Share News

రుణమాఫీ సరే భరోసా ఏది..?

ABN , Publish Date - Aug 29 , 2024 | 10:35 PM

జిల్లా వ్యాప్తంగా వానాకాలం వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. సాగు పెట్టుబడి సాయం ఇంకా అందలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ సర్కార్‌ మూడు విడతల్లో రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసింది. వివిధ కారణాలతో చాలా మంది రుణాలు మాఫీ కాలేదు. ఓ వైపు రుణమాఫీ అందక, మరోవైపు కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన మేరకు భోరసా అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

రుణమాఫీ సరే  భరోసా ఏది..?

మంచిర్యాల, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా వానాకాలం వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. సాగు పెట్టుబడి సాయం ఇంకా అందలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ సర్కార్‌ మూడు విడతల్లో రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసింది. వివిధ కారణాలతో చాలా మంది రుణాలు మాఫీ కాలేదు. ఓ వైపు రుణమాఫీ అందక, మరోవైపు కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన మేరకు భోరసా అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఎకరాకు రూ.15 వేలు చెల్లిందేప్పుడో...?

తాము అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకం కింద అర్హతగల రైతులందరికీ ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్‌ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన అనంతరం యాసంగిలో పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. వానాకాలం నుంచి ఎకరాకు రూ.15 చొప్పున పెట్టుబడిసాయం అందజేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రైతుభరోసా పథకం విధివిధానాలు ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే పథకం అమలుకాక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

గత ప్రభుత్వానికి భిన్నంగా....

గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధులో అనేక తప్పిదాలున్నా యని భాంచిన కాంగ్రెస్‌ సర్కారు, దానిని రైతుభరోసా పథకంగా మార్చింది. కొత్తపథకం విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం జూలై 15 లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. దీనికి అనుగుణంగా ఉమ్మడి జిల్లాల స్థాయిలో మంత్రులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. పథకంలో మార్పులు తేవాలని కొందరు, ఐదెకరాల్లోపు రైతులకు పథకం వర్తింపజేయాలని మరికొందరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే 10 ఎకరాలను కటాఫ్‌గా పెట్టాలని రాజకీయనేతలు, ప్రభుత్వ ఉద్యోగు లకు ఇవ్వవద్దని వివిధ వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. మంత్రివర్గ ఉపసంఘం అందించిన నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సి ఉండగా, రైతు భరోసాపై ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాలు ముగిశాయి. దీంతో ఈ సీజన్‌కు రైతు భరోసా అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మూడు విడతల్లో రూ.461 కోట్లు రుణమాఫీ

జిల్లాలోని 56,020 మంది రైతులను రుణమాఫీ పథకానికి ఎంపిక చేయగా, వారిలో 55,778 మందికి నగదు జమ చేశారు. వారి బ్యాంకు ఖాతాల్లో మూడు విడతల్లో రూ.461 కోట్ల 86 లక్షలను ప్రభుత్వం జమ చేసింది. అన్ని అర్హతలు ఉండి, వివిధ కారణాల చేత మూడు విడుతల్లో రుణమాఫీ పొందని రైతులు జిల్లాలో 242 మంది ఉన్నారు. అనేక కారణాల చేత జిల్లా వ్యాప్తంగా పలువురు రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. మరోవైపు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసాపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులు, ఎరువుల డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీ మొదటి విడుతలో 28,392 మందికి రూ.149 కోట్ల 46 లక్షలను బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా, రెండో విడుతలో 14,365 మందికి రూ. 138 కోట్ల 65 లక్షలు, మూడో విడుతలో 13,021 మందిరైతులకు రూ. 173.75 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

Updated Date - Aug 29 , 2024 | 10:35 PM