వర్గీకరణ జరిగే వరకు ధర్మయుద్ధం ఆగదు
ABN , Publish Date - Nov 02 , 2024 | 10:57 PM
ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ప్రభుత్వంపై ధర్మయుద్ధం ఆగదని ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జ్యోతి పంక్షన్ హాల్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మయుద్ధ సదస్సు నిర్వహించారు.
జన్నారం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ప్రభుత్వంపై ధర్మయుద్ధం ఆగదని ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జ్యోతి పంక్షన్ హాల్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మయుద్ధ సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట తప్పారన్నారు. మాటలతో మభ్య పెడుతున్నారే తప్ప వర్గీకరణపై అడుగు ముందుకు వేయలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 30 ఏండ్లుగా ఎన్నో ఉద్యమాలు చేపడుతూ ఎస్సీ వర్గీకరణ, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పోరాడుతున్నామన్నారు. ఫలితంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిందన్నారు.
ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ధర్మయుద్ధం చేస్తూనే ఉంటామని, దీనికి అన్ని వర్గాల వారు సహకరించాలన్నారు. రాష్ట్రంలో మాదిగలు అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారని, వారిని గుర్తించి వర్గీకరణకు పూర్తిస్ధాయిలో మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాదిగ, సమ్మయ్య, శ్రీనివాస్‌మాదిగ, ప్రభుదాస్ మాదిగ, రమేష్, రవి, రమేష్, శీనయ్య, ఇందయ్య, రమేష్, ఎల్లయ్య, రాజేష్, అంజన్న తదితరులు పాల్గొన్నారు.