Share News

గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలకు అస్వస్థత

ABN , Publish Date - Nov 06 , 2024 | 10:59 PM

జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 12 మంది విద్యార్థినులు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)కి తరలించారు. హాస్టల్‌లో రోజువారీలాగానే ఉదయం విద్యార్థినులకు కిచిడీ, చారు తయారు చేసి అందించారు.

 గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలకు అస్వస్థత

మంచిర్యాల అర్బన్‌, నవంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 12 మంది విద్యార్థినులు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)కి తరలించారు. హాస్టల్‌లో రోజువారీలాగానే ఉదయం విద్యార్థినులకు కిచిడీ, చారు తయారు చేసి అందించారు. హాస్టల్‌లో 160 మంది విద్యార్థినులు కిచిడీ తిన్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థినులు శ్రీలేఖ, శ్రీలత, నాగదేవత, లక్ష్మి, రుషిత, జ్యోతిలక్ష్మి, మౌనిక, సారిక, భూమిక, సింధూ, రాధిక, వైష్ణవిలు కడుపులో వికారంగా ఉందంటూ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థినులు వాంతి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లితండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, 24 గంటలపాటు అబ్జర్వేషన్‌ తర్వాత వారిని డిశార్జ్‌ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయమై హాస్టల్‌ వార్డెన్‌ లక్ష్మిరాజంను వివరణ కోరగా హాస్టల్‌లోని విద్యార్థినులతోపాటు తామూ కిచిడీ తిన్నామని, 12 మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారని, మిగతా వారెవరికి ఏం కాలేదన్నారు. సంఘటన జరిగిన అనంతరం హాస్టల్‌లో ఆరోగ్యశాఖ అధికారులు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించారు.

విద్యార్థినులను పరామర్శించిన కలెక్టర్‌ :

విద్యార్థినిల అస్వస్థత వార్త తెలుసుకున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఏసీపీ ఆర్‌.ప్రకాష్‌, ఆసుపత్రి ఆర్‌ఎంఓ శ్రీధర్‌తో కలిసి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్‌ ఆరా తీశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో తాగునీరు, ఆహారం నమూనాలను సేకరించి పరీక్షలు చేయించామని తెలిపారు. విద్యార్థినులు ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న పచ్చడిని తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారని నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ హరీష్‌రాజ్‌ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు.

విద్యార్థులు క్షేమంగా ఉన్నారు

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సాయికుంట గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

-పాఠశాలను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

సాయికుంటలోని ఆశ్రమ పాఠశాలను డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలోని 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్‌లు శ్రీధర్‌, అనిత, అశోక్‌, సుమన్‌, సాయి, వెంకటేశ్వర్‌, గిరిజన సంక్షేమాధికారి గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 10:59 PM