Share News

పత్తి పంటకు రోగాల పోటు

ABN , Publish Date - Nov 02 , 2024 | 10:55 PM

పత్తి రైతు పరేషాన్‌లో పడ్డాడు. సీజన్‌ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్న పత్తి పంట ఆఖరు దశలో తెగుళ్లు, చీడపీడలు విజృంభించడంతో దెబ్బతింటోంది. తెగులు ఉధృతికి రెండో దఫా పిందె కాయ కట్టక ముందే ఆకులు రాలిపోతున్నాయి. వర్షాలు లేక బలహీన పడిన పంటకు తెగులు తోడై నెల రోజుల ముందే చేలు ఎండిపోతున్నాయి. మరోవైపు లద్దెపురుగు విజృంభణ రైతులను బెంబేలెత్తిస్తోంది. రసాయన మందులు పిచికారి చేసినా లాభం లేదని రైతులు వాపోతున్నారు. ప్రతికూల వాతావరణం, చీడపీడల దాడి వెరసి దిగుబడి సగానికి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పత్తి పంటకు రోగాల పోటు

నెన్నెల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : పత్తి పంటకు తెగులు సోకడం, లద్దెపురుగు విజృంబించడం రైతన్నకు శాపంగా మారింది. ప్రతీ చేలో ఏదో ఒక రోగం సోకి పంట దెబ్బతిన్నది. ఈ యేడు ఎండు తెగులు ఉధృతి అధికంగా ఉంది. దీనికి తోడు దాదాపు నెల రోజులపాటు వర్షం లేకపోవడంతో ఆకులు ఎండి రాలిపోయాయి. డిసెంబరు వరకు పచ్చగా ఉండాల్సిన చేలు ఒక నెల ముందుగానే ఆకులు రాలి ఎండి పోతున్నాయి. మొదలు కాసిన కాయలు గింజకట్టకుండానే పగిలాయి. ముందుగా పగిలిన పత్తి బరువు తూగదని రైతులు అంటున్నారు. పదిహేను రోజుల కిందట వర్షం ఉంటే పూతంతా కాతగా మారేది. చెట్లు ఎండిపోయాక వర్షం కురిసిందని, ఇప్పుడు కురిసిన వానతో ప్రయోజనం లేదంటున్నారు. మూడు సార్లు పత్తి ఏరాల్సి ఉండగా, ఒకే దఫాతో పత్తి సేకరణ పూర్తయ్యేలా ఉందని రైతులు అంటున్నారు.

- పొగాకు లద్దెపురుగు ఉధృతి

ఈ యేడు పత్తిలో లద్దె పురుగు ఉధృతి అధికంగా ఉంది. మాయదారి చీడ రైతుల ఆశలను తొలిచేసింది. కాయలు పెరిగే దశలో పురుగు ఉధృతితో రైతులకు దిక్కుతోచడం లేదు. రోజుల వ్యవధిలోనే ఆకులను, పూత, పిందె, కాయలను తినేస్తున్నాయని రైతులు తెలిపారు. పురుగు నియంత్రణకు రైతన్నలు నానాపాట్లు పడుతున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి మందులు స్ర్పే చేస్తున్నారు. గతంలో ఒకే సారి పురుగు మందు స్ర్పే చేస్తే లార్వా నుంచి పురుగుల వరకు నాశనం అయ్యేవి. పురుగులను అదుపు చేసేందుకు ఒక్కో రైతు మూడు సార్లు మందులు పిచికారి చేశారు. మందు స్ర్పే చేసిన వారం పదిరోజుల్లో చేలల్లో పురుగులు మళ్లీ కనిపిస్తున్నాయని రైతులు పేర్కొన్నారు. బీటీ పత్తిలో సాధారణంగా 90 రోజుల వరకు కాయతొలుచు పురుగును తట్టుకునే నిరోధక శక్తి ఉంటుంది. దీంతో 100 నుంచి 120 రోజులు దాటిన తర్వాత పురుగుల ఉనికి కనిపించేది. ఈ యేడు 70-80 రోజుల వయసు నుంచే పొగాకు లద్దె పురుగు సోకింది.

-పెరిగిన విస్తీర్ణం.. తగ్గనున్న దిగుబడి

ఈ సీజన్‌లో జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గతేడాది కంటే ఈ యేడు 15 వేల ఎకరాల్లో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. సాగు విస్తీర్ణం పెరిగినప్పటికి ప్రతికూల పరిస్థితులు, చీడపీడల కారణంగా దిగుబడులు తగ్గనున్నాయి. చెట్టుకు వందకు పైగా కాయలు ఉండాల్సింది. 20 నుంచి 25 కాయలు మాత్రమే ఉన్నాయి. ఉన్న కాయలు కూడా సైజు పెరగడం లేదని అంటున్నారు. సాదారణంగా ఎకరానికి పది నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. అలాంటిది ఆరు నుంచి ఏడు క్వింటాళ్లు దిగుబడి రావడమే కష్టమని రైతులు అంటున్నారు.

సగం చేను ఎండిపోయింది

అల్లంపల్లి సత్తయ్య, రైతు, ఘన్‌పూర్‌

నందులపల్లిలో ఆరు ఎకరాల చేను కౌలుకు తీసుకొని పత్తి వేశాను. మొదట మంచిగా ఎదిగింది. పదిహేను రోజుల కిందట తెగులు సోకింది. వారం పది రోజుల్లోనే సగం చేను ఎండిపోయింది. మిగతా చెట్లు కూడా వడలిపోతున్నాయి. ముందుగా కాసిన కాయలే తప్ప ఆ తర్వాత వచ్చిన పూత కాత రాలిపోయింది. యేటా మూడు సార్లు పత్తి ఏరే వాళ్లం ఈ సారి ఒక్క సారికే చేను ఖాళీ అయ్యేలా ఉంది.

-మందులకు లద్దె పురుగు లొంగడం లేదు

-సుంకరి బాపు, రైతు, నెన్నెల

పొగాకు లద్దెపురుగు పత్తికి తీవ్రంగా నష్టం చేస్తోంది. ఈ ఏడు వర్షాలు లేక చేలు సరిగ్గా ఎదగనే లేదు. పూత, కాతను దక్కించుకుందామంటే లద్దె పురుగు దాపురించింది. పురుగులు ఆకులను మేసి జల్లెడలా మారుస్తున్నాయి. రెండుమూడు రోజుల వ్యవధిలోనే చేనంత మేసేస్తున్నాయి. పూత, గూడ, కాయలను తినేస్తున్నాయి. ఇప్పటికి మూడు సార్లు పురుగు మందు పిచికారి చేశాను. మందుకు పురుగులు లొంగడం లేదు. పురుగు మందులకు వేలకు వేలు ఖర్చవుతోంది.

వర్షాభావంతో తగ్గిన పత్తి దిగుబడి

-తీరని నష్టాన్ని మిగిల్చింది - సామల భీమయ్య, ధర్మారావుపేట, రైతు

ఎనిమిది ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. వర్షాలు మొదట్లో మంచిగా కురిశాయి. దీంతో చెట్లు ఏపుగా పెరిగాయి. కానీ కాయలు లేవు. కొంత పూత దశలో ఎండ వేడికి రాలిపోగా, మరికొన్ని కాయలు వచ్చిన తర్వాత రాలిపోయాయి. చెట్టుకు 20 కాయలకు మించి లేవు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు.

Updated Date - Nov 02 , 2024 | 10:55 PM