Share News

‘ఎల్లంపల్లి’ ప్రారంభానికి సన్నాహాలు

ABN , Publish Date - Sep 05 , 2024 | 10:51 PM

ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్స వానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి 20 సంవత్సరాల సుదీర్ఘకాలం తరువాత అధికారికంగా ప్రారంభోత్సవం జరగనుంది. 2004 జూలై 28న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖర్‌రెడ్డ్ది ప్రాజెక్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

‘ఎల్లంపల్లి’ ప్రారంభానికి సన్నాహాలు

మంచిర్యాల, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్స వానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి 20 సంవత్సరాల సుదీర్ఘకాలం తరువాత అధికారికంగా ప్రారంభోత్సవం జరగనుంది. 2004 జూలై 28న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖర్‌రెడ్డ్ది ప్రాజెక్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నత్తనడకన సాగిన పనుల కారణంగా మూడేళ్ళల్లో పూర్తి కావలసిన నిర్మాణం 12 సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టింది. గోదావరి నదిపై ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించేందుకు అప్పటి ప్రభు త్వం 2004లో సుమారు రూ.6 వందల కోట్లు కేటాయించింది. 20.175 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు 30 వేల ఎకరాలకు సాగునీరు అం దించేలా రూపకల్పన చేశారు. ఆనకట్ట నిర్మాణానికి రూ.408.85 కోట్లు కేటాయిం చగా గేట్ల నిర్మాణానికి సుమారు రూ.191 కోట్లు కేటాయించారు. మంచిర్యాల జిల్లా వైపు మట్టికట్ట పొడవు 2.10కిలోమీటర్లు, కరీంనగర్‌ వైపున పొడవు 2.30 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఆనకట్ట పొడవు 1.118 కిలోమీటర్లు కాగా 62 గేట్లు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో 7,385 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా డీపీఆర్‌ తయారు చేశారు. హాజీపూర్‌ మండలంలో 7 గ్రామాలు, లక్షెట్టిపేట మండలంలో రెండు గ్రామాలు ముంపునకు గురికాగా పునరావాస ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టు పుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 148 మీటర్లు కాగా క్రెస్ట్‌ లెవల్‌ 138 మీటర్లు, రోడ్డు బ్రిడ్జీ లెవల్‌ 152 మీటర్లతో నిర్మాణం పూర్తి చేసుకుంది.

సుధీర్ఘంగా సాగిన ఆనకట్ట నిర్మాణం

2004లో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగగా కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ పనులు 2005లో పూర్తయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సిమెంటేషన్‌ ఇండి యా లిమిటెడ్‌ ముంబాయి సంస్థకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్‌ చేసింది. ప్రాజెక్ట్‌ 62 గేట్లు నిర్మించేందుకు పనులను రూ.191కోట్లతో 25.11.2008న ఎస్‌ఇడబ్ల్యూ ఓం మెటల్స్‌(జేవీ) సంస్థకు అప్పగించారు. ఆనకట్ట నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ పనులను అర్థాంతరంగా నిలిపివేయడంతో ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. మిగులు పనులు రూ.116 కోట్లతో గేట్లు నిర్మించేందుకు ఎస్‌ఈడబ్ల్యూ సంస్థకు అప్పగించారు. పన్నెండేళ్ల సుదీర్ఘ కాలం తరువాత 2015లో ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి.

పూర్తి కాని పునరావాస పనులు

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ కింద జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో 9 గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. హాజీపూర్‌ మండలంలోని గుడిపేట, నంనూర్‌, చందనాపూర్‌, రాపల్లి, కొండపల్లి, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాలతో పాటు లక్షెట్టిపేట మండలంలోని గుళ్ళకోట, సూరారం గ్రామాలను ముంపు కింద ఎంపిక చేశారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ కింద హాజీపూర్‌ మండలంలోని రాపల్లి, కర్ణమామిడి, చందనాపూర్‌, కొండపల్లితోపాటు లక్షెట్టిపేట మండలంలోని గుళ్లకోటను ఎంపిక చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాస కాలనీల ఏర్పాట్లు జరుగకపోవడంతో ప్రజలు ఆందోళనలకు దిగారు. దీంతో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆటంకాలు ఏర్పడుతూ వచ్చాయి.

పట్టించుకోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం...

ప్రాజెక్టు నిర్మాణంతోపాటు నిర్వాసిత కాలనీల పనులు పూరయినప్పటికీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభోత్సవానికి ముందుకు రాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు కావడంతో పేరు ప్రఖ్యాతలు వారికి దక్కుతాయన్న ఉద్దేశ్యంతో ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయ నిర్మాణం పూర్తికావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టును వాడుకోవడం ద్వారా ఇతర ప్రాంతాలకు నీటిని తరలించారు. అప్పట్లోనే ప్రాజెక్టు ప్రారంభో త్సవం మరోమారు తెరపైకి వచ్చినా ఆ దిశగా ప్రయత్నాలు జరుగలేదు. దీంతో ఇంతకాలం అనధికారికంగానే ప్రాజెక్టును వినియోగిస్తున్నారు.

మంత్రి హామీతో మళ్లీ తెరపైకి....

ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలను పరిశీలించడానికి ఇటీవల వచ్చిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ నెలాఖరులో సీఎం చేతుల మీదుగా ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో ప్రాజెక్టు ప్రారంభోత్సవం మరోమారు తెరపైకి వచ్చింది. ప్రాజెక్టు ప్రారంభోత్సవంతోపాటు సమీపంలోని 70 ఎకరాలను కలుపుకొని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇది జరిగితే ప్రాజెక్టు రెండు జిల్లాలకు తలమానికంగా నిలవనుంది. మరోవైపు ప్రారంభోత్సవం జరిగితే ప్రాజెక్టుపై నుంచి పెద్దపల్లి జిల్లాకు నేరుగా రాకపోకలు అధికారికంగా సాగే అవకాశాలున్నాయి. దీంతో రెండు జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

Updated Date - Sep 05 , 2024 | 10:51 PM