుకుంటున్నారు. ఎకరాల భూమిని గుంట్లో అమ్మకాల సమయంలోనే ధరణిలో రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి ఉంటుంది. ఆ సమయంలోనే రెవెన్యూ శాఖలో ఏరియాను బట్టి గుంట భూమికి రూ. 5 వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాలా కన్వర్షన్‌ చేయాలంటే 200 గజాల స్థలానికి ఏరియా ను బట్టి రూ. 10వేల నుంచి రూ. 50 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి నెల పదుల సంఖ్యలో నాలా కన్వర్షన్‌, ఫామ్‌ల్యాండ్‌ భూములను గుంటల్లో రిజిస్ట్రేషన్‌ చేయడం వంటి పనులకు భారీగానే ముడుపులు అందుతున్నాయనే చర్చ సాగుతోంది.

కొత్త డాక్యుమెంట్లకు అదనపు వసూళ్లు

వ్యవసాయ భూములను గుంటల్లో నుంచి గజాలకు నాలా కన్వర్షన్‌ చేయించిన తరువాత, అందులో కొంత భూమిని ఇతరులకు విక్రయించా లంటే మళ్లీ చేతులు తడపాల్సిందే. నాలా కన్వర్షన్‌ అయిన భూమి నుంచి కొన్ని గజాలను ఇతరులకు విక్రయించేందుకు కొత్త డాక్యుమెంట్‌ తయా రు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కొత్త డాక్యుమెంట్‌ తయారీ, రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యే వరకు 200 గజాల స్థలానికి భూమి విలువను బట్టి రూ.20 వేల నుంచి రూ. 80 వేలకు పైగా ఖర్చవుతుందని సమాచారం. ఇందులో డాక్యుమెంట్‌ రైటర్‌ నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ వరకు వాటాలు ఉంటాయనే ఆరోపణలున్నాయి. పాత డాక్యుమెంట్‌ల కంటే కొత్త వాటికి 40 శాతం అదనంగా వసూలు చేస్తారని సమాచారం.

Updated Date - Sep 10 , 2024 | 11:01 PM