Share News

ప్రభుత్వ, అసైన్డ్‌ స్థలాల్లో అక్రమ వెంచర్లు

ABN , Publish Date - Sep 19 , 2024 | 11:47 PM

రియల్టర్ల ధన దాహం ప్రజలకు శాపంగా మారుతోంది. రియల్టర్ల మాయాజాలంలో చిక్కుకుని నిలువునా మోసపోతున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా తమ అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న వ్యాపారులు అదును చూసి ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నారు. ఈ తతంగం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది.

ప్రభుత్వ, అసైన్డ్‌ స్థలాల్లో అక్రమ వెంచర్లు

మంచిర్యాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రియల్టర్ల ధన దాహం ప్రజలకు శాపంగా మారుతోంది. రియల్టర్ల మాయాజాలంలో చిక్కుకుని నిలువునా మోసపోతున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా తమ అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న వ్యాపారులు అదును చూసి ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నారు. ఈ తతంగం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది. మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాటి నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకొంది. జిల్లాలోని మారుమూల మండలాల ప్రజలేగాక, ఉద్యోగులు, వ్యాపారస్తులు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటు న్నారు. ఇందు కోసం అనువైన స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొందరు అక్రమ దందాకు తెరలేపారు.

ప్రభుత్వ, శిఖం భూముల్లో వెంచర్లు....

జిల్లా కేంద్రంతోపాటు నస్పూర్‌, జైపూర్‌, చెన్నూరు, హాజీపూర్‌, లక్షెట్టి పేట, మందమర్రి, బెల్లంపల్లి, తాండూరు ఏరియాల పరిధిలో వెంచర్లు పుట్టుకు వస్తున్నాయి. ప్రభుత్వ, శిఖం, అసైన్డ్‌ భూముల్లో ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ప్రజలకు అంటగడుతూ అందినకాడికి దండుకుంటు న్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు ఏర్పాటు చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. స్థలాల పూర్వాపరాలు పరిశీలించని ప్రజలు వాటిని కొనుగోలు చేసి భవనాలు నిర్మించుకుంటు న్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, చెరువులు, శిఖం, నాలాలు, నిషేధిత భూముల్లో వందల సంఖ్యలో భవనాలు దర్శనమిస్తాయి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది.

వెంచర్లు ఒకచోట...ప్లాట్లు మరోచోట

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇటీవల కొత్త పుంతలు తొక్కు తోంది. పట్టా భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తున్న కొందరు వ్యాపారులు ప్లాట్లను మాత్రం సమీపంలోని ప్రభుత్వ స్థలాల్లో చూపుతుండటం వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో పట్టా భూమిలో వెంచర్‌ ఏర్పాటు చేసిన ఓ వ్యాపారి కస్టమర్లకు సమీపంలోని ప్రభుత్వ స్థలంలో చూపెట్టడం వివాదాస్పదంగా మారింది. అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన కొందరు ప్రభుత్వ స్థలమని తెలియడంతో మున్సిపల్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఇదే తంతు జరగడం విశేషం.

నస్పూర్‌కు చెందిన ఓ వ్యాపారి కలెక్టరేట్‌ రోడ్డులోని సర్వే నెంబర్‌ 40లో ప్లాట్లు ఏర్పాటు చేశాడు. ప్లాట్లు కొనుగోలు చేసిన కొందరికి సర్వే నెంబర్‌ 42లో ప్లాట్లు చూపాడు. రిజిస్ట్రేషన్‌, ఇళ్ల పర్మిషన్‌ సమయంలో పట్టా భూమికి సంబంధించిన పత్రాలు జత చేయడంతో అనుమతులు వచ్చాయి. ఇంటి నిర్మాణ స్థలం ప్రభుత్వ భూమి కావడంతో వివాదం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ నాయకుడు ఢీకొండ అన్నయ్య భూమి కొనుగోలు పత్రంలో సర్వే నెంబర్‌ 40 ఉండగా, సర్వే సందర్భంగా అతను నిర్మించిన ఐదంతస్థుల భవనం ప్రభుత్వ భూమి అయిన సర్వే నెంబర్‌ 42లో ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు గురువారం భవనాన్ని నేలమట్టం చేశారు.

అలాగే శ్రీశ్రీనగర్‌లో ఓ ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన రెండెకరాల వెంచర్‌లోనూ ఇదే తంతు జరిగింది. ప్లాట్లు విక్రయించే సమయంలో సదరు వ్యాపారి సమీపంలోని పట్టా భూముల నెంబర్లు వేసి, రిజిస్ట్రేషన్లు చేశాడు. విషయం వెలుగు చూడటంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు లబోదిబోమంటున్నారు. అయితే అధికారుల చర్యలకు స్థలాలు కొనుగోలు చేసిన వారే బాధ్యులవుతుండగా, ప్లాట్లు ఏర్పాటు చేసిన వ్యాపారులపై మాత్రం చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

యథేచ్ఛగా అనుమతులు

జిల్లాలో ప్రభుత్వ, చెరువు శిఖం భూముల్లో పలు వెంచర్లు, ఇళ్లకు అధికారులు అనుమతులు ఇస్తున్నారు. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్టీఎల్‌), చెరువు శిఖం, బఫర్‌ జోన్ల పరిధిలో యథేచ్ఛగా నిర్మాణాలు జరిగాయి. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోగల సర్వే నెంబర్‌ 45 ఎర్రకుంట చెరువు శిఖం భూమి కబ్జాకు గురైంది. 11 ఎకరాల విస్తీర్ణం ఉండాల్సి ఉండగా సగానికిపైగా కబ్జా అయింది. పక్కనే వెంచర్‌ ఏర్పాటు చేసిన వ్యాపారులు శిఖం భూముల్లో రోడ్లు వేసి, విక్రయాలకు పాల్పడ్డారు. చెన్నూరులోని కుమ్మరి కుంట చెరువు 971 సర్వే నెంబర్‌లో 16.24 ఎకరాల్లో విస్తరించి ఉంది. విచ్చలవిడి కబ్జాల కారణంగా ప్రస్తుతం 2 ఎకరాలకే పరిమితమైంది. చెరువు భూముల్లో పెద్ద భవనాలు వెలిశాయి. మందమర్రి మండలం చిర్రకుంటలోని లోతొర్రె చెరువు, ఆదిల్‌ పేటలోని ఎర్ర చెరువులు కొంతభాగం కబ్జాలకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. భీమారం మండల కేంద్రంలోని సర్వే నంబర్‌ 570లో 14.39 ఎకరాల విస్తీర్ణంలో ఊర చెరువు ఉంది. ఇందులో ఎఫ్టీఎల్‌ పరిధిలో ఉన్న 6.29 ఎకరాల్లో పక్కా భవనాలు వెలిశాయి. మిగతా కొంత భూమిలో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని రాముని చెరువు, పోచమ్మ చెరువు, సాయికుంట, చీకటి వెలుగుల కుంటలు పెద్ద మొత్తం లో కబ్జాలకు గురయ్యాయి. రాముని చెరువును ఆనుకొని వెంచర్‌ ఏర్పాటు చేయగా బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. రాముని చెరువుకు గతంలో హద్దులు ఏర్పాటు చేసినప్పటికీ శిఖం భూముల్లో వెలిసిన భవనాలపై చర్యలు తీసుకోలేదు. అలాగే పోచమ్మ చెరువులో అధికభాగం కబ్జాలకు గురైంది. 67 ఎకరాల పై చిలుకు విస్తీర్ణం ఉన్న చెరువు చుట్టూ ఎఫ్టీఎల్‌ పరిధిలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరుగగా, బఫర్‌ జోన్లలో కూడా అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. హైటెక్‌సిటీ సమీపంలో రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న చీకటి వెలుగుల కుంట దాదాపుగా కనుమరుగైంది. చెరువు చుట్టూ ఇళ్లు ఉండటం, మరోవైపు వెంచర్‌ ఏర్పాటైంది. సాయికుంట చెరువులోనూ అక్రమ కట్టడాలు వందల సంఖ్యలో వెలిశాయి. ఎఫ్టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు వెలిసినా అడిగేవారు కరువయ్యారు.

Updated Date - Sep 19 , 2024 | 11:47 PM