Share News

నీల్వాయి ప్రాజెక్ట్‌కు తొలగిన అడ్డంకులు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:16 PM

తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్న ప్రభుత్వ ఆశయం ఎట్టకేలకు నెరవేరేందుకు మార్గం సుగమమైంది. ఇంతకాలం నిధుల కేటాయింపుల్లో జాప్యం కారణంగా ఆ చర్యలు ముందుకు రాలేదు. వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టుకు తక్కువ మొత్తంలో నిధులు వెచ్చించడం ద్వారా సుమారు 5 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

నీల్వాయి ప్రాజెక్ట్‌కు తొలగిన అడ్డంకులు

మంచిర్యాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్న ప్రభుత్వ ఆశయం ఎట్టకేలకు నెరవేరేందుకు మార్గం సుగమమైంది. ఇంతకాలం నిధుల కేటాయింపుల్లో జాప్యం కారణంగా ఆ చర్యలు ముందుకు రాలేదు. వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టుకు తక్కువ మొత్తంలో నిధులు వెచ్చించడం ద్వారా సుమారు 5 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రూ. 50 లక్షల ఖర్చుతో...

ప్రాజెక్టు నుంచి ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కేవలం రూ.50 లక్షలు ఖర్చు చేస్తే మార్గం సుగమమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా చర్యలు చేపట్టడంలో జాప్యం జరిగింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే పెండింగులో ఉన్నాయి. మరోవైపు జూన్‌లోనే పనులు పూర్తి చేయా లని నిర్ణయించినా కార్యాచరణ ప్రారంభించలేదు. జలయజ్ఞం పథకంలో భాగంగా మండలంలోని నీల్వాయి వాగుపై నిర్మించిన ఈ ప్రాజెక్టు సామర్థ్యం 0.846 టీఎంసీలు కాగా 2006లో రూ.216 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు.

స్టేజ్‌-2 అనుమతులు లభించినా

వేమనపల్లి మండలంలో 2006లో రూ.90.50 కోట్లతో నీల్వాయి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. కుడి కాలువ ద్వారా 5,600 ఎకరాలకు నీరు అందుతుండగా, ఎడమ కాలువ ద్వారా 7,400 ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. ఈ కాలువ పనులు 75 శాతం మేర పూర్తయిన తరువాత 2016లో రూ.211.32 కోట్లతో ప్రాజెక్టు నమూనా మార్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకం ఏఐబీసీ కింద నిధులు కేటాయించగా జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి మండలాల పరిధిలోని 13వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే రెండు మండలాల పరిధిలో నీరందించే ప్రాజెక్టు అటవీ ప్రాంతంలో ఉండటంతో నిర్మాణానికి కేంద్ర అటవీశాఖ అనుమతులు నిరాకరించింది. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగగా, అటవీ భూముల్లో పనులు చేపట్టేందుకు అటవీ శాఖకు రూ. 50 లక్షల 29వేల 500లు చెల్లించాలనే డిమాండ్‌తో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ గతేడాది డిసెంబరు 14న స్టేజ్‌-2 అనుమతులు జారీ చేసింది.

సొమ్ము డిపాజిట్‌ చేసిన ఇరిగేషన్‌ శాఖ

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కార్యాచరణ ప్రారంభించడంలో ఆలస్యం జరిగినప్పటికీ, ఎట్టకేలకు సొమ్ము చెల్లించడంతో మార్గం సుగమమైంది. ఎనిమిది నెలల అనంతరం ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌ ఎట్టకేలకు సంబంధిత సొమ్ము రూ.50 లక్షలను సెప్టెంబరు 27న కేంద్ర అటవీశాఖ అకౌంట్‌లో డిపాజిట్‌ చేసింది. దీంతో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా ఆయకట్టు రైతుల్లో ఆనందం నింపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నిధుల చెల్లింపు ప్రక్రియ సకాలంలో పూర్తయి పనులు ప్రారంభిస్తే ఈ ఏడాది చివరలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం చైర్మన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో త్వరలోనే కేంద్ర అటవీశాఖ అనుమతులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.

వర్కింగ్‌ పర్మిట్‌ వస్తే పనులకు ఓకే...

రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖకు నగదు చెల్లించినందున వర్క్‌ పర్మిట్‌ రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసి వెంటనే పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టింగ్‌ సంస్థ సిద్ధంగా ఉంది. ప్రాజెక్టు నిర్మాణ పనులను 2011లో ఆనాటి ప్రభుత్వం హైద్రాబాద్‌లోని అర్కే రత్న ఏజెన్సీకి అగ్రిమెంట్‌ చేసింది. ప్రస్తుతం అదే ఏజెన్సీతో పనులు కొనసాగించేందుకు ప్రస్తుత ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఏజెన్సీ కూడా అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నం కాగా, సకాలంలో అనుమతులు వస్తే పనులు ప్రారంభం కానున్నాయి.

మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తాం....

ఇరిగేషన్‌ డీఈ వెంకటస్వామి

కేంద్ర అటవీశాఖ కోరిన మేరకు సంబంధిత నిధులను గత నెలలో డిపాజిట్‌ చేశాం. పనులు చేపట్టేందుకు వర్క్‌ పర్మిట్‌ కోసం వేచి చూస్తున్నాం. ఈ అంశంపై ఈ నెల 23న హైద్రాబాద్‌లో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేయనున్న ఉన్నతస్థాయి సమావేశంలో విధివిధానాలు రూపొందించే అవకాశాలు ఉన్నాయి. దీపావళి అనంతరం పనులు ప్రారంభించి, మూడు నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తాం.

Updated Date - Oct 22 , 2024 | 11:16 PM