Share News

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Nov 05 , 2024 | 10:53 PM

జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల ప్రత్యేక అధికారి కృష్ణాదిత్య అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్లు కుమార్‌దీపక్‌, వెంకటేష్‌ దోత్రె, అదనపు కలెక్టర్లు మోతిలాల్‌, దీపక్‌ తివారి, సబ్‌ కలెక్టర్‌ శ్రద్దశుక్లా, అదనపు ఎస్‌పీ ప్రభాకర్‌రావులతో కలిసి 2 జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల ప్రత్యేక అధికారి కృష్ణాదిత్య అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్లు కుమార్‌దీపక్‌, వెంకటేష్‌ దోత్రె, అదనపు కలెక్టర్లు మోతిలాల్‌, దీపక్‌ తివారి, సబ్‌ కలెక్టర్‌ శ్రద్దశుక్లా, అదనపు ఎస్‌పీ ప్రభాకర్‌రావులతో కలిసి 2 జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యంలో తప్ప తాలు లేకుండా ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కేంద్రాల్లో తాగునీరు, నీడ, టార్పాలిన్‌లు, గన్నీ సంచులు, తేమ యంత్రాలు ఇతర సదుపాయలతో సిద్ధంగా ఉండాలన్నారు. రైసుమిల్లుల్లో రిజిస్టర్‌లను స్పష్టంగా నిర్వహించాలని, రైసుమిల్లర్లతో ఒప్పందాల ప్రక్రియ పకడ్బందీగా ఉండాలన్నారు. సన్నరకం, దొడ్డు రకం వడ్లకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదును జమ చేయాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. కేంద్రాలకు అవసరమైన యంత్రాలు, పరికరాలు అందుబాటులో ఉంచామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రాకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టి అక్రమ రవాణాను నియంత్రించేందుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు.

జన్నారం, (ఆంధ్రజ్యోతి) : మండలంలోని రేండ్లగూడ, మొర్రిగూడ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధాన్యం కొనుగోలు జిల్లా ప్రత్యేకాధికారి కృష్ణ ఆదిత్య ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి, (ఆంధ్రజ్యోతి): రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ఐకేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్‌ అన్నారు. నాగసముద్రం, దండేపల్లిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తాలు తప్ప లేకుండా ఆరబెట్టిన తర్వాతే ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలన్నారు. డీపీఎం వేణుగోపాల్‌, ఐకేపీ ఏపీఎం భూపతి బ్రహ్మయ్య, సీసీలు సురేందర్‌, లావణ్య, వీవోఏ విజయ, పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 10:53 PM