Share News

ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్‌ దీక్ష

ABN , Publish Date - Nov 29 , 2024 | 10:57 PM

కేసీఆర్‌ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. నస్పూర్‌లోని బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో స్వరాష్ట్ర కలను నిర్థేశించిన రోజు దీక్షా -దీవస్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా ఇన్‌చార్జీ తుల ఉమా, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌ రావు, దుర్గం చిన్నయ్యలు పాల్గొన్నారు.

 ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్‌ దీక్ష

నస్పూర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. నస్పూర్‌లోని బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో స్వరాష్ట్ర కలను నిర్థేశించిన రోజు దీక్షా -దీవస్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా ఇన్‌చార్జీ తుల ఉమా, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌ రావు, దుర్గం చిన్నయ్యలు పాల్గొన్నారు. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దీక్షకు దిగిన కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు, ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ ఉద్యమ అమర వీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన వరకు సాగిన దృశ్యాలను 20 నిమిషాల నిడివి కలిగిన డ్యాకుమెంటరీని ప్రదర్శించారు. బీఆర్‌ఎస్‌ భవనంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. బాల్క సుమన్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్‌ 27-2001న గులాబీ జెండాను ఎగరవేసి మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మహనీయుడు కేసీఆర్‌ అని అన్నారు. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయిన శుభదినమన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో తెలంగాణలోని ప్రతీ వ్యక్తి, ప్రతీ వర్గం జీవన విధానం ఛిద్రమైందన్నారు. మళ్ళీ ఆ రోజులు దాపురించాయని, కాంగ్రెస్‌కు తెలంగాణలో ఎందుకు అధికారం ఇచ్చామని ప్రజలు బాధపడుతున్నారు. పేదల ఇళ్ళను హైడ్రా పేరిట కూల్చివేతలు, నాయకులపై అక్రమ కేసులు, నిర్బంధాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

అధికారం శాశ్వతం కాదని, ఈ రోజు మీరుంటే రేపు మా పార్టీ అధికారంలోకి వస్తుందని, అధికారంలో ఉన్నవారితో పాటు, అధికారులు కూడా సమన్వయం పాటించాలన్నారు. తాము అన్ని పరిశీలిస్తున్నామని, రేపు తాము అధికారంలోకి రాగానే అన్నింటికి బదులు తీర్చుకుంటామన్నారు. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని సుమన్‌ అన్నారు. పదేళ్ళ పాటు జిల్లా శాంతి భద్రతలతో ప్రశాంత వాతావరణంలో ఉన్నదని, ఏడాది కాలంలోనే అంతా పోయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరించే ఆలోచన లేదని, నిర్బంధం, నియంతృత్వంపైనే ఎక్కువ శ్రద్ధ ఉన్నదని విమర్శించారు. విధ్వంసం మినహా వికాసం లేదని, జిల్లాలో విద్వేష పూరిత రాజకీయాలను మానుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సుమన్‌ పిలుపునిచ్చారు. జిల్లా ఇన్‌చార్జీ తుల ఉమా మాట్లాడుతూ కేసీఆర్‌ తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిన మహానీయుడన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన పోరాటం మరిచిపోనిదన్నారు. మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు మాట్లాడుతూ కేసీఆర్‌ పదేళ్ళ పాలనలో రామరాజ్య పరిపాలన కొనసాగిందని, ఇవ్వాలా ఎలాంటి పరిపాలన సాగుతుందో చూస్తున్నామన్నారు. ఆనాడు పట్టుమని పది కేసులు కూడా నమోదు కాలే, కాని నేడు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు పెరిగిపోయాయన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పాలన సాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అఽధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటే వారి పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. దీక్ష దివస్‌ సందర్భంగా నస్పూర్‌, మంచిర్యాలలో డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన జెండాలు, తోరణాలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. మూడు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తల, నాయకులు పాల్గొన్నారు.

రోగులకు పండ్లు పంపిణీ

గర్మిళ్ల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : దీక్ష దివాస్‌ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్‌లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌కుమార్‌, పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, కౌన్సిలర్లు,నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 10:57 PM