గూడెంలో కార్తీక పౌర్ణమి జాతర
ABN , Publish Date - Nov 15 , 2024 | 10:45 PM
జిల్లాలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. భక్తులు శుక్రవారం ఉదయం నదీ స్నానాలు ఆచరించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలు, దీపదానాలు చేశారు. గూడెం గుట్టపై నిర్వహించిన మహా జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో నిండింది. పలు ఆలయాలను భక్తులు సందర్శించారు.
దండేపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలం గూడెం గుట్టపై కొలువైన రమాసహిత సత్యనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి మహాజాతర జరిగింది. పలు జిల్లాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో నిండిపోయింది. ఆలయ సమీపంలోని గోదావరి నదిలో భక్తులు స్నానాలు ఆచరించారు. గోదావరి నదిలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరించి, నదిలో దీపారాధన చేశారు. అనంతరం ఆలయానికి వచ్చి సత్యదేవుడిని దర్శించుకున్నారు. గుట్ట కింద నుంచి ఘాట్‌రోడ్డు ద్వారా పైకి వెళ్ళడానికి భక్తుల సౌకర్యం కోసం భారీకేడ్లు, షామియానాలు, తాగునీరు ఏర్పాటు చేశారు. స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. వేద పండితులు, అర్చకులు స్వామి వారికి అభిషేకాలు, పుష్పాలంకరణ, మహాహారతీ, హోమాలు నిర్వహించారు. దీంతో గూడెం గుట్ట భక్తజనసంద్రోహంగా మారింది.
భక్తులు సత్యనారాయణస్వామి, అయ్యప్పస్వామి, సాయిబాబా ఆలయాలను సందర్శించారు. ఆలయం ప్రాంగణంలో రావి చెట్టు వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. పిల్లపాపలు, కుటుంబ సభ్యులు చల్లంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలంటూ పూజలు చేశారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు
కార్తీక పౌర్ణమి మహా జాతర సందర్భంగా ఈనెల 13నుంచి కొక్కిరాల రఘపతిరావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా పులిహోర, మజ్జిగ, తాగునీరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు-సురేఖ దంపతుల సమక్ష్యంలో నాయకులు పంపిణీ చేశారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఆలయం వద్ద ఎమ్మెల్యే పర్యవేక్షించారు. వారి కార్యకర్తలు, పిఎస్‌ఆర్ వాలంటీర్లు క్యూలో భక్తులకు తాగునీరు అందించారు.
ఫఫ సత్యదేవున్ని దర్శించుకున్న ప్రముఖులు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గూడెం దేవాలయంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు-సురేఖ దంపతులు, వరంగల్ రేంజ్ జైలర్ శాఖ డీఐజీ సంపత్ దంపతులు, డీసీపీ భాస్కర్ దంపతులు కార్తీక వ్రతాలను ఆచరించారు. కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఏసీపీ ప్రకాష్‌లు సత్యదేవున్ని దర్శించుకున్నారు.
కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వత్రం ఆచరిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. దేవస్థానం ప్రధాన ఆలయంలో రూ.1500, కింద వ్రత మండపంలో రూ.600 రెండు వ్రత మండపాల్లో కాకుండా అదనంగా మరో వ్రత మండపం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తి శ్రద్ధలతో సామూహి క వ్రతాలు ఘనంగా నిర్వహించారు.
ఫఫ భారీ పోలీసు బందోబస్తు
మహాజాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐ నరేందర్, ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్ ఆధ్వర్యంలో గోదావరి తీరం, ఆలయం వద్ద ప్రత్యేకబలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, భక్తులు దర్శనం కోసం వెళ్లే దారిలో ఇబ్బందులు కలుగకుండా పోలీసులను నియమించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసు అధికారులు పర్చవేక్షించారు. గోదావరి తీరం వద్ద గజఈతగాళ్ళను ఏర్పాటు చేశారు.
ఫఫ అయ్యప్ప దీక్షపరుల స్వీకరణ
గూడెం అయ్యప్ప స్వామి ఆలయం వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప దీక్షలు స్వీకరించారు. సుమారు 600లకు పైగా భక్తులు గురుస్వామి పురుషోత్తమచార్యులచే దీక్షలు స్వీకరించారు. ఉదయం నుంచే గూడెం శబరిమలై అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వాముల శరణుగోషతో మార్మోగింది.