అధిక రసాయనాల వినియోగంతో అనర్థం
ABN , Publish Date - Sep 23 , 2024 | 10:41 PM
రైతులు రసాయన ఎరువులను పంటల్లో కుమ్మరిస్తున్నారు. అవసరానికి మించి ఎరువులను వాడుతున్నారు. అధిక వినియోగంతో జిల్లా నేలల్లో భాస్వరం, పొటాష్ నిల్వలు పేరుకపోయాయి. విచ్చలవిడిగా ఎరువులను వాడడంతో కొన్ని నేలల్లో పోషకాలు ఎక్కువగా, మిగతా చోట్ల తక్కువగా ఉన్నాయి.
నెన్నెల, సెప్టెంబరు 23:
రైతులు రసాయన ఎరువులను పంటల్లో కుమ్మరిస్తున్నారు. అవసరానికి మించి ఎరువులను వాడుతున్నారు. అధిక వినియోగంతో జిల్లా నేలల్లో భాస్వరం, పొటాష్ నిల్వలు పేరుకపోయాయి. విచ్చలవిడిగా ఎరువులను వాడడంతో కొన్ని నేలల్లో పోషకాలు ఎక్కువగా, మిగతా చోట్ల తక్కువగా ఉన్నాయి. ఫలితంగా పోషకాల సమతుల్యత దెబ్బతిని దిగుబడులు పెరగడం లేదు. విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకం... తగ్గిన సహజ ఎరువుల వినియోగం.. పంటమార్పిడి లేక పోవడం వెరసి జిల్లా భూములు సహజత్వాన్ని కోల్పోతున్నాయి.
-విచ్చల విడిగా రసాయన ఎరువుల వాడకం
జిల్లాలో రసాయన ఎరువుల వినియోగం పెరిగింది. ఒక పంట సీజన్‌లో 1,18,947 మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు వాడుతున్నారు. యూరియా 41,661 మెట్రిక్ టన్నులు, డీఏపీ 21,901 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 38,504ల మెట్రిక్ టన్నులు, పొటాష్ 9,623 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 5,476 మెట్రిక్ టన్నులు, జింక్ సల్ఫేట్ 1,832 మెట్రిక్ టన్నులు వాడుతున్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. దీనికి రెట్టింపు ఎరువులు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. పర్యావరణానికి పెనుముప్పు అని తెలిసి కూడా అధిక దిగుబడులు సాధించాలన్న అత్యాశతో రసాయనాలు విచ్చలవిడిగా వాడుతున్నారు. రసాయనాలు భూమి లోకి ఇంకి వాన నీటితో చెరువులు, నదుల్లో కలిసి పోతున్నాయి. ఫలితంగా సాగు నీరు, నేల మాత్రమే కాకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
-జిల్లా నేలల పరీస్థితి ఇదీ...
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించారు. గ్రామాల వారీగా మట్టి నమూనాలు సేకరించి పరీక్షించారు. జిల్లా నేలల్లో ఫాస్పరస్, పొటాషియం అత్యధికంగా ఉండగా.. నత్రజని లోపం ఉన్నట్లు గుర్తించారు. వేమనపల్లి, భీమారం, మంచిర్యాల మండలాల్లో అవసరానికి మించి భాస్వరం ఉంది. ఈ మండలాల్లో ఎకరానికి 24 నుంచి 33 కేజీల ఫాస్పరస్ నిల్వలు ఉన్నాయి. మిగతా మండలాల్లో ఎకరానికి 10 నుంచి 23 కేజీల ఫాస్పరస్ నిల్వలున్నాయి. ఈ మండలాల్లో డీఏపీ పెద్దగా వినియోగించాల్సిన అవసరం లేదు. కాని రైతులు మోతాదుకు మించి డీఏపీ వాడుతున్నారు. దండెపల్లి, లక్షెట్టిపేట, నస్పూర్, జైపూర్, భీమారం, వేమనపల్లి మండలాల్లో పొటాషియం నిల్వలు అధికంగా ఉన్నాయి. భీమినిలో 51 శాతం నత్రజని లోపం నమోదైంది. 16 శాతం నేలల్లో సల్ఫర్ లోపం ఉంది. వివిధ మండలాల్లో 8 నుంచి 23 శాతం గంధంకం లోపాన్ని గుర్తించారు.
- నేలలు నిస్సారం...
పంటల దిగుబడి ప్రధానంగా నేలసారం, సాగుచేసే రకం, యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. నేలలో సహజ సిద్ధంగా అనేక పోషకాలు ఉంటాయి. వీటి స్థితి గతులను అంచనా వేయకుండా ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల సాగుఖర్చు పెరగడమే కాకుండా భూమి నిస్సారంగా మారుతుంది. పశుసంపద తగ్గడంతో సేంద్రియ ఎరువులు లభించడం లేదు. దీంతో రసాయన ఎరువుల పైనే ఆదారపడుతున్నారు. మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు వాడటం వల్ల భూమిలోని మిత్రపురుగులు నశించి పోతున్నాయి. ఏళ్లతరబడి ఇలాగే విచక్షణ రహితంగా రసాయనాలు వాడితే మట్టి తన భౌతిక లక్షణాలు కోల్పోయి పంటలు పండని పరిస్థితులు వస్తాయి.
-పత్తితోనే ముప్పు
జిల్లాలో ప్రధాన పంటలు వరి, పత్తి కాగా 70 శాతం రైతులు పత్తినే సాగు చేస్తున్నారు. కలుపులేని పంట కోసం పత్తి రైతులు బీజీ-3 (గ్లైసిల్) విత్తనాలు వాడుతున్నారు. కలుపు నివారణకు కూలీలకు బదులు నిషేధిత గ్లైఫోసెట్ మందును పిచికారి చేస్తున్నారు. సాధారణంగా పత్తికి పురుగు మందులు మూడు సార్లు వాడితే ఎక్కువ. కాని 3 సార్లు కలుపు నివారణ మందు, మరో నాలుగైదు సార్లు క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తున్నారు. దుక్కిలో మాత్రమే వేయాల్సిన డీఏపీని ఆ తర్వాత కూడా వాడుతున్నారు.
రసాయన ఎరువులతో కీడే ఎక్కువ
-డాక్టర్ శివకృష,్ణ వ్యవసాయ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్, కృషి విజ్ఞాణ కేంద్రం బెల్లంపల్లి
మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటంతో అధిక నిల్వలు భూమిలో పేరుకుపోతున్నాయి. పదేపదే రసాయన ఎరువులపైన ఆధారపడితే భూ భౌతికస్థితి దెబ్బతిని మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచుకోవాలి. భూమిలో ఉన్న భాస్వరం పంటకు అందాలంటే జీవన ఎరువులు (పీఎస్‌బీ) వాడాలి. వ్యవసాయ శాఖ సమన్వయంతో గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి రసాయన ఎరువుల అధిక వాడకంతో జరిగే అనర్థాలపై రైతుల్లో అవగాహన పెంపొందిస్తున్నాం.