ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తా
ABN , Publish Date - Nov 01 , 2024 | 11:01 PM
చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సామాజిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు.
చెన్నూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సామాజిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సీఎస్‌ఆర్ నిధులతో రెండు అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ అంబులెన్స్‌లను కోటపల్లి మండలానికి కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అర్చనగిల్డా, ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి గురువారం ఉదయం పలు కాలనీల్లో మార్నింగ్ వాక్ చేశారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. కాలనీల్లో పేరుకుపోయిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
అభివృద్ధి పనులకు నివేదికలు ఇవ్వండి
మందమర్రి టౌన్, (ఆంరఽధజ్యోతి) : పట్టణంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నివేదికలు ఇస్తే నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. గురువారం రామన్ కాలనీ రైల్వే బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, రూ. 300 కోట్లకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయన్నారు. మందమర్రి మున్సిపాలిటీని మెగా మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధికి స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, నాయకులు ఉపేందర్ గౌడ్,. సొత్కు సుదర్శన్, బండి సదానందం యాదవ్, దుర్గం నరేష్, గుడ్ల రమేష్, మంద తిరుమల్‌రెడ్డి, ఆకారపు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి
దేశంలో పేదల అభ్యున్నతికి పాటు పడిన నాయకురాలు ఇందిరాగాంధీ అని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం ఇందిరాగాంధీ వర్ధంతిలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ గరీబీ హటావో నినాదంతో పేద ప్రజల కూడు, నీడ కల్పించిన నాయకురాలు అన్నారు. పాషా, మంద తిరుమల్, తదితరులు పాల్గొన్నారు.
కులగణనతోనే సామాజిక వర్గాల అభివృద్ధి
కుల గణనతో సామాజిక వర్గాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం బీసీ కుల గణన చేపట్టడంతో బీసీ కులాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. కుల గణనతోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేసే ప్రతీ పనిని విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు.