Share News

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నిబంధనలు బేఖాతరు

ABN , Publish Date - Aug 30 , 2024 | 10:42 PM

అత్యవసర చికిత్సకు మంచిర్యాల జిల్లా కేంద్రం అందుబాటులో ఉంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తోపాటు కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి వైద్యం కోసం వస్తుంటారు. దీంతో వ్యాపారుల చూపు వైద్య రంగంపై పడింది. మల్టీస్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ పేర్లతో ప్రైవేటు ఆసుపత్రులు వెలుస్తున్నాయి. వైద్య పరంగా ఎలాంటి అనుభవం లేని వారు సైతం పెట్టుబడులు పెట్టి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నిబంధనలు బేఖాతరు

మంచిర్యాల అర్బన్‌, ఆగస్టు 30: జిల్లాలోని బడా వ్యాపారులు వైద్యరంగాన్ని వ్యాపార రంగంగా మార్చేశారు. జిల్లాలో మల్టీ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ పేర్లతో ప్రైవేటు ఆసుపత్రులు వెలిశాయి. జిల్లా కేం ద్రంలో సుమారు 120 ఆసుపత్రులుండగా ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో మరో 125 ఆసుపత్రులు మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 245 ఆసుపత్రులున్నాయి. నూతనంగా ఏర్పాటవుతున్న పలు ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు. మరికొన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలున్నా నిపుణులైన వైద్య సిబ్బంది ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో 24 గంటలు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారనే బోర్డులను ఏర్పాటు చేస్తున్నప్పటికీ సంబంధిత వైద్యులు లేకపోగా విజిట్‌ డాక్టర్లు, ఎలాంటి స్పెషలైజేషన్‌ లేకుండా కేవలం ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన డ్యూటీ డాక్టర్లతోనే వైద్యం అందిస్తున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినవారు ఆసుపత్రులకు వెళ్తే వారికి అనవసరమైన పరీక్షలు, మందులు రాస్తూ దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని ఆసుపత్రుల్లో సరైన నిపుణులు లేకున్నా రెండు, మూడు రోజులు అడ్మిట్‌ చేసుకొని అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌, హైదరాబాద్‌కు రెఫర్‌ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ ఆసుపత్రుల్లో చేరి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఆర్‌ఎంపీలు, అంబులెన్స్‌ డ్రైవర్లను సదరు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వారికి కమీషన్లను ఆశగా చూపిస్తూ ఆసు పత్రులకు రోగులను రప్పించుకుంటున్నారు. ఆసుపత్రులకు తీసుకువచ్చే కేసు తీవ్రతను బట్టి, వైద్యానికి అయ్యే ఖర్చును బట్టి 10 నుంచి 30 శాతం మేర కమీషన్లు ముట్టజెప్తున్నట్లు సమాచారం. ధనార్జనే ధ్యేయంగా కొనసాగుతున్న ఆసుపత్రుల నిర్వాహకులు, కమీషన్లకు కక్కుర్తిపడే ఆర్‌ఎంపీలు, అంబులెన్స్‌ డ్రైవర్లు చేసే నిర్వాకం వల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారు.

నిబంధనలు బేఖాతరు

ఐపీ సేవలందించే ఆసుపత్రులను ఏర్పాటు చేయాలంటే విశాలమైన భవనాలు, రోగులకు అన్ని రకాల సౌకర్యాలు, ఐసీయూ, జనరల్‌ వార్డులు, అత్యవసర సేవలందించే అసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలతోపాటు వెంటిలేటర్‌ సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. సౌకర్యాలకు తగ్గట్లుగానే క్వాలిఫైడ్‌ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాల్సి వుంటుంది. చాలా ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా చిన్న చిన్న భవనాల్లో, ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కూడా పాటించడం లేదు.

పట్టించుకోని అధికారులు

ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. ఏదైన సంఘటన జరిగినప్పుడు రెండు, మూడు రోజులు మాత్రమే హంగామా చేస్తూ ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. సదరు ఆసుపత్రుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు నామమాత్రంగా వ్యవహరించడంపై వారికి మామూళ్లు అందుతుండటంతోనే చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు

డాక్టర్‌ హరీష్‌ రాజ్‌, డీఎంహెచ్‌వో

జిల్లాలో నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 5 టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ టీంకు హెడ్‌గా డిప్యూటీ డీఎంహెచ్‌వో, ప్రోగ్రాం ఆఫీసర్‌లను నియమిస్తున్నాం. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను పరిశీలించి నిబంధనలు పాటించని, క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్టుకు విరుద్ధంగా నడుస్తున్న, రెన్యూవల్‌ చేసుకోని ఆసుపత్రులకు నోటీసులను జారీ చేస్తాం. వాటిని సరిచేసుకోకుంటే సదరు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం.

Updated Date - Aug 30 , 2024 | 10:42 PM