ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ABN , Publish Date - Dec 31 , 2024 | 10:35 PM
కాల చక్రంలో మరో ఏడాది కనుమరుగైంది. గత యేడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం నుంచే విందులు, సంబరాలు ప్రారంభమయ్యాయి. మద్యం, మాంసం, కేక్‌లు, కూల్ కేక్‌లు, రంగవల్లుల, కూల్‌డ్రింక్‌లు, రకరకాల రంగులు విక్రయాలు జోరుగా సాగాయి. ఆయా కూడళ్ళ దగ్గర, స్వీట్ హౌజ్, ఇతర దుకాణాల వద్ద కేక్‌లు విక్రయించారు. నూతన సంవత్సరం 2025కు స్వాగతం పలుకుతూ మంగళవారం రాత్రి 12 గంటలకు సంబరాలు అంబరాన్నంటాయి.
మంచిర్యాల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నూతన వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా యువత మస్త్‌గా ఎంజాయ్ చేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొనేం దుకు జిల్లా వ్యాప్తంగా ముఖ్య పట్టణాలు, ఫాం హౌజ్‌లు, హోటళ్లను ముందుగానే బుక్ చేసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచే మాంసం, మద్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పోలీస్‌శాఖ డీజేల నిషేధం, డ్రంకెన్ డ్రైవ్ ఆంక్షలు విధించినప్పటికీ 31న రాత్రి యువత పెద్ద మొత్తంలో పార్టీల్లో మునిగి తేలింది. మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేసి, డ్యాన్సుల్లో మునిగి తేలారు.
ఏరులై పారిన మద్యం
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారింది. హాజీపూర్ మండలం గుడిపేట సమీపంలో ఉన్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్) గోదాంలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. లిక్కర్ గోదాం నుంచి జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూర్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని షాపుల్లో మద్యం కొనుగోళ్లకు జనం బారులు తీరారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబరు 31న భారీ అమ్మకాలు నమోదయ్యాయి. చివరి రోజున ఏకంగా రూ.8 కోట్ల 10 లక్షల విలువగల విక్ర యాలు జరగడం గమనార్హం. 2024 ముగింపు సందర్భంగా చివరి మూడు రోజుల్లో ఏకంగా రూ.11.26 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోద య్యాయి. గతేడాదితో పోల్చితే మద్యం అమ్మకాలు పెరిగాయి. 2023 డిసెంబరు 31న రూ.5 కోట్ల 69 లక్షల విలువగల మద్యం అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం మొత్తం రూ. 11కోట్ల 19 లక్షల అమ్మకాలు జరు గగా, ఈ సంవత్సరం రూ. 7 లక్షల పై చిలుకు అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి. ఈ సంవత్సరం 10,570 కేసుల లిక్కర్ అమ్మకాలు జరుగా 14,296 కేసుల బీర్ల విక్రయాలు నమోదయ్యాయి. లిక్కర్‌తో పోల్చితే ఈ సంవత్సరం బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
పెద్ద మొత్తంలో మాంసం కొనుగోళ్లు...
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జిల్లాలో పెద్ద మొత్తంలో మాంసం కొనుగోళ్లు జరిగాయి. జిల్లా కేంద్రంలోని పాత వుంచిర్యాల వంతెన సమీపంతోపాటు హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలోని మేకల మండీల్లో పెద్ద మొత్తంలో మేకలను విక్రయించారు. జిల్లాలోని కోల్‌బెల్ట్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని మటన్ షాపుల్లో సుమారు రూ. కోటి విలువగల మాంసం విక్రయాలు జరిగినట్లు మండీల నిర్వాహకులు చెబుతున్నారు. వీటికి అదనంగా పాత మంచిర్యాల సమీపంలోని రంగంపేట, శ్రీరాంపూర్, తాండూర్ ఐబీ, పెద్దపల్లి జిల్లా రాజారాంపల్లి, తదితర ప్రాంతాల నుంచి జిల్లా వాసులు పెద్ద మొత్తంలో మేకలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే చికెన్ సెంటర్లలో సైతం భారీ అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. డిసెంబరు 31ని పురస్కరించుకొని ఒక్క మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే రూ. 60 లక్షల విలువ గల చికెన్ అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.
కిటకిటలాడిన బేకరీలు....
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో ప్రజలు మంగళవారం ఉదయం నుంచే పెద్ద మొత్తంలో కేకులు కొనుగోలు చేశారు. జిల్లా కేంద్రంలోని క్వాలిటీ బేకరి, పాత మంచిర్యాలలోని రామకృష్ణ బేకరి ఔట్ లెట్లు, స్వీట్ హౌజ్‌లు ప్రజలతో కిటకిటలాడాయి. మంచిర్యాల, నస్పూర్, శ్రీరాం పూర్, బెల్లంపల్లి, తదితర ఏరియాల్లో రోడ్ల పక్కన తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి కేకులు విక్రయించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ షాపుల్లో రూ. 4 కోట్ల పైచిలుకు విలువైన కేక్‌లు, స్వీట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి 12 గంటలు కాగానే ప్రజలంతా కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకుంటూ నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు.
మందుబాబులకు కఠిన నిబంధనలు....
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి పోలీస్‌శాఖ కఠిన నిబంధనలు విధించింది. మద్యం మత్తులో వాహనాలు జరిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పై విధంగా నిర్ణయం తీసుకుంది. రామగుండం కమిషనరేట్‌లోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో భారీ ఎత్తున పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రెండు మూడు రోజుల ముందు నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఏర్పాటు చేస్తామని పోలీస్‌శాఖ ప్రకటించింది. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి భారీ మొత్తంలో జరిమానా విధించేందుకు రంగం సిద్ధమైంది.