Share News

జిల్లాలో పెరుగుతున్న పులుల సంచారం

ABN , Publish Date - Dec 03 , 2024 | 11:12 PM

మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం క్రమంగా పెరుగుతోంది. లక్షెట్టిపేట అటవీ రేంజ్‌ పరిధిలో పెద్దపులి సంచరించగా, తాజాగా బెల్లంపల్లి ఫారెస్టు డివిజన్‌ పరిధిలో చిరుతపులి కనిపించింది. అటవీ అధికారులు పులుల సంచారాన్ని ద్రువీకరించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు ఎప్పు డు ఏం జరుగుతోందనని భయాందోళనకు గురవుతు న్నారు.

జిల్లాలో పెరుగుతున్న పులుల సంచారం

మంచిర్యాల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం క్రమంగా పెరుగుతోంది. లక్షెట్టిపేట అటవీ రేంజ్‌ పరిధిలో పెద్దపులి సంచరించగా, తాజాగా బెల్లంపల్లి ఫారెస్టు డివిజన్‌ పరిధిలో చిరుతపులి కనిపించింది. అటవీ అధికారులు పులుల సంచారాన్ని ద్రువీకరించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు ఎప్పు డు ఏం జరుగుతోందనని భయాందోళనకు గురవుతు న్నారు. పొరుగున ఉన్న కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన పులి దాడి ఘటన మరవక ముందే జిల్లాలో చిరుతపులి ప్రత్యక్షం ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. కాగజ్‌నగర్‌ మండలం గన్నారం గ్రామానికి చెందిన మహిళపై పులి దాడి చేయగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరుసటి రోజే సిర్పూర్‌ మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన రౌతు సురేష్‌పైనా దాడి చేయగా, ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

జిల్లాలో 20 వరకు పులులు

జిల్లాలోని జన్నారం, లక్షెట్టిపేట, బెల్లంపల్లి, చెన్నూరు అటవీ డివిజన్‌ల పరిధిలో 20 వరకు చిరుత పులులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. లక్షెట్టిపేట రేంజ్‌ పరిధిలో నాలుగైదు చిరుతలు సంచరిస్తుండగా, బెల్లంపల్లి డివిజన్‌లో ఆరు వరకు ఉన్నట్లు సమాచారం. అలాగే జన్నారం, చెన్నూరు అటవీ డివిజన్‌ల పరిధిలోనూ పది వరకు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున బెల్లంపల్లి అటవీ రేంజ్‌ పరిధిలోని చర్లపల్లి గ్రామంలో స్థానికులకు చిరుత కనపడటంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ రేంజ్‌ అధికారి పూర్ణచందర్‌ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అడవిలో చిరుత పాద ముద్రలను గుర్తించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. జన్నారం డివిజన్‌ మొదలుకొని చెన్నూరు వరకు అటవీ ప్రాంతంలో పెద్ద పులులు, చిరుతలు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్తున్నాయి. పులులు ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతాయో తెలియని పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనకు గరవుతున్నారు.

అటవీ ప్రాంతానికి వెళ్లకూడదు...

బెల్లంపల్లి రేంజ్‌ పరిధిలో చిరుత సంచరిస్తున్నందున తెల్లవారుజాము, రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దని అక్కడి రేంజర్‌ పూర్ణచందర్‌ ప్రజలకు సూచించారు. చిరుతలు, పెద్దపులులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్‌ అధికారులు ప్రజలను కోరుతున్నారు. మనుషులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆవులు, మేకలపై దాడులు చేస్తే పరిహారం అందజేస్తామని ప్రచారం చేస్తున్నారు.

చర్లపల్లిలో చిరుతపులి సంచారం

బెల్లంపల్లి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చర్లపల్లి గ్రామ సమీపంలో మంగళవారం చిరుతపులి సంచరించింది. గ్రామస్థులు చిరుతపులిని చూశామని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు రేంజ్‌ అధికారి పూర్ణచందర్‌ ఆధ్వర్యంలో అధికారులు అటవీ ప్రాంతంలో, చర్లపల్లి గ్రామ శివారులోకి వెళ్లి పరిశీలించారు. చిరుతపులి అడుగులను గుర్తించారు. చిరుతపులి చర్లపల్లి నుంచి ఎల్లారం గ్రామం వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో చర్లపల్లి, జన్కాపూర్‌, ఎల్లారం, చర్లపల్లి గ్రామం మీదుగా కన్నెపల్లి, భీమిని మండలాలకు వెళ్లే వాహనదారులు భయపడుతున్నారు. పత్తి ఏరేందుకు, పొలం పనులకు వెళ్లిన రైతులు, కూలీలు చిరుత పులి భయంతో మధ్యాహ్నమే ఇండ్లకు చేరుకున్నారు. స్ధానిక గ్రామాల ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇండ్ల నుంచి బయటకు రావద్దని, బయటకు వెళ్లాల్సి వస్తే గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.

Updated Date - Dec 03 , 2024 | 11:12 PM