కార్పొరేషన్ దిశగా అడుగులు
ABN , Publish Date - Dec 20 , 2024 | 10:45 PM
మంచిర్యాల మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కానుంది. ఈ మేరకు ఈ నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్ కార్పొరే షన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
మంచిర్యాల, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కానుంది. ఈ మేరకు ఈ నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్ కార్పొరే షన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలతోపాటు హాజీపూర్ మండలం లోని ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ కార్పొ రేషన్ ఏర్పాటుకు కలెక్టర్ కుమార్ దీపక్ రెండు నెలల క్రితం ప్రతిపాదనలు పంపారు. దీనిపై స్పందించిన సీడీఎంఏ కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన పూర్తి వివరాలు పంపాలని ఆదేశిస్తూ నెల క్రితం మున్సిపల్ అధికారులకు లేఖ రాసింది. ఈ మేరకు రెండు మున్సిపా లిటీలు, ఆరు గ్రామాల్లో జనాభా, ఓటర్లు, కుటుంబాలు, ఆదాయ వనరులు, తదితర అంశాలపై అధికారులు సర్వే సైతం ప్రారంభించారు. సర్వే నివేదిక ప్రభుత్వానికి అందగానే ఫిబ్రవరిలోగా కార్పొరేషన్‌గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మంచిర్యాలకు ప్రత్యేక స్థానం...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మంచిర్యాల పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతోపాటు రైల్వే మార్గం అందుబాటులో ఉంది. మొదటి సారిగా 1956లో మంచిర్యాల మున్సిపాలిటీగా ఏర్పాటు కాగా, అప్పటి నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. 2016లో మంచిర్యాల పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తరువాత మరింతగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం 36 వార్డులతో ఉన్న మంచిర్యాల విద్య, వైద్య సదుపాయాలకు నిలయంగా ఉంది.మంచిర్యాల చుట్టు పక్కల బొగ్గు బావులు, సిరామిక్ ఇండస్ట్రీలతోపాటు, విద్యుత్ పరిశ్రమలు ఉన్నాయి. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా పేరుంది. జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాటి నుంచే మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడుతుందనే ప్రచారం జరుగుతోంది. నూతన మండలాల ఏర్పాటు సందర్భంగా చుట్టు పక్కల గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తారని ప్రజలు భావించారు.
జనాభా ప్రాతిపదికే ప్రమాణం....
జనాభా ప్రాతిపదికన మంచిర్యాలను మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారం భించింది. ఇందులో భాగంగా నూతనంగా ఏర్పాటైన నస్పూర్ మున్సిపాలిటీతోపాటు హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, చందనాపూర్, నర్సింగా పూర్, నంనూర్ గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ కార్పొరేషన్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పం పారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే జీవో నెంబర్ 571 ప్రకారం 2.5 నుంచి 3 లక్షల జనాభా అవసరం ఉంటుంది. ఈ విషయంలో కొంచెం అటు ఇటుగా ఉన్నా కార్పొరేషన్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం మంచిర్యాల మున్సిపాలిటీలో 36 వార్డులకుగాను 87,153 మంది జనాభా ఉండగా, నస్పూర్‌లో మున్సిపాలిటీలో 25 వార్డులకు 76,641, అయితే 2021లో అధికారుల గణాంకాల ప్రకారం మంచిర్యాల మున్సిపాలిటీలో లక్షా 50వేలు, నస్పూర్‌లో 91,427, జనాభా ఉంది. అలాగే విలీన గ్రామాల్లో కనీసం 13వేల జనాభా వరకు ఉంటుందని అంచనా. 2022 ప్రకారం చూస్తే రెండు మున్సిపాలిటీలు, విలీన గ్రామాల్లో మొత్తం జనాభా 2,54,000 మంది ఉన్నారు. ఈ మూడేళ్లలో ఆయా స్థానిక సంస్థల పరిధిలో మరింతగా జనాభా పెరగడం, 150 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉండటంతో కార్పొరేషన్ ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి.
హామీ ఇచ్చి మరిచిన గత ప్రభుత్వం...
మంచిర్యాలను కార్పొరేషన్‌గా మార్చేందుకు సాధ్యా సాధ్యాలపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరా తీసింది. నస్పూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలను విలీనం చేస్తూ మంచిర్యాలను కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తామని 2019 మార్చిలో గోదావరిఖని పర్యటనకు వచ్చిన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్... జనాభా, ఆర్థిక ప్రాముఖ్యతపై నివేదిక ఇవ్వాలని 2019 ఏప్రిల్ 23న ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటి కలెక్టర్ భారతీ హోళికేరి నివేదికను ప్రభుత్వానికి అందజే శారు. అయితే ఐదు సంవత్సరాలు గడిచినా కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఇదిలా ఉండగా 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మంచి ర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మంచిర్యాలను మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తామని ప్రకటిం చారు.
లాభ నష్టాలు...
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు కానుండటంతో కలిగే లాభ, నష్టాలను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తే ప్రత్యేక నిధులు రావడంతో నగరం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ లాంటి పథకాల్లో ఎంపిక చేయనుండటంతో రూ. 100 కోట్ల మేర అదనపు నిధులు సమకూరే అవకాశం ఉంది. నగరాలకు మంజూరయ్యే నిధులు కూడా అందనున్నాయి. ప్లాన్ గ్రాంటు, నాన్ ప్లాన్ గ్రాంటులతోపాటు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి. కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటై, యువతకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయి. అలాగే కార్పొరేషన్‌గా మారితే కొంతమేర నష్టాలు సైతం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విలీన గ్రామాల్లో ఇప్పుడున్న ఇంటి పన్నులు ఇప్పుడు కాకపోయినా ఒకటి, రెండు సంవత్సరాల్లో రెట్టింపయ్యే అవకాశాలు ఉంటాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.