కరకట్టల నిర్మాణానికి సర్వే
ABN , Publish Date - Dec 18 , 2024 | 10:31 PM
మంచి ర్యాల పట్టణానికి ఇకమీదట వరద ముప్పు తప్పనుంది. యేటా వర్షాకాలంలో పట్టణాన్ని ముంచెత్తుతున్న రాళ్ల వాగు వరదలను నివారించేందుకు కరకట్టలు నిర్మించా లని నిర్ణయించిన విషయం తెలిసిందే. వాగుకు ఇరు వైపులా రిటైనింగ్ వాల్ (అడ్డుగోడ) నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా బుధవారం అధికారులు రాళ్లవాగులో సర్వే జరిపారు.
మంచిర్యాల, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మంచి ర్యాల పట్టణానికి ఇకమీదట వరద ముప్పు తప్పనుంది. యేటా వర్షాకాలంలో పట్టణాన్ని ముంచెత్తుతున్న రాళ్ల వాగు వరదలను నివారించేందుకు కరకట్టలు నిర్మించా లని నిర్ణయించిన విషయం తెలిసిందే. వాగుకు ఇరు వైపులా రిటైనింగ్ వాల్ (అడ్డుగోడ) నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా బుధవారం అధికారులు రాళ్లవాగులో సర్వే జరిపారు. సంబంధిత నివేదిక ప్రభుత్వానికి అందజేసిన వెంటనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
నిధులు కేటాయించిన ప్రభుత్వం....
రాళ్లవాగుకు ఇరువైపులా కరకట్టలు నిర్మించేందుకు అవసరమైన నిధులు రూ.260 కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గోదావరిపై నిర్మించిన కాళే శ్వరం ప్రాజెక్టుల సముదాయంలోని ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, కాళేశ్వరం వరకు ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ప్రభా వంతో వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగినప్పుడల్లా జిల్లా కేంద్రం వరద ముంపునకు గురవుతోంది. పట్టణం గుండా ప్రవహిస్తున్న రాళ్ల వాగులోకి గోదావరి బ్యాక్ వాటర్ రావడంతో కాలనీల్లోకి వరదలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంలోని అనేక మంది ఇళ్లు నీట మునిగి ఆస్తి నష్టం వాటిల్లింది. ఎల్లంపల్లి డ్యాం గేట్లు ఎత్తిన ప్రతీసారి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు నుంచి లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే క్రమంలో బ్యాక్ వాటర్ సమస్య తలెత్తు తోంది. ఈ క్రమంలో శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్ నిర్మించాలనే నిర్ణయానికి రాగా అధికారుల సర్వేతో కార్యరూపం దాల్చుతోంది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రత్యేక చొరవతో కరకట్టల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.
ఏడు కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణం
రాళ్లవాగుకు ఇరువైపుల 7.3 కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణం చేపట్టనున్నారు. వానాకాలంలో రాళ్లవాగు నుంచి సుమారు 60వేల క్యూసెక్కుల వరద గోదావరిలో కలుస్తున్నట్లు అంచనా. ఈ వరదకు తోడు గోదావరి బ్యాక్ వాటర్ కలిసి పట్టణంలో లోతట్టు ప్రాం తాలు ముంపునకు గురవుతున్నాయి. దీన్ని నివారించేందుకు రాళ్లవాగు వరద గోదావరిలో కలిసే చోటు నుంచి ర్యాలీగడ్‌పూర్ వెళ్లే బ్రిడ్జి వరకు గోడల నిర్మాణం చేపట్టనున్నారు. వాగు గోడ ఎత్తు, స్థానికంగా వాగు లోతును బట్టి నిర్మించనున్నారు. ఎత్తుగా ఉన్న చోట కనీసం 5 మీటర్లు, గోదావరిలో కలిసే చోట 14 మీటర్ల ఎత్తు వరకు ఉండనుంది. గోదావరి నుంచి పాత మంచిర్యాల బ్రిడ్జి, అమరవీరుల స్తూపం, కార్మెల్ స్కూల్ ఆపైన ర్యాలీ వెళ్లే వంతెనకు సమీపం వరకు వాగుకు ఇరువైపుల రక్షణ గోడ నిర్మించనున్నారు. అలాగే బైపాస్ నమీపంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద హై లెవల్ వంతెన కూడా రూ.3 కోట్లతో నిర్మించనున్నారు. మరోవైపు వాగులోకి వర్షపు నీరు ప్రవహించేలా మూడు చోట్ల ఖాళీగా వదిలేసి, వరద వాగులోకి వచ్చేలా కరకట్టల నిర్మాణం సాగనుంది. అవసరమైన చోట గోడకు నిచ్చెనలు ఉంటాయి. వాగుకు సమీపంలో ఉన్న ఇళ్లకు ఇబ్బంది లేకుండానే గోడ నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
గోదావరికి కరకట్ట లేనట్లేనా...!
గోదావరి తీరం వెంట కూడా కరకట్ట నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ భారీగా నిధులు అవసరం ఉండటంతో ప్రస్తుతానికి ఆ ఆలోచనను విర మించుకున్నట్లు తెలుస్తోంది. నదికి కరకట్ట నిర్మించాలంటే పెద్ద మొత్తంలో భూ సేకరణ అవసరం కాగా, పరిహారం కింద సుమారు రూ.వంద కోట్ల వరకు చెల్లించాల్సి ఉం టుందని అంచనా. దీంతో ప్రస్తుతానికి రాళ్లవాగు గోడల నిర్మాణానికే పరిమితమయ్యారు. రాళ్లవాగు కరకట్టల నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తయిన తరువాత త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. సర్వేలో ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాము, డివిజనల్ ఇంజినీర్ కుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ హరికృష్ణ, వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, భూ రికార్డులు, సర్వే ఏడీ శ్రీనివాస్, మంచిర్యాల సర్వేయర్ మంజుల, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అజీజ్‌లు పాల్గొన్నారు.