Share News

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు

ABN , Publish Date - Dec 27 , 2024 | 10:34 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో ప్రజా సంక్షేమమే లక్ష్యం గా ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. దశాబ్దా లుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న పనులు ఎట్టకేలకు కొలిక్కి వస్తున్నాయి. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేకానంద్‌, గడ్డం వినోద్‌లు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు

మంచిర్యాల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో ప్రజా సంక్షేమమే లక్ష్యం గా ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. దశాబ్దా లుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న పనులు ఎట్టకేలకు కొలిక్కి వస్తున్నాయి. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేకానంద్‌, గడ్డం వినోద్‌లు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

మంచిర్యాల నియోజకవర్గంలో....

జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఐబీ సమీపంలోని పాత ప్రభుత్వ అతిథిగృహ ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.324 కోట్ల అంచనాతో ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టను న్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు. దీంతో ఆసుపత్రి నిర్మాణానికి మార్గం సుగమంకాగా గత నెల 21న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు శంకుస్థాపన చేశారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంతో మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. అదే ప్రాంగణంలో మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించనున్నారు. రెండు ఆసుపత్రులు ఒకే ప్రాంగణంలో నిర్మించడం వల్ల రోగు లకు వైద్యసేవల పరంగా అందుబాటులో ఉండను న్నాయి. ఎంసీహెచ్‌ గోదావరి సమీపంలో ఉండటంతో వర్షాకాలంలో యేటా వరద ముంపునకు గురవుతోంది. దీంతో ఎంసీహెచ్‌ను కూడా ఐబీ సమీపంలోనే నిర్మిస్తున్నారు.

ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి మోక్షం....

జిల్లా కేంద్రంలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి మోక్షం కలిగింది. సాయికుంటలో ప్రభుత్వం స్థలం సర్వే నెంబర్లు 662, 675లలో 10 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సూచనలతో స్పోర్ట్స్‌ అథారిటీకి కేటా యిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ స్థలంలో సుమారు రూ.30 కోట్ల అంచనాతో మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించేందుకు మార్గం సుగమమైంది. వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌, జూడో, రెజ్లింగ్‌, టేబుల్‌టెన్నిస్‌ ఆడేందుకు ఇండోర్‌ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే సింథటిక్‌ ట్రాక్‌, స్విమ్మింగ్‌ ఫూల్‌ నిర్మించనున్నారు. ఇండోర్‌ స్టేడి యం అంచనా వ్యయంలో కొంత మొత్తం ఖేలో ఇండి యా భరించనుండగా, మిగతా నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. ఇండోర్‌ స్టేడియం ఆవరణలో స్పోర్ట్స్‌ హాస్టల్‌ నిర్మాణం చేపట్టేందుకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రూ. 260 కోట్లతో కరకట్టల నిర్మాణం....

మంచిర్యాల పట్టణంలోని రాళ్లవాగుకు కరకట్టల నిర్మాణం చేపట్టడం ద్వారా వరదను నివారించడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. కార్మెల్‌ స్కూల్‌ బ్రిడ్జి నుంచి 7.5 కిలోమీటర్ల పొడవుతో సుమారు 140 మీటర్ల ఎత్తుతో ఇరువైపులా కరకట్టలు నిర్మించనున్నారు. రూ. 260 కోట్ల అంచనాతో కరకట్టల నిర్మాణం జరుగనుంది. రాళ్లవాగు ప్రవాహంతో జిల్లా కేంధ్రంలోని ఏడెనిమిది కాలనీలు వర్షాకాలంలో వరద ముంపునకు గురవుతు న్నాయి. ప్రతిసారీ వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ఎమ్మెల్యే కృషితో కరకట్టల నిర్మాణానికి మోక్షం లభించింది.

శ్మశాన వాటిక నిర్మాణంతో తీరనున్న కష్టాలు...

జిల్లా కేంద్రంలో హిందూ శ్మశాన వాటిక లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. గోదావరి ఒడ్డున శ్మశాన వాటిక నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. భూధాన్‌ భూములు నాలుగు ఎకరాల్లో రూ. 4 కోట్ల నిధులతో శ్మశాన వాటికకు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఇటీవల శంకుస్థాపన చేయడంతో పనులు వేగం పుంజుకున్నాయి. ఇంతకాలం ఓ వ్యాపారి నిర్మించిన శ్మశాన వాటికపై ఆధారపడుతుండగా, వర్షాకాలంలో గోదావరిలోకి నీళ్లు చేరినప్పుడల్లా అది ముంపునకు గురవుతోంది. దీంతో అంత్యక్రియలకు ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది.

మున్సిపల్‌ కార్పొరేషన్‌కు లైన్‌ క్లియర్‌...

మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చేం దుకు లైన్‌ క్లియర్‌ అయింది. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. మంచిర్యాల పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతోపాటు ప్రధాన రైల్వే మార్గం అందుబాటులో ఉండటంతో వేగంగా అభివృద్ధి సాధించింది. 1956లో మంచిర్యాల మున్సిపాలిటీగా ఏర్పాటు కాగా, అప్పటి నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. మంచిర్యాల చుట్టు పక్కల బొగ్గు బావులు, సిరామిక్‌ ఇండస్ట్రీలతోపాటు, విద్యుత్‌ పరిశ్రమలు ఉన్నాయి. నూతనంగా ఏర్పడ్డ నస్పూర్‌ మున్సిపాలిటీతోపాటు హాజీపూర్‌ మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బెల్లంపల్లి వాసులకు తాగునీరు....

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ప్రత్యేక కృషితో నియోజకవర్గ ప్రజల దాహం తీర్చేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఆసిఫాబాద్‌ జిల్లాలోని అడహక్‌ ప్రాజెక్టు నుంచి నీరు అందుతుండగా, ప్రస్తుతం హాజీపూర్‌ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పూర్తిస్థాయిలో నీరు ఇవ్వనున్నారు. రూ.62 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేకంగా రిజర్వాయర్లు, పైపులైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించగా పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయం రోడ్డుకు సైతం మోక్షం లభించింది. అటవీ అనుమతులు లేక రహదారి నిర్మాణానికి అడ్డంకులు ఉండేవి. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ కృషితో ఇటీవల అటవీ అనుమతులు రావడంతో మార్గం సుగమమైంది. రూ.2 కోట్ల అంచనా వ్యయంతో అమృత్‌ 2.0 పథకంలో గ్రామం నుంచి ఆలయం వరకు రహదారి నిర్మాణానికి ఇటీవల ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా పనులు ప్రారంభమయ్యాయి.

రూ. 500 కోట్లతో చెన్నూరు అభివృద్ధి

చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గడ్డం వివేకానంద ప్రత్యేక చొరవతో రూ.500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తదితర పనులు ఉన్నాయి. నిరుద్యోగ యువతకు చేయూతగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మందమర్రి పట్టణంలో లెదర్‌ పార్క్‌ పునఃప్రారంభానికి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా రూ.20 లక్షలు ఇప్పటికే మంజూరు కాగా త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. భీమారంలోని జోడు వాగులపై రహదారి నిర్మాణానికి రూ.100 కోట్లను ఎమ్మెల్యే మంజూరు చేయించారు. జోడువాగుల బ్రిడ్జి మరమ్మతు కోసం రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. క్యాతన్‌పల్లిలో దశాబ్దాలుగా పెండింగులో ఉన్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. నియోజక వర్గంలో తాగునీటి ఏర్పాటుకు రూ. 100 కోట్లతో అమృత్‌ వాటర్‌ స్కీంను ప్రారంభించనున్నారు. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేశారు. నక్కల వాగు బ్రిడ్జి నిర్మాణానికి రూ.13 లక్షలు నిధులు మంజూరయ్యాయి.

Updated Date - Dec 27 , 2024 | 10:34 PM