కేజీబీవీల్లో సమస్యలెన్నో...!
ABN , Publish Date - Oct 29 , 2024 | 10:37 PM
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) సమస్యలతో సతమతమవుతున్నాయి. అరకొర సౌకర్యాలతో అటు సిబ్బందికి, విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మంచిర్యాల, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) సమస్యలతో సతమతమవుతున్నాయి. అరకొర సౌకర్యాలతో అటు సిబ్బందికి, విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర వేతనాలతో సిబ్బంది వెట్టి చాకిరీకి గురవుతున్నారు. పనికి తగ్గ వేతనం వీరికి అందడం లేదు. మరోవైపు హాస్టళ్లకు కేర్‌టేకర్ల, నైట్ వాచ్ ఉమన్లు లేక తమకు రక్షణ కరువుతోందనే ఆందోళన విద్యార్థినుల్లో వ్యక్తమవుతోంది.
సమస్యలతో సతమతం.....
కేజీబీవీల్లోని ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారు. స్పెషల్ అధికారి, సీఆర్టీ సహా కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బంది అంతా చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్‌ఓలకు జీతం రూ.33 వేలు కాగా సీఆర్టీలకు రూ.26 వేలు అందుతోంది. సీఆర్పీలకు రూ.19,500, అకౌంటెంట్లకు రూ.14,300, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.7,800 ఇస్తున్నారు. ఏఎన్‌ఎంలు, నైట్ వాచ్ వుమన్లు, డే వాచ్ వుమన్లు, స్వీపర్లు, స్కావెంజర్లు.. ఇలా అందరికీ పనికి తగిన వేతనం ఇవ్వడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది...
వేధిస్తున్న సిబ్బంది కొరత...
జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో కొన్నింటిలో సరిపడా కేర్‌టేకర్లు, నైట్ వాచ్ ఉమన్లు లేక విద్యార్థినులకు భద్రత లేకుండా పోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మంచిర్యాల జిల్లాలో 18 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. మొత్తం 4499 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. వాటిలో ప్రస్తుతం 405 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బోధన సిబ్బంది (టీచర్లు) 200 మంది, బోధనేతర సిబ్బంది 205 మంది పని చేస్తున్నారు. ఆయా విద్యాలయాల్లో సిబ్బంది కొరత ఇంకా ఉంది. 10 మంది వరకు టీచర్లు, అంతకు రెట్టింపు సంఖ్యలో ఇతర ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్థినులకూ తప్పని ఇబ్బందులు...
ఒక్కో కస్తూర్బాగాంధీ విద్యాలయంలో సుమారు 250 నుంచి 350 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలల్లో వేడినీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన సోలార్ సిస్టం పనిచేయడం లేదు. భీమిని కస్తూర్భా బాలికల ఆశ్రమ పాఠశాలలలో సోలార్ వాటర్ హీటర్ చెడిపోయి చన్నీటి స్నానాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయా విద్యాలయాల్లో మరుగుదొడ్లు సరిపోకపోవడంతో సమయం వృథా అవుతోందని వారు అంటున్నారు. పైగా పలుచోట్లా డోర్లు పాడైపోవడం, మరుగుదొడ్ల ట్యాంకులు నిండి వాటిని సకాలంలో శుభ్రం చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరిగా న్యాప్‌కిన్స్ ఇవ్వడం లేదని, హెల్త్ కిట్‌కు బదులు రూ. 100 చెల్లిస్తున్నారని తెలిపారు. అవి కూడా ఎప్పుడు మంజూరవుతాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్‌లు ఇవీ.....
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం స్కేలు అమలు చేయాలని డిమాండ్‌లు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఉద్యోగికీ జీవిత బీమా రూ. 10 లక్షలు, ఆరోగ్యబీమా రూ.5 లక్షలు వర్తింపజే యాలని, విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజీ కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. పదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని పర్మనెంటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.