Share News

కామన్‌ మెనూపై స్పష్టత ఏదీ...?

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:24 PM

ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచిన ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి కామన్‌ మెనూ ఎంత ఇవ్వాలనే అంశాన్ని విస్మరించింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, చికెన్‌, మాంసానికి అనుగుణంగా 40 శాతం మెస్‌ చార్జీలను, 200 శాతం వరకు కాస్మొటిక్‌ చార్జీలను పెంచడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు.

కామన్‌ మెనూపై   స్పష్టత ఏదీ...?

మంచిర్యాల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచిన ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి కామన్‌ మెనూ ఎంత ఇవ్వాలనే అంశాన్ని విస్మరించింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, చికెన్‌, మాంసానికి అనుగుణంగా 40 శాతం మెస్‌ చార్జీలను, 200 శాతం వరకు కాస్మొటిక్‌ చార్జీలను పెంచడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. అయితే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేం దుకు చర్యలు చేపట్టినప్పటికీ ప్రకటించిన ధరల ప్రకారం మెనూ అమలు కష్టసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.

పెరిగిన చార్జీలు ఇలా...

3 నుంచి 7వ తరగతి చదివే విద్యార్థులకు ఇప్పటి వరకు నెలకు రూ.950 ఇస్తుండగా, ప్రస్తుతం రూ.1330కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1540కు పెంచారు. ఇంటర్‌ నుంచి పీజీ విద్యార్థులకు రూ.1500 నుంచి రూ.2100కు పెంచారు.

కాస్మొటిక్‌ చార్జీలను బాలికలకు 7వ తరగతి వరకు రూ.55 నుంచి రూ.175 వరకు, 11 సంవత్సరాల వయస్సు పైబడిన బాలికలకు రూ.75 నుంచి రూ.275కు పెంచారు. బాలురకు 7వ తరగతి వరకు రూ.62 నుంచి రూ.150కి, 11 సంవత్సరాల వయస్సు పైబడిన బాలురకు రూ.62 నుంచి రూ.200 వరకు పెంచారు. మెస్‌చార్జీలకు అనుగుణంగా ప్రభుత్వం రూపొందించిన న్యూ కామన్‌ డైట్‌ మెనూను వివిధ గురుకుల విద్యాలయాల్లో ఇటీవల ఆయా శాఖల అధికారులు ప్రారంభించారు. వాస్తవానికి ఎనిమిది సంవత్సరాలుగా మెస్‌, కాస్మొటిక్‌ చార్జీలు పెర గక విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. ఐదేళ్లలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కిరాణ సరుకులు రెండు, మూడింతలు పెరిగినా విద్యార్థులకు ఇచ్చే మెస్‌ చార్జీలు పెరగలేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం లభించక ఇబ్బందులు తప్పలేదు.

గురుకులాల సంఖ్య పెరిగినప్పటికీ....

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న గురుకుల విద్యాలయాల సంఖ్యను పెంచింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున బీసీ గురుకులాలు, ఒక మైనార్టీ, రెండు ఎస్సీ గురుకుల విద్యాలయాలను మంజూరు చేసింది. వీటితో పాటు సాధారణ వసతి గృహాలు, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంత్రం స్నాక్స్‌, పాలు, టీ అందజేసేందుకు మెస్‌ చార్జీలతోపాటు రూపాయికే కిలో బియ్యం సరఫరా చేసింది. 3 నుంచి 7వ తరగతి చదువుతున్న విద్యార్థు లకు రూ.950, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1100, ఇంటర్‌, డిగ్రీ, ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.1500 అందజేశారు. ఓ వైపు గురుకులాల సంఖ్యను పెంచిన ప్రభుత్వం చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా 40 శాతం చార్జీలను పెంచింది. ఆ చార్జీలను ఈ నెల 14 నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. జిల్లాలో 8 బీసీ, 9 ఎస్సీ, 3 మైనార్టీ, 18 గిరిజన గురుకులాలు ఉన్నాయి. 12 బీసీ గురుకులాల్లో 1823 విద్యార్థులు, మూడు మైనార్టీల్లో 1214 మంది, తొమ్మిది ఎస్సీ గురుకులాల్లో 2380 మంది, గిరిజన గురుకులంలో 2680 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

పంపిణీ చేసేదెలా...?

ప్రభుత్వం చార్జీలు పెంచిన ప్రకారం వీక్లీ మెనూ ఇచ్చింది. అయితే మెనూకు సంబంధించి ఆయా ఆహార పదార్థాలు ఒక్కో విద్యార్థికి ఎన్ని గ్రాములు ఇవ్వాలనే అంశాన్ని సూచించలేదు. దానిపై స్పష్టత లేకుండా మెనూ అమలు కష్టసాధ్యం కానుంది. మరోవైపు సంక్షేమ వసతి గృహాల్లో చాలా చోట్ల నూతన మెనూకు అనుగుణమైన వంట పాత్రలు లేవు. చపాతి, పూరీ, ఇడ్లీ తదితర పదార్థాలు తయారు చేసేందుకు పరికరాలు లేవు. వసతి గృహాల్లో సరిపడా నాలుగో తరగతి సిబ్బంది లేరు. కొత్త మెనూ ప్రకారం ఆహార పదార్థాలు వండటానికి సిబ్బందికి శిక్షణతోపాటు వారి సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది

నైతం లక్ష్మన్‌, మంచిర్యాల పోస్ట్‌మెట్రిక్‌ హాస్టల్‌ వార్డెన్‌

ప్రభుత్వం మెస్‌ చార్జీలు పెంచడం హర్షణీయం. విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయం వల్ల మేలైన పౌష్టికాహారం అందించేందుకు అవకాశం లభించింది. అయితే ఒక్కో విద్యార్థికి ఎన్ని గ్రాములు ఇవ్వాలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో మెనూ అమలు కష్టసాధ్యంగా మారింది. ఆయా ఆహార పదార్థాలు ఎంత రేట్లలో కొనాలన్న విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం గురుకులాల్లో గ్యాస్‌, ఇతర వస్తువులు టెండర్‌ ద్వారా సరఫరా చేస్తున్నట్లుగానే ఎస్టీ, ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలకు కూడా మెనూ ప్రకారం వస్తువులు సరఫరా చేయాలి.

Updated Date - Dec 19 , 2024 | 11:24 PM