Share News

పరిహారం కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Sep 24 , 2024 | 10:58 PM

ప్రకృతి వైపరీత్యం కార ణంగా అన్నదాతకు నష్టం వాటిల్లగా ప్రభుత్వపరంగా సాయం అందించ డంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంట నీటి పాలుకావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేలకు వేలు అప్పు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట మొలక దశలోనే నీట మునగడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి.

పరిహారం కోసం   ఎదురుచూపులు

మంచిర్యాల, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యం కార ణంగా అన్నదాతకు నష్టం వాటిల్లగా ప్రభుత్వపరంగా సాయం అందించ డంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంట నీటి పాలుకావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేలకు వేలు అప్పు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట మొలక దశలోనే నీట మునగడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఏపుగా పెరిగిన పత్తి పంటకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది.

జిల్లాలో నీట మునిగిన పంట

భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో ప్రధానంగా 393 మందికి రైతులకు చెందిన పత్తి, వరి పంటలు 543 ఎకరాల్లో నీట ముని గినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాకు వచ్చారు. జన్నారం మండలం తొమ్మిది గ్రామాల్లోని 167 మంది రైతులకు చెందిన మొత్తం 171 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. చెన్నూరు మండలంలోని ఆరు గ్రామాల్లో 60 మందికి చెందిన 127 ఎకరాల పంట పూర్తిగా నీటిపాలైంది. జైపూర్‌ మండలంలోని నాలుగు గ్రామాల్లో 40 మంది రైతులకు చెందిన వందల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. హాజీపూర్‌ మండలంలో రెండు గ్రామాల్లోని 39 మంది రైతులకు చెందిన 89 ఎకరాల పంట నీటిపాలు అయింది. నస్పూర్‌ మండలంలోని ఒక గ్రామంలో 19 మంది రైతులకు చెందిన 41 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మంచిర్యాల మండలానికి సంబంధించి రెండు గ్రామాల్లో 39 మంది రైతులకు చెందిన 89 ఎకరాల పంట నీట మునిగింది.

పంట నష్టం వివరాలు ఇలా

వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. జన్నారం మండలంలో 129 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లగా, 43 ఎకరాల్లో పత్తి పంట, ఏడు ఎకరాల్లో కందికి నష్టం వాటిల్లింది. హాజీపూర్‌ మండలంలో 43 ఎకరాల్లో పత్తి, 28 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. మంచిర్యాల మండలంలో 80 ఎకరాల్లో పత్తి, మూడు ఎకరాల్లో వరి నీటి పాలైంది. నస్పూర్‌ మండలంలో తొమ్మిది ఎకరాల్లో పత్తి, 23 ఎకరాల్లో వరి నీట మునిగింది. జైపూర్‌ మండలంలో వంద ఎకరాల్లో పత్తి, చెన్నూరు మండలంలో 90 ఎకరాల్లో పత్తి పంట నీట ముగింది.

పెట్టుబడి నీటి పాలు

జిల్లాలోని పత్తి, వరి, ఇతర పంటలు సాగు చేసిన రైతన్నలకు తీరని నష్టం వాటిల్లింది. పంట సాగు సమయంలో ఎకరాకు రూ.40 వేలు వెచ్చించినట్లు రైతులు తెలిపారు. భూములు దున్నడం మొదలుకొని విత్తనాలు వేయడం ఎరువులు, కలుపు తీయడం, కూలీలకు వెచ్చించారు. సకాలంలో వర్షాలు కురవడంతో ముఖ్యంగా పత్తి పంటపై రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే అతివృష్టి కారణంగా వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. పంట మొత్తం తుడిచి పెట్టుకుపోవడంతో రెక్కల కష్టం కూడా మిగలక పోగా, సాగు కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.

నెల రోజులు కావస్తున్నా అందని పరిహారం....

భారీ వర్షాల కారణంగా వివిధ రకాల పంటల నష్టాన్ని అంచనా వేసిన అధికారులు రెండు వారాల క్రితం తుది నివేదికను ప్రభుత్వానికి అందజే శారు. క్షేత్రస్థాయిలో పంట చేలను సందర్శించి నష్టం వివరాలను సేకరించారు. జిల్లా వ్యాప్తంగా గోదావరి పరివాహక ప్రాంతాలైన మంచి ర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో నష్టం అపారంగా ఉంది. అయితే నెల రోజులు గడుస్తున్నా పరిహారం అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

ప్రభుత్వంపైనే ఆశలు...

వర్షాలతో ఊహించని విధంగా నష్టం వాటిల్లడంతో ప్రభుత్వంపైనే భారం వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రైతులు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10వేలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు నష్టపరిహారం చేతికి అం దినా కనీసం పెట్టుబడులు తిరిగొస్తాయన్న ఆశతో ఉన్నారు. ఇన్ని రోజు లూ నష్టం అంచనా నివేదిక తయారీలో జాప్యం జరుగగా, ప్రస్తుతం పరి హారం అందించడంలోనూ ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో అన్నదాత లు దిగులు చెందుతున్నారు. త్వరగా పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతుల కోరుతున్నారు.

ప్రభుత్వానికి నివేదిక అందజేశాం

వ్యవసాయశాఖ జిల్లా అధికారి సురేఖ

భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టం అంచనా తుది రిపోర్టును కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి అందజేశాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు పంట నష్టం పరిహారం అందే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Sep 24 , 2024 | 10:58 PM