Share News

ప్రజా సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే

ABN , Publish Date - Nov 23 , 2024 | 10:41 PM

నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి స్ధానికంగా అందుబాటులో ఉంటానని దైవసాక్షిగా ప్రమాణం చేసి గెలిచిన తర్వాత హైద్రాబాద్‌కే పరిమితమయ్యాడని తెలిపారు.

ప్రజా సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే

బెల్లంపల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి స్ధానికంగా అందుబాటులో ఉంటానని దైవసాక్షిగా ప్రమాణం చేసి గెలిచిన తర్వాత హైద్రాబాద్‌కే పరిమితమయ్యాడని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం 9 పాలిటెక్నిక్‌ కళాశాలలను ఇంజనీరింగ్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసిందని, బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కళాశాల కాకపోవడానికి ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమన్నారు. మంత్రి పదవి కోసం ఢిల్లీలో మకాం పెట్టి ప్రజల సమస్యలను గాలికి ఒదిలేస్తున్నాడని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇటీవల నూతనంగా మెడికల్‌ కళాశాలలు మంజూరయ్యాయని, బెల్లంపల్లికి మంజూరు కాకపోవడానికి ఎమ్మెల్యే చేతకానితనమే కారణమన్నారు. చుట్టపు చూపుగా నెలకు రెండు సార్లు వచ్చి వెళ్తుండడంతో అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే సరైన సమయంలో ఎల్‌వోసీ అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అబద్దపు హామీలతో రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే వినోద్‌ అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. 15 రోజులుగా పట్టణంలో తాగునీటి సమస్య ఉన్నా పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, పట్టణాధ్యక్షుడు నూనేటి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 10:42 PM